AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్రంలో భారీ తిమింగలం వేట.. డ్రోన్‌లో అద్భుత దృశ్యాలు.. వీడియోకు లక్షల్లో వ్యూస్!

సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడికి అనుకోని దృశ్యం కనిపించింది. భారీ ఫిన్ తిమింగలం సముద్ర ఉపరితలంపైకి వచ్చి ఆహారాన్ని వేటాడుతున్న దృశ్యాలు అతడి డ్రోన్ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి లక్షల్లో వ్యూస్ సాధించింది. తిమింగలాల వేట, వాటి సంరక్షణపై చర్చకు దారితీసింది.

సముద్రంలో భారీ తిమింగలం వేట.. డ్రోన్‌లో అద్భుత దృశ్యాలు.. వీడియోకు లక్షల్లో వ్యూస్!
Welsh Fisherman Captures Stunning Drone Footage Of A Giant Fin Whale Feeding In Celtic Sea
Sharada V
|

Updated on: Oct 22, 2026 | 9:33 AM

Share

సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడికి అనుకోని అద్భుత దృశ్యం కనిపించింది. భారీ ఫిన్ తిమింగలం సముద్ర ఉపరితలంపైకి వచ్చి ఆహారాన్ని వేటాడుతున్న దృశ్యాలు అతడి డ్రోన్ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి లక్షల్లో వ్యూస్ సాధించింది. తిమింగలాల వేట, వాటి సంరక్షణపై చర్చకు దారితీసింది.

డ్రోన్ కెమెరాలో అద్భుత దృశ్యాలు!

బ్రిటన్ లోని వేల్స్‌కు చెందిన రైస్ మోర్గన్ చమురు శుద్ధి కర్మాగారంలో పనిచేస్తుంటాడు. ఖాళీ సమయాల్లో చేపల వేటకు వెళ్లడం అంటే ఇష్టం. గత ఏడాది కొన్న డ్రోన్ ను సముద్రంలోకి వెళ్లిన ప్రతిసారీ  వెంట తీసుకెళతాడు. సముద్రంలో ఏదైనా అరుదైన దృశ్యం కనిపిస్తే దాన్ని చిత్రీకరిస్తాడు. ఈ క్రమంలోనే ఇటీవల సెల్టిక్ సముద్రంలో ఓ భారీ ఫిన్ తిమింగలం కనిపించింది. వెంటనే డ్రోన్‌ను ఎగరేసి దాని కదలికలను చిత్రీకరించాడు. సముద్ర ఉపరితలంపైకి వచ్చిన తిమింగలం నోరు పెద్దగా తెరిచి నీటిలో ముందుకు దూసుకెళ్తూ ఆహారాన్ని తీసుకుంటున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. దాని సమీపంలో చిన్న డాల్ఫిన్లు కూడా కనిపించాయి.ఈ అద్భుత దృశ్యాలను చూసి పడవలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. సముద్రంలో ఇంత భారీ జీవి ఆహారాన్ని తీసుకుంటున్న దృశ్యాలను ఇంత దగ్గరగా చూడటం తమకు మరిచిపోలేని అనుభవమని మోర్గాన్ అన్నాడు.

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద తిమింగలం!

ఫిన్ తిమింగలం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద తిమింగలం. పరిమాణంలో బ్లూ వేల్‌ దీనికంటే పెద్దది. ఫిన్ వేల్ 78 అడుగులు పొడవు 77 టన్నుల బరువు ఉంటుంది.  ఇంత భారీ శరీరం ఉన్నప్పటికీ.. ఇవి చిన్న సముద్ర జీవులను ఆహారంగా తీసుకుంటాయి. ఆహారం తీసుకునే సమయంలో వీటి గొంతు కింద ఉండే మడతలు విస్తరిస్తాయి. దీంతో భారీ మొత్తంలో నీటిని నోటిలోకి తీసుకుని, అందులోని చిన్న జీవులను వడపోసి తింటాయి. సముద్ర ఉపరితలంపైకి వచ్చి ఆహారాన్ని తీసుకోవడం వీటి సాధారణ ప్రవర్తనలో భాగం. ఇది అత్యంత అరుదైన దృశ్యమని సముద్రంలోని పెద్ద మాంసాహార జీవుల పర్యావరణంపై పరిశోధనలు జరిపే డాక్టర్ మరియానా చిమియెంటీ వ్యాఖ్యానించారు.

అనుకోకుండా వైరల్ అయిన వీడియో.. తిమింగలాల వేటపై చర్చ!

మోర్గాన్ తొలుత ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నప్పుడు.. కొన్ని వందల లైకులు వస్తే చాలనుకున్నాడు. కానీ అంచనాలకు భిన్నంగా వీడియోకు ఒక లక్ష వ్యూస్ వచ్చాయి.  ఐస్‌లాండ్‌లో జరుగుతున్న తిమింగలాల వేట గురించి నెటిజన్ల మధ్య చర్చ మొదలైంది.  మంత్రులను ట్యాగ్ చేస్తూ తిమింగలాల సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని కోరారు.

సముద్ర జీవులపై అవగాహన పెంచుతున్న డ్రోన్లు

గతంలో ఇలాంటి అరుదైన దృశ్యాలను చిత్రీకరించాలంటే ప్రత్యేక పరికరాలు, నిపుణుల సహాయం అవసరమయ్యేది. ఇప్పుడు చిన్న డ్రోన్ల తో సాధారణ పౌరులు కూడా ప్రకృతిలోని అద్భుతాలను రికార్డు చేయగలుగుతున్నారు. పడవపై నుంచి చూస్తే స్పష్టంగా కనిపించని తిమింగలం కదలికలను డ్రోన్ ద్వారా పై నుంచి చిత్రీకరించడంతో దాని భారీ పరిమాణం, ఆహారం తీసుకునే విధానం స్పష్టంగా కనిపించాయి. ఇలాంటి వీడియోలు సముద్ర జీవుల గురించి ప్రజలకు అవగాహన పెంచడమే కాకుండా, వాటి సంరక్షణ అవసరాన్ని కూడా గుర్తు చేస్తాయి.

దీంతో చేపల వేటకు వెళ్లిన సమయంలో చిత్రీకరించిన వీడియో.. సముద్ర జీవుల పరిరక్షణపై అవగాహన కల్పించే అంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి సముద్రంలోని అద్భుత జీవిని దగ్గరగా చూసే అవకాశం దక్కింది. సముద్ర గర్భంలో ఇంకా మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగున్నాయని ఈ ఘటన గుర్తుచేస్తోంది.

Follow Us