రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై వారికీ రూ.10 లక్షల ప్రమాద బీమా వర్తింపు!
రైల్వే స్టేషన్ కౌంటర్లలో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకూ ప్రయాణ బీమా కల్పించాలని సుప్రీంకోర్టు భారతీయ రైల్వేను ఆదేశించింది. అక్టోబర్ 27, 2026 నుంచి ఆఫ్లైన్ టికెట్లకూ ఆన్లైన్ టికెట్ల మాదిరిగా బీమా రక్షణ అందించాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాల అమలులో వైఫల్యం జరిగితే రైల్వే బోర్డే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే కౌంటర్ టికెట్ల బీమా ప్రీమియం, అమలు విధానంపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
రోజూ లక్షల మంది ప్రయాణికులు మన దేశంలో రైళ్లలోనే తమ గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణమైనా, పండగల వేళ సొంతూళ్లకు వెళ్ళాలన్నా తక్కువ ఖర్చుతో ప్రయాణించేందుకు మనందరికీ గుర్తుకువచ్చే ఏకైక మార్గం భారతీయ రైల్వే. అయితే ప్రయాణం సురక్షితంగా సాగాలని కోరుకున్నప్పటికీ, కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు జరిగి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అలాంటి సమయంలో ప్రయాణికులకు లేదా వారి కుటుంబాలకు ‘ట్రావెల్ ఇన్సూరెన్స్’ కొండంత అండగా నిలుస్తుంది. అయితే ఇప్పటివరకు ఈ బీమా సదుపాయం కేవలం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునే డిజిటల్ వినియోగదారులకు మాత్రమే పరిమితమై ఉండేది. IRCTC యాప్ లేదా వెబ్సైట్ ద్వారా టికెట్ తీస్తే కేవలం 45 పైసలకే రూ. 10 లక్షల వరకు భద్రత లభించేది. కానీ, రైల్వే స్టేషన్ కౌంటర్ల వద్ద నేరుగా లైన్లలో నిలబడి కౌంటర్ టికెట్లు కొనుగోలు చేసే సాధారణ ప్రయాణికులకు ఈ అవకాశం ఉండేది కాదు. ఇదే అంశంపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన, చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. డిజిటల్ టికెట్లు కొనేవారికీ, స్టేషన్లలో కౌంటర్ టికెట్లు కొనే సాధారణ ప్రజలకూ మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని తొలగించాలని భావించిన సుప్రీంకోర్టు.. ఇకపై ఆఫ్లైన్ ప్రయాణికులకు కూడా ఇన్సూరెన్స్ సదుపాయాన్ని విస్తరించాలని భారత రైల్వేను ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, సుప్రీంకోర్టు ఆదేశాల వెనుక ఉన్న నేపథ్యం, ప్రయాణికులకు లభించే ప్రయోజనాలు ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. రైల్వే ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్.మహాదేవన్లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. స్టేషన్లలోని బుకింగ్ కౌంటర్లలో విక్రయించే ఆఫ్లైన్ టికెట్లకు కూడా బీమా రక్షణ కల్పించేలా ఒక ప్రత్యేక నూతన విధానాన్ని తీసుకురావాలని భారత రైల్వేను ఆదేశించింది. అంతేకాకుండా, దీనికి ఒక స్పష్టమైన గడువును కూడా విధించింది. అక్టోబర్ 27, 2026 నుండి ఈ నూతన ఆఫ్లైన్ బీమా విధానాన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జూన్ 2023 లో జరిగిన ఒడిశా రైలు ప్రమాదం మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ప్రమాదం తర్వాత, రైలు ప్రమాదాలపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని, భవిష్యత్తులో ప్రమాదాలను అరికట్టడానికి రూపొందించిన స్వదేశీ భద్రతా పరిజ్ఞానం ‘కవచ్’ వ్యవస్థను వేగవంతంగా అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై సుదీర్ఘ విచారణ సమయంలోనే ప్రయాణికుల బీమా అంశం తెరపైకి వచ్చింది. మన దేశంలో ఇప్పటికీ కోట్లాది మంది సామాన్యులు, దిగువ మధ్యతరగతి ప్రజలు, డిజిటల్ పరిజ్ఞానం లేనివారు నేరుగా రైల్వే స్టేషన్ కౌంటర్లకు వెళ్లి రైలు టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రయాణికుల్లో అత్యధిక శాతం ఉన్న ఈ వర్గానికి ప్రమాదం జరిగితే ఎటువంటి ఇన్సూరెన్స్ కవరేజ్ లేకపోవడం తీవ్ర అన్యాయమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కౌంటర్ టికెట్లకూ ఇన్సూరెన్స్ కల్పించేలా తగిన పద్ధతిని రూపొందించాలని గతంలోనే సుప్రీంకోర్టు రైల్వే బోర్డుకు తగిన సమయం ఇచ్చింది. అయితే ఇటీవల జరిగిన విచారణలో, రైల్వే యంత్రాంగం నుంచి ఈ దిశగా ఎటువంటి స్పష్టమైన పురోగతి లేకపోవడాన్ని గమనించిన ధర్మాసనం సహనం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆలస్యాలకు తావులేకుండా అక్టోబర్ 27 నాటికి అన్ని స్టేషన్ కౌంటర్లలో విక్రయించే టికెట్లను బీమా పరిధిలోకి తీసుకురావాలని డెడ్లైన్ నిర్దేశించింది. ఒకవేళ ఈ నూతన ఆదేశాల అమలులో ఏదైనా జాప్యం లేదా వైఫల్యం జరిగితే దానికి రైల్వే బోర్డు నేరుగా జవాబుదారీ వహించాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇకపై కౌంటర్లలో టికెట్ బుక్ చేసుకునే కోట్ల మంది ఆఫ్లైన్ ప్రయాణికులకు కూడా నామమాత్రపు రుసుముతోనే ఆన్లైన్ యూజర్లకు లభించే బీమా సదుపాయాలు లభిస్తాయి. రైలు ప్రమాదంలో ప్రయాణికుడు దురదృష్టవశాత్తు మరణించినా, లేదా తీవ్రంగా గాయపడి శాశ్వత సంపూర్ణ అంగవైకల్యానికి గురైనా గరిష్టంగా రూ. 10 లక్షల బీమా పరిహారం లభిస్తుంది. ప్రమాదం కారణంగా ప్రయాణికుడికి శాశ్వత పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే రూ.7.5 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. ప్రమాదంలో గాయపడినవారికి అత్యవసర చికిత్స ఖర్చుల కోసం గరిష్టంగా రూ. 2 లక్షల వరకు చెల్లిస్తారు. ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల మృతదేహాన్ని వారి స్వస్థలాలకు సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేకంగా రూ. 10,000 కేటాయించడం జరుగుతుంది. ఇప్పటివరకు కేవలం ఆన్లైన్లో ఐఆర్సిటిసి ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వారికి మాత్రమే పరిమితమైన ఈ రూ. 10 లక్షల బీమా సదుపాయం, ఇప్పుడు సాధారణ కౌంటర్ టికెట్ దారులకు కూడా అందుబాటులోకి రానుండటం నిజంగా హర్షణీయం. సుప్రీంకోర్టు తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల దేశంలో కౌంటర్ టికెట్లపై ఆధారపడే సామాన్య, పేద, మధ్యతరగతి ప్రయాణికుల కుటుంబాలకు భద్రత చేకూరనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
