Cyclone Akvan: దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీకి అతి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ క్రమంగా బలపడుతోంది. నవంబర్ 20న నెల్లూరు నుంచి విశాఖపట్నం మధ్య ఏపీ, యానాం తీరాలను దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో గాలులు, గరిష్ఠంగా 145 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. ఏపీతో పాటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.
బంగాళాఖాతంలో మరో తుఫాన్ అలజడి సృష్టిస్తోంది. ఇప్పటికే వరుస తుఫాన్లతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పుడు అక్వాన్ రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. సముద్రంలో క్రమంగా బలపడుతున్న ఈ తుఫాన్.. ఏపీ తీరాన్ని ఎప్పుడు తాకనుంది? తీరం దాటే సమయంలో గాలుల వేగం ఎంత ఉండబోతోంది? ఏయే జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనుంది? ఈ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు పడనున్నాయా? అక్వాన్ తుఫాన్‌పై పూర్తి వివరాలు స్టోరీలో చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ క్రమంగా బలపడుతోంది. నవంబర్ 17వ తేదీ ఉదయం నాటికి ఇది తుఫానుగా కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా, నవంబర్ 19 ఉదయానికి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 20 మధ్యాహ్నం నెల్లూరు, తుని మధ్య ఆంధ్రప్రదేశ్, యానం తీరాలను దాటే సూచనలున్నాయి. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా 145 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని ఐఎండీ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా బలపడి నవంబర్ 16న తుఫానుగా మారింది. దీనికి ఇరాన్ సూచించిన అక్వాన్ అనే పేరును పెట్టారు. ప్రస్తుతం ఈ తుఫాన్ దక్షిణ, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. నవంబర్ 17 ఉదయం 5.30 గంటల బులెటిన్ ప్రకారం.. చెన్నైకి తూర్పుగా 610 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 660 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 670 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 790 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. గత ఆరు గంటల్లో నెమ్మదిగా ఉత్తర వాయువ్య దిశగా కదిలిన ఈ తుఫాన్.. రానున్న రోజుల్లో మరింత బలపడి ఏపీ తీరంవైపు కదలనుంది. అక్వాన్ తుఫాన్ తీవ్రత పెరిగే కొద్దీ తీర ప్రాంతాల్లో ప్రమాదం కూడా పెరగనుంది. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠంగా గంటకు 145 కిలోమీటర్ల వేగాన్ని కూడా అందుకోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. అలలు ఎగసిపడటంతో పాటు తీర ప్రాంతాల్లో సముద్రపు నీరు చొచ్చుకొచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలకు సముద్రపు నీరు ముంచుకొచ్చే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తీరానికి సమీపంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు నవంబర్ 20 వరకు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. కోస్తా తీరం వెంబడి కూడా గాలుల వేగం క్రమంగా పెరగనుంది. అక్వాన్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీ, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నవంబర్ 16, 17 తేదీల్లో కోస్తాంధ్ర, యానం, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి. నవంబర్ 18 నుంచి వర్షాల తీవ్రత పెరగనుంది. కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు, నవంబర్ 19, 20 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం నుంచి నెల్లూరు వరకు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తుఫాన్ తీరం దాటే సమయంలో వర్షాల తీవ్రత మరింత పెరగవచ్చు. దీంతో లోతట్టు ప్రాంతాలు, నదులు, వాగుల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు కూడా పంటల రక్షణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అక్వాన్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాబోవడం లేదు. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. నవంబర్ 17, 18 తేదీల్లో రాష్ట్రంలో పెద్దగా వర్షాలు ఉండకపోవచ్చని, నవంబర్ 19 నుంచి 20 వరకు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. నవంబర్ 20న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 21న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. ములుగు, నల్గొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలతో పాటు ఈదురుగాలుల ముప్పు కూడా ఉంది. భారీ వర్ష సూచన ఉన్న జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు, గరిష్ఠంగా 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అక్వాన్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాన్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం అంచనా వేయాలని, తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. గతంలో తుఫాన్ల కారణంగా జరిగిన నష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. కేంద్ర బృందం చేసిన సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. తుఫాన్ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సంప్రదింపు నంబర్లను ప్రకటించింది. మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009కు సమాచారం అందించాలని సూచించింది. అత్యవసర సహాయం కోసం 112, 1070, 18004250101 నంబర్లను సంప్రదించాలని తెలిపింది. తీర ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ సూచించారు. ఒకవైపు తుఫాన్ ముప్పు పొంచి ఉంటే.. మరోవైపు అల్లూరి జిల్లా పాడేరులో చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో దట్టమైన పొగమంచు అలుముకుంటోంది. పాడేరులో కనిష్ఠ ఉష్ణోగ్రత 12 డిగ్రీలుగా నమోదైంది. ఉదయం 10 గంటల వరకు కూడా పొగమంచు తొలగకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. రహదారులు సరిగా కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో చిన్నారులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు స్థానిక గిరిజనులు చలిమంటలు వేసుకుని చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జలాశయాల నీటి నిల్వలపైనా ఆసక్తి నెలకొంది. తుంగభద్ర జలాశయం ఈ ఏడాది అరుదైన రికార్డును నమోదు చేసింది. ఏకంగా 39 ఏళ్ల తర్వాత డ్యామ్‌లోని 33 గేట్లలో ఒక్క గేటు కూడా తెరవలేదు. మూడు నెలలుగా జలాశయంలో నీరు నిల్వ ఉండగా, ప్రస్తుతం ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఔట్‌ఫ్లో 8,803 క్యూసెక్కులుగా ఉంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా, ప్రస్తుతం 1,604.800 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 28.392 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక తెలంగాణలో మరోవైపు చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నవంబర్ 16న సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్పంగా 11.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 11.8 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా గాంధారిలో 12.2 డిగ్రీలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 13 డిగ్రీలు, మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్‌లో 13.1 డిగ్రీలు, మెదక్ జిల్లా శివంపేటలో 13.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)లో 13.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో తుఫాన్ ప్రభావంతో వర్షాలు, మరోవైపు చలి పరిస్థితులు ఎలా మారతాయన్నది ఆసక్తికరంగా మారింది. అక్వాన్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల వైపు దూసుకొస్తుండటంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఒకవైపు తీర ప్రాంతాల్లో పెనుగాలులు, భారీ వర్షాల ప్రమాదం ఉంటే.. మరోవైపు తెలంగాణలోనూ వర్షాలు, ఈదురుగాలుల హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు అధికారులు సూచించే జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదు. రైతులు పంట ఉత్పత్తులను సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవాలి. చెట్ల కింద నిలబడకూడదు. విద్యుత్ స్తంభాలు, తెగిపడిన వైర్లకు దూరంగా ఉండాలి. తుఫాన్ కదలికలు, వర్షాల తీవ్రతపై వాతావరణ శాఖ ఇచ్చే తాజా హెచ్చరికలను గమనిస్తూ ఉండాలి. అక్వాన్ తుఫాన్ ఎంత తీవ్రంగా మారుతుంది? ఏపీ తీరాన్ని దాటే సమయంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి? తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది? అన్నది రానున్న రోజుల్లో మరింత స్పష్టత రానుంది. సో బీ అలర్ట్.. బీ సేఫ్.. !
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: కొనసాగుతున్న పసిడి పతనం..ఇవాళ తులం గోల్డ్ ధర ఇదే!
హైదరాబాద్‌లో ముసుగు దొంగల సంచారం..
బ్యాటింగ్ వైఫల్యాలపై గంభీర్, రవిశాస్త్రి సీరియస్!
అయ్యో.. పచ్చబొట్టు ఎంత పనిచేసింది!
Upasana: నాన్న.. పిల్లల డైపర్ మారిస్తే పెద్ద గొప్పేం కాదు’ పిల్లల పెంపకంపై ఉపాసన కామెంట్స్
