పిజ్జా, బర్గర్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. కేఎఫ్‌సీ, డొమినోస్ కిచెన్లలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు!
హైదరాబాద్‌లో KFC, Domino’s అవుట్లెట్లపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొత్తం 26 స్టోర్లలో పరిశుభ్రత లోపాలు, పాత నూనె వినియోగం, బొద్దింకలు, ఎలుకల వ్యర్థాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు గుర్తించినట్లు సమాచారం. నిబంధనలు ఉల్లంఘించిన 9 అవుట్లెట్ల లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేసి, స్విగ్గీ, జొమాటో నుంచి తొలగించాలని ఆదేశించారు.
మనలో చాలామంది రోడ్డు పక్కన ఉండే బండ్ల మీద ఆహారం తింటే ఆరోగ్యం పాడవుతుందేమోనని అనుకుంటారు. పెద్దపెద్ద మాల్స్‌లో.. ఏసీ గదుల్లో ఉండే ఇంటర్నేషనల్ ఫుడ్ బ్రాండ్ల దగ్గర తింటే చాలా శుభ్రంగా, సురక్షితంగా ఉంటుందని భావిస్తుంటారు. అందుకే వందలు, వేలు ఖర్చు పెట్టి మరీ పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ చికెన్లు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా ఎంతో ముచ్చటపడి కొనిపెడుతుంటారు. కానీ, ఆ మిరుమిట్లు గొలిపే లైట్ల వెనుక, ఆకర్షణీయమైన ప్యాకింగ్ లోపల ఎంతటి భయంకరమైన మురికి, నిర్లక్ష్యం దాగి ఉందో తెలిస్తే ఎవరికైనా కడుపులో దేవడం ఖాయం. తాజాగా హైదరాబాద్ నగరంలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన మెరుపు దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. లోకల్ హోటళ్లే కాదు, అంతర్జాతీయ స్థాయి బ్రాండ్లు కూడా ప్రజల ఆరోగ్యంతో ఏ విధంగా చెలగాటమాడుతున్నాయో ఈ తనిఖీలు కళ్లకు కట్టాయి. హైదరాబాద్ పరిధిలో ఉన్న ప్రముఖ అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజాలు కేఎఫ్‌సీ , డొమినోస్ పిజ్జా అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, పోలీసు సిబ్బందితో కలిసి 13 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గురువారం ఏకకాలంలో 26 అవుట్లెట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కస్టమర్లకు కనిపించే డైనింగ్ హాల్ కాకుండా, అసలు ఆహారం తయారయ్యే కిచెన్లు, సరుకులు నిల్వ చేసే స్టోర్ రూమ్‌లలోకి అడుగుపెట్టిన అధికారులకు అక్కడి దృశ్యాలు చూసి దిమ్మతిరిగిపోయింది. ఈ తనిఖీల్లో బయటపడిన అత్యంత ప్రమాదకరమైన విషయం ‘వంట నూనె రీయూజ్’. సాధారణంగా ఒకసారి వేయించిన నూనెను మళ్లీ మళ్లీ వాడితే అది విషతుల్యమై క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. అయితే, ఖర్చు తగ్గించుకోవడానికి ఈ బ్రాండెడ్ సంస్థలు ఒకసారి వాడిన పాత, నల్లబడిన నూనెను ఫిల్టర్ చేసి మళ్లీ వాడుకోవడానికి ‘మెగ్నీషియం సిలికేట్’ అనే సింథటిక్ కెమికల్‌ను అనధికారికంగా ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ నూనెలో ఈ పొడిని కలిపి ఫిల్టర్ చేస్తే, అది మళ్లీ కొత్త నూనెలా మెరుస్తుంది. ఇలా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ నిల్వ ఉంచిన 52 కిలోల సింథటిక్ మెగ్నీషియం సిలికేట్‌ను అధికారులు సీజ్ చేశారు. కల్తీ అనుమానంతో 20 ఆహార శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపారు. మనం ఎంతో రుచిగా ఆస్వాదించే పిజ్జా బేస్‌లు, చికెన్ ముక్కలు నిల్వ ఉండే స్టోర్ రూమ్‌లలో కనీస పరిశుభ్రత మచ్చుకైనా కనిపించలేదు. పలు బ్రాంచీల వంటగదుల్లో తీవ్రమైన దుర్వాసన వస్తుండగా, ఆహార పదార్థాలపై ఈగలు, బొద్దింకలు తిరుగుతూ కనిపించాయి. కొన్ని చోట్ల ఏకంగా ఎలుకల విసర్జనలు ఉండటం అధికారులను విస్మయానికి గురిచేసింది. చిల్లర్ రూమ్‌లు తుప్పు పట్టిపోయి, పైకప్పు నుంచి మురికి నీరు ఆహార పదార్థాలపై కారుతోంది. గోడల నిండా ఎక్కడ చూసినా బూజులే. అంతేకాకుండా, గడువు తీరిపోయిన సరుకులను అలాగే నిల్వ ఉంచి వంటలకు వాడుతున్నట్లు తేలింది. వంట చేసే సిబ్బంది కనీసం తలకు హెయిర్ నెట్లు, ఒంటికి ఆప్రాన్లు కూడా ధరించకుండా అపరిశుభ్రంగా పనిచేస్తున్నారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే స్థాయిలో నిబంధనలు ఉల్లంఘించిన 9 అవుట్లెట్ల FSSAI లైసెన్సులను అధికారులు తక్షణమే సస్పెండ్ చేశారు. ఆయా స్టోర్లలో వ్యాపార కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. ఆ 9 స్టోర్లు, అక్కడ కనిపించిన లోపాలు ఏంటో చూద్దాం. మదీనాగూడ, మియాపూర్‌లోని కేఎఫ్‌సీ కిచెన్‌లో నీరు కారడం, భరించలేని దుర్వాసన, వాడిన నూనె శుద్ధికి మెగ్నీషియం సిలికేట్ వాడటం లాంటి లోపాలను గుర్తించారు. సింధీ కాలనీ, సికింద్రాబాద్, కేఎఫ్‌సీ ల్లో ఈగల బెడద, కెమికల్‌తో ఫిల్టర్ చేసిన నూనె వాడటం, పంచ్ మొహల్లా, చార్మినార్ పరిధిలోని కేఎఫ్‌సీ లో చిల్లర్ రూమ్‌లో తీవ్ర దుర్వాసన, నూనె రీయూజ్ కోసం మెగ్నీషియం సిలికేట్ వాడుతున్నట్టు గుర్తించారు. మూసారాంబాగ్‌లో తుప్పు పట్టిన చిల్లర్ రూమ్, కోల్డ్ రూమ్‌లో నీరు కారడం, గోడలపై ఫంగస్, జిడ్డు పట్టిన పాత్రలు, బొద్దింకలు స్వైర విహారం కనిపించింది. బంజారాహిల్స్ కేఎఫ్సీలో చిల్లర్‌లలో మురికి నీరు నిలిచిపోవడం, నూనె శుద్ధికి కెమికల్స్ వాడటం షరామామూలే. శిల్పకళా వేదిక, హైటెక్ సిటీ కేఎఫ్‌సీల్లో అపరిశుభ్రమైన వంట పాత్రల్లో కల్తీ నూనెతో వంటలు చేస్తున్నారు. ఇనార్బిట్‌మాల్ కేఎఫ్సీలో అయితే సిబ్బంది కనీస శుభ్రత, జాగ్రత్తలు కూడా పాటించడంలేదు. ఇక డొమినోస్ పిజ్జా విషయానికి వస్తే.. శరత్ సిటీ మాల్, కొండాపూర్ లోని డొమినోస్ పిజ్జా కిచెన్‌లో విపరీతమైన బొద్దింకల బెడద, ప్యాకింగ్ మెటీరియల్‌కు ఫుడ్ గ్రేడ్ సర్టిఫికెట్ లేకపోవడం, ఎక్స్పైర్ అయిపోయిన ఉత్పత్తులను వాడటం గమనించారు. ఇనార్బిట్ మాల్, మాదాపూర్‌లోని డొమినోస్ విషయానికి వస్తే.. స్టోర్ రూమ్‌లో ఎలుకల విసర్జనలు, బొద్దింకలు దర్శనమిచ్చాయి. సిబ్బంది అయితే హెయిర్ నెట్లు, ఆప్రాన్లు కూడా వేసుకోకుండా పని చేస్తున్నారు. కేవలం ఈ 9 స్టోర్లు మాత్రమే కాకుండా, మరో 13 బ్రాంచీలలో కూడా లోపాలు బయటపడ్డాయి. కార్ఖానా, గచ్చిబౌలి, హైటెక్ సిటీలలోని డొమినోస్ బ్రాంచీలు; నిజాంపేట, గచ్చిబౌలిలలోని కేఎఫ్‌సీ బ్రాంచీలకు భారీ జరిమానాలు విధించేందుకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. అలాగే నిజాంపేట, మియాపూర్, హిమాయత్ నగర్, మలక్పేటలలోని డొమినోస్ స్టోర్లు; కొండాపూర్, కార్ఖానా, హిమాయత్ నగర్, షేక్పేటలలోని కేఎఫ్‌సీ స్టోర్లకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఇచ్చారు. త్వరలోనే వీటిపై మళ్లీ తనిఖీలు జరగనున్నాయి. మరోవైపు, ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లు మోసపోకుండా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. లైసెన్సులు సస్పెండ్ అయిన ఈ 9 అవుట్లెట్లను తమ యాప్‌ల నుంచి తక్షణమే తొలగించాలని స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు టీజీ సేఫ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రముఖ మాల్స్‌లో, ఖరీదైన ఏరియాల్లో ఉండే బ్రాండెడ్ అవుట్లెట్ల పరిస్థితే ఇంత దారుణంగా ఉంటే, ఇక సాధారణ హోటళ్ల పరిస్థితి ఏంటనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ కలవరపెడుతోంది. కేవలం బ్రాండ్ పేరు చూసి, ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి మన ఆరోగ్యాన్ని పణంగా పెట్టకూడదు. బయట ఆహారం తినేటప్పుడు అప్రమత్తంగా ఉండటంతో పాటు, సాధ్యమైనంత వరకు ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వడం మన ఆరోగ్యానికి శ్రీరామరక్ష.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మంజీరా నీళ్లు బంద్! సైబరాబాద్‌లో ఏం జరగబోతోంది? జనవరి నుంచి గడ్డుకాలమేనా?
పుష్ప సినిమాకు మించిన స్కెచ్.. మామూలుగా లేదుగా!
పండగ పేరుతో విచ్చలవిడి ఖర్చులు! ఈ తప్పు మీరూ చేస్తున్నారా?
ఇదెక్కడి గోల.. రెండేళ్ల కిందటి కరెంట్ బిల్లు ఇప్పుడు కట్టాలా?
బాసరకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి కొత్త రూట్ వచ్చేసింది
