ప్రతిభకు పట్టం.. గ్రీన్‌ కార్డు ప్లేస్‌లో.. “బిల్డ్‌ అమెరికా” వీసా

వలసలకు సంబంధించిన విధానంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నూతన సంస్కరణలకు తెరతీశారు. ప్రతిభ, పాయింట్ల ఆధారిత ఇమిగ్రేషన్‌ విధానాన్ని తెరపైకి తెచ్చారు. ప్రస్తుతమున్న గ్రీన్‌కార్డుల స్థానంలో బిల్డ్ అమెరికా వీసాలను ప్రవేశపెట్టనున్నారు. అలాగే యువ, నిపుణులైన ఉద్యోగుల కోటాను గణనీయంగా పెంచారు. 12 నుంచి 57 శాతానికి పెంచడమే కాకుండా ఆ కోటాను మరింత పెంచే అవకాశం ఉన్నట్లు సంకేతాలిచ్చారు. ట్రంప్ ప్రకటించిన నూతన వలస విధానంతో వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు ప్రయోజనం కలుగనుంది.

వైట్‌హౌస్‌లోని రోజ్‌గార్డెన్‌లో శుక్రవారం నూతన వలస విధానంపై ట్రంప్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ కలిగిన ఉద్యోగులను ఆకర్షించడంలో, ఉన్నవారిని నిలుపుకోవడంలో ప్రస్తుత వలస విధానం విఫలమైందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రతిభ ఆధారిత విధానానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఆంగ్లం, పౌరశాస్త్ర పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతోపాటు వయసు, ప్రావీణ్యం, ఉద్యోగావకాశాలు, సివిక్ సెన్స్‌లకు పాయింట్లు కేటాయించడం ద్వారా శాశ్వత చట్టబద్ధ నివాసానికి అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మేధావులు, ప్రతిభావంతులపై మనం వివక్ష చూపాం. ఇకపై చూపబోం. ఈ బిల్లుకు వీలైనంత త్వరగా ఆమోదం లభిస్తుందని భావిస్తున్నాం. దీనికి ఆమోదం లభించాక, ఈ అసాధారణమైన విద్యార్థులు, ఉద్యోగులు అమెరికాలోనే ఉంటూ, వృద్ధి చెందాలని కోరుకుంటున్నాం అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *