సూపర్ సిబిల్ స్కోరుతో వద్దన్నా బ్యాంకుల్లో ప్రీమియర్ బెనిఫిట్స్
మంచి క్రెడిట్ స్కోరు మీకు తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు పొందే అవకాశం కల్పిస్తుంది. 800కు పైగా స్కోరు ఉంటే గృహ, కారు రుణాలపై లక్షల రూపాయల వడ్డీని ఆదా చేసుకోవచ్చు. బిల్లులు సకాలంలో చెల్లించడం, క్రెడిట్ కార్డు వినియోగాన్ని నియంత్రించడం, అవసరం లేని లోన్లకు దరఖాస్తు చేయకపోవడం వంటి అలవాట్లు మంచి స్కోరును కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు.
సొంత ఇల్లు, ఒక మంచి కారు..ఉండాలని, తన కుటుంబం సంతోషంగా జీవించాలని ప్రతి సగటు మధ్యతరగతి కుటుంబం కనే కలలు ఇవి. ప్రస్తుత కాలంలో ఈ కలలను నిజం చేసుకోవడానికి అత్యధిక శాతం మంది బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణాలపైనే ఆధారపడుతున్నారు. అయితే, రుణం తీసుకోవడం ఒకెత్తయితే, దానికి ప్రతి నెలా చెల్లించే వడ్డీ భారాన్ని తట్టుకోవడం మరొకెత్తు. చాలామంది రుణం తీసుకునేటప్పుడు కేవలం ఎంత అప్పు దొరుకుతుందనే చూస్తారు కానీ, దానిపై పడే వడ్డీ రేట్ల వల్ల తమ జేబుకు ఎంత చిల్లు పడుతుందో గమనించరు. ఈ వడ్డీ భారాన్ని భారీగా తగ్గించుకోవడానికి మన చేతుల్లో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధమే ‘క్రెడిట్ స్కోరు’. ఒక వ్యక్తి ఆర్థికంగా ఎంత క్రమశిక్షణతో ఉన్నాడు, అప్పులు సకాలంలో తీర్చగలడా లేదా అని అంచనా వేయడానికి బ్యాంకులు ఈ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటాయి. మీ క్రెడిట్ స్కోరు గనుక 800 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, బ్యాంకుల దృష్టిలో మీరు అత్యంత నమ్మకమైన రుణగ్రహీతగా నిలుస్తారు. తద్వారా మీకు అత్యల్ప వడ్డీ రేట్లకే రుణాలు లభిస్తాయి. ఈ నేపథ్యంలో, మంచి స్కోరు వల్ల కలిగే లాభాలు, తక్కువ స్కోరు వల్ల జరిగే నష్టాలు, స్కోరును 800 పైన కాపాడుకునేందుకు అనుసరించాల్సిన మార్గాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. క్రెడిట్ స్కోరు ఎలా పనిచేస్తుంది? వడ్డీ రేట్లపై దీని ప్రభావం ఎంత? భారతదేశంలో సిబిల్ వంటి సంస్థలు ఒక వ్యక్తి యొక్క రుణ చరిత్రను బట్టి 300 నుండి 900 పాయింట్ల మధ్య క్రెడిట్ స్కోరును కేటాయిస్తాయి. ఇందులో 750 దాటితే మంచి స్కోరుగా, 800 దాటితే అద్భుతమైన స్కోరుగా పరిగణిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు గృహ రుణాలు, కారు రుణాలపై ఇచ్చే వడ్డీ రేట్లు పూర్తిగా ఈ స్కోరు ఆధారంగానే మారుతుంటాయి. ప్రస్తుతం మార్కెట్లో గృహ రుణాలపై అత్యల్పంగా 7.25 శాతం వరకు వడ్డీ రేట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, ఈ ఆఫర్ అందరికీ రాదు. మీ స్కోరును బట్టి బ్యాంకులు విధించే వడ్డీ రేట్లు మారుతుంటాయి. ఉదాహరణకు..మీ స్కోరు 800 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే: 7.25% కే రుణం లభిస్తుంది. స్కోరు 750 – 799 మధ్య ఉంటే: 7.35% నుంచి 7.50% వరకు వడ్డీ పడుతుంది. స్కోరు 700 – 749 మధ్య ఉంటే: 7.60% నుంచి 7.80% కి పెరుగుతుంది. స్కోరు 650 కంటే తక్కువైతే 8.40% లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుంది. దీని ప్రకారం మీ నెలవారీ ఈఎంఐ రూ. 43,075 కి చేరుకుంటుంది. కేవలం తక్కువ క్రెడిట్ స్కోరు ఉండటం వల్ల, మీరు ప్రతి నెలా రూ. 3,556 అదనంగా కట్టాల్సి వస్తుంది. అంటే 20 ఏళ్ల వ్యవధి ముగిసేసరికి మీరు బ్యాంకుకు ఏకంగా రూ. 8.5 లక్షలకు పైగా అదనపు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఒక చిన్న నిర్లక్ష్యం మీ కష్టార్జితాన్ని ఎలా హరిస్తుందో చెప్పడానికి ఈ లెక్కే నిదర్శనం. ఇక కార్ల రుణాల వడ్డీ రేట్లు సాధారణంగా 8.70 శాతం నుండి 9.85 శాతం వరకు ఉంటాయి. ఇక్కడ కూడా మీ స్కోరు 750 నుండి 800 మధ్య ఉంటే అత్యల్పంగా 8.70 శాతం వడ్డీకే రుణం లభిస్తుంది. అదే మీ స్కోరు 700 కంటే తక్కువ ఉంటే, బ్యాంకులు రిస్క్ ఎక్కువగా భావించి 9.65 శాతం నుండి 9.85 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తాయి. దీనివల్ల కారు అసలు ధర కంటే మీరు చెల్లించే వడ్డీ ఖర్చే భారీగా పెరిగిపోతుంది. క్రెడిట్ స్కోరు అనేది ఒక రోజులోనో లేదా ఒక నెలలోనే పెరిగేది కాదు. దీనికి నిరంతర ఆర్థిక క్రమశిక్షణ అవసరం. మీ స్కోరు ఎల్లప్పుడూ 800 తగ్గకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని నిబంధనలు మీరు పాటించాల్సిందే. అవేంటంటే.. గడువులోగా చెల్లింపులు చేయాలి. మీ క్రెడిట్ స్కోరును నిర్ణయించడంలో మీరు అప్పులు తిరిగి చెల్లించే తీరు 35% వరకు ప్రభావం చూపుతుంది. హోమ్ లోన్, కార్ లోన్ ఈఎంఐలు లేదా క్రెడిట్ కార్డు బిల్లులను గడువు తేదీ లోపే చెల్లించాలి. సాంకేతిక కారణాల వల్ల లేదా మతిమరుపు వల్ల ఒక్క రోజు ఆలస్యమైనా సరే, మీ స్కోరు 800 నుండి ఒకేసారి పడిపోయే ప్రమాదం ఉంది. ఈ ఇబ్బంది లేకుండా ఉండటానికి మీ బ్యాంక్ ఖాతాకు ‘ఆటో-డెబిట్’ ఆప్షన్ పెట్టుకోవడం ఉత్తమం. రుణ వినియోగ నిష్పత్తిని అదుపులో ఉంచడం. మీ క్రెడిట్ కార్డుకు ఉన్న లిమిట్ మొత్తంలో మీరు ఎంత వాడుతున్నారనేదే ఈ నిష్పత్తి. ఉదాహరణకు, మీ కార్డు లిమిట్ రూ. 1 లక్ష అనుకుంటే, అందులో గరిష్టంగా 30 శాతం అంటే రూ. 30,000 లోపు మాత్రమే వాడాలి. ప్రతి నెలా లిమిట్ మొత్తాన్ని పూర్తిగా వాడేస్తుంటే, బ్యాంకులు మిమ్మల్ని ‘అప్పులపై ఎక్కువగా ఆధారపడే వ్యక్తిగా’ భావించి, మీ స్కోరును తగ్గిస్తాయి. ‘కనీస మొత్తం’ట్రాప్‌లో పడకుండా ఉండాలి. క్రెడిట్ కార్డు బిల్లు వచ్చినప్పుడు అందులో ‘మొత్తం బాకీ’ మరియు ‘కనీస మొత్తం’ అని రెండు ఉంటాయి. చాలామంది కేవలం కనీస మొత్తం కడితే సరిపోతుందని భ్రమ పడతారు. కనీస మొత్తం కడితే లేట్ ఫీజు పడదు నిజమే, కానీ మిగిలిన 95% బాకీపై ఏడాదికి 30% నుండి 50% వరకు చక్రవడ్డీ పడుతుంది. ఇది మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టడమే కాకుండా, మీ క్రెడిట్ స్కోరును దారుణంగా దెబ్బతీస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ పూర్తి బిల్లునే చెల్లించండి. ఒకేసారి ఎక్కువ రుణాల కోసం దరఖాస్తు చేయవద్దు..మీకు అవసరం ఉన్నా లేకపోయినా, ఆన్‌లైన్ యాప్‌లలోనో, లేదంటే కనిపించిన ప్రతి బ్యాంకులోనూ క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల కోసం దరఖాస్తు చేయవద్దు. మీరు దరఖాస్తు చేసిన ప్రతిసారీ, ఆయా బ్యాంకులు మీ సిబిల్ నివేదికను క్షుణ్ణంగా తనిఖీ చేస్తాయి. దీనిని ‘హార్డ్ ఎంక్వైరీ’ అంటారు. తక్కువ కాలంలో ఇలాంటి ఎంక్వైరీలు ఎక్కువైతే, మీ స్కోరు ఆటోమేటిక్‌గా పడిపోతుంది. కొత్త కార్డులు వచ్చాయని లేదా వాడటం లేదని చాలా ఏళ్లుగా వాడుతున్న పాత క్రెడిట్ కార్డులను రద్దు చేయకూడదు. మీకు ఎంత ఎక్కువ క్రెడిట్ హిస్టరీ ఉంటే.. ఆర్థిక సంస్థలకు మీపై అంత నమ్మకం పెరుగుతుంది. అలాగే ‘లోన్ సెటిల్‌మెంట్’ జోలికి వెళ్లొద్దు. ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పులు తీర్చలేనప్పుడు, చాలామంది బ్యాంకులతో మాట్లాడి కొంత మొత్తం చెల్లించి ఖాతాను క్లోజ్ చేస్తారు. దీన్నే ‘సెటిల్‌మెంట్’ అంటారు. బ్యాంకులు ఆ క్షణానికి ఒప్పుకున్నప్పటికీ, మీ క్రెడిట్ రిపోర్టులో దీన్ని ‘సెటిల్డ్’ అని రాస్తారు. ఇది మీ క్రెడిట్ హిస్టరీపై ఒక పెద్ద రిమార్క్ పడిపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో ఇల్లు, కారు లోనుకు వెళితే..ఏ బ్యాంకూ మీకు అప్పు ఇవ్వదు. కాబట్టి, సాధ్యమైనంత వరకు బాకీ మొత్తాన్ని పూర్తిగా చెల్లించడానికే ప్రయత్నించండి. మీ క్రెడిట్ రిపోర్టును క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి. కొన్నిసార్లు బ్యాంకుల పొరపాట్ల వల్ల లేదా మీ పాన్ నంబర్ దుర్వినియోగం అవ్వడం వల్ల మీ పేరుపై మోసపూరిత రుణాలు కనిపించవచ్చు. ఇది మీ తప్పు లేకపోయినా మీ స్కోరును తగ్గిస్తుంది. ప్రస్తుతం ‘ఎన్‌పీసీఐ భీమ్’ యాప్‌లో ట్రాన్స్‌యూనియన్ సిబిల్ భాగస్వామ్యంతో ఉచితంగా క్రెడిట్ స్కోరును తనిఖీ చేసుకునే వెసులుబాటు ఉంది. ఏడాదికి కనీసం రెండు సార్లయినా మీ రిపోర్టును చెక్ చేసుకుని, ఏవైనా తప్పులుంటే వెంటనే సిబిల్ సంస్థకు ఫిర్యాదు చేసి సరిచేసుకోవాలి. క్రెడిట్ స్కోరు అనేది ఆధునిక ఆర్థిక ప్రపంచంలో మీ ‘ఆర్థిక వ్యక్తిత్వ పత్రం’. 800 కంటే ఎక్కువ స్కోరును ఉండటం అనేది మీ భవిష్యత్ రుణాలకు భరోసానిచ్చే సూచిక. క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించడం, పరిమితికి లోబడి ఖర్చు చేయడం వంటి చిన్న చిన్న అలవాట్లతో ఈ స్కోరును సాధించవచ్చు. నేటి నుంచే మీ ఆర్థిక క్రమశిక్షణను ప్రారంభించండి, భవిష్యత్తులో మీ కష్టార్జితమైన లక్షలాది రూపాయల వడ్డీ డబ్బును ఆదా చేసుకోండి!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్.. మూడేళ్లలో కట్టేసిన చైనా రోబోలు
కీచక భర్తకు బుద్ధి చెప్పిన భార్య..ఏం చేసిందంటే
భారతీయ నర్స్ కుటుంబాన్ని బహిష్కరించిన ఆస్ట్రేలియా