ఇష్టంగా ఐస్‌క్రీములు లాగించేస్తున్నారా…అయితే ఈ సీన్ చూడాల్సిందే!
తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గడువు ముగిసిన ఐస్‌క్రీములు, పాడైన ఆహార పదార్థాలు వెలుగుచూశాయి. దాదాపు ఒక టన్ను ఎక్స్‌పైరీ ఐస్‌క్రీములను స్వాధీనం చేసుకుని పలు కేంద్రాలను సీజ్ చేశారు. మరో రెస్టారెంట్‌లో అపరిశుభ్ర పరిస్థితులు, ఎలుకల సంచారం గుర్తించి తాత్కాలికంగా మూసివేశారు. ప్రజలు నాణ్యత లేని ఆహారంపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
టెంపుల్ సిటీ తిరుపతిలో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న కల్తీ, నాణ్యత లేని ఆహార విక్రయాలపై జిల్లా యంత్రాంగం కొరడా ఝులిపించింది. కలెక్టర్ ఆదేశాల మేరకు తిరుపతి కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. కేశవాయన గుంటలోని బాలాజీ ఐస్ క్రీమ్, ఫలుడా తయారీ కేంద్రంలో పాడైన బాదం పప్పు, గడువు ముగిసిన కోన్ ఐస్ క్రీములను గుర్తించిన అధికారులు వాటిని డంపింగ్ యార్డ్‌కు తరలించి, కేంద్రాలను మూసివేశారు. అలాగే పాత తిరుచానూరు రోడ్డులోని గురు దత్త ఎంటర్ప్రైజెస్ డైరీ, స్మూత్ ఐస్ క్రీమ్ కేంద్రాల్లో తనిఖీ చేయగా.. ఎక్స్‌పైరీ అయిపోయిన దాదాపు ఒక టన్ను బాల్, కోన్, బాక్స్ ఐస్ క్రీములను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. మరోవైపు బైరాగి పట్టెడలోని ‘మాషా అల్లా స్టార్ ఫుడ్ ఫ్యామిలీ రెస్టారెంట్’ కిచెన్, స్టోర్ రూమ్‌లలో ఎలుకలు స్వైరవిహారం చేస్తుండడం చూసి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రీజర్‌లో అపరిశుభ్రంగా ఉన్న ఆహార పదార్థాలపై ఎలుకలు తిరుగుతుండడంతో మున్సిపల్ చట్టాల ప్రకారం ఆ హోటల్‌ను తాత్కాలికంగా సీజ్ చేశారు. పాఠశాలల వద్ద, వీధుల్లో బండ్లపై అమ్మే లోకల్ ఐస్ క్రీములను పిల్లలకు తినిపించవద్దని, ఆహార పదార్థాలపై అనుమానం వస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
కళ్లాపి పొడి కాదు.. ప్రాణాంతక విషం! మహిళలూ జాగ్రత్త!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
టెంకాయి, రూపాయితోనే మూడు ముళ్లు.. కట్నం గొడవే లేని ఆదర్శ గ్రామాలు!