చిన్న జీయర్ స్వామి చేస్తున్న కృషి వెలకట్టలేనిది: మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాలు, యతీంద్ర సప్తతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. జీయర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు, ప్రాజెక్ట్ సహస్ర లక్ష్యాలు, జీయర్ పురస్కారాల ప్రదానం విశేషంగా నిలిచాయి.
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో వైభవంగా యతీంద్ర సప్తతి వేడుకలు జరుగుతున్నాయి. లోక క్షేమం, ప్రపంచ శాంతి, దేశ రక్షణే లక్ష్యంగా శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాల్లో పాల్గొన్న మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత 36 ఏళ్లుగా స్వామివారి భక్తుడిగా కొనసాగుతున్నామని, జీయర్ ట్రస్ట్ ద్వారా చిన్న జీయర్ స్వామి విద్య, వైద్యం, మహిళా సంక్షేమ రంగాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.సాంస్కృతిక సంప్రదాయాలు, వేద విజ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు చిన్న జీయర్ స్వామి చేస్తున్న కృషి వెలకట్టలేనిదని పేర్కొన్నారు. వైష్ణవ సంప్రదాయ పరిరక్షణ, భావితరాలకు ఆధ్యాత్మిక విలువలను అందించడమే లక్ష్యంగా చేపట్టిన ప్రాజెక్ట్ సహస్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జూపల్లి రామేశ్వరరావు పిలుపునిచ్చారు. జూపల్లి రామేశ్వరరావు సతీమణి జూపల్లి శ్రీ కుమారి మాట్లాడుతూ స్వామివారి తిరునక్షత్ర మహోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయని, భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
యతీంద్ర సప్తతి కార్యక్రమంలో భాగంగా శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి.. 36వ, 37వ జీయర్ పురస్కారాలను ప్రదానం చేశారు. వేద, ద్రవిడ ప్రబంధాల్లో విశేష పాండిత్యం కలిగిన గుడిమెళ్ల మురళీకృష్ణమాచార్యులకు 36వ జీయర్ పురస్కారం.. జైమిని సామవేదంలో విశేష ప్రావీణ్యం కలిగిన ఎన్. మకరభూషణం అయ్యంగార్‌కు 37వ జీయర్ పురస్కారం అందజేశారు.సంస్కృత విద్య, పరిశోధన రంగాల్లో సేవలందించిన ఆచార్య కందాల వెంకట రామకృష్ణమాచార్యులకు విద్వన్మణి పురస్కారాన్ని చిన్నజీయర్ స్వామి ప్రదానం చేశారు. చిన్న జీయర్ స్వామి వారి 70వ తిరునక్షత్ర మహోత్సవాల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్. త్రిదండి చిన్నజీయర్ స్వామివారి మహోత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఎన్నో ఏళ్లుగా వారికి అనుచరుడిగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని చెప్పారు.
