ఆదివారం బట్టలు ఉతికితే జైలుకే.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెడతారు..
మన దేశంలో ఆదివారం అంటేనే లాండ్రీ డే.. వారం రోజుల మురికి బట్టలన్నీ ఆ ఒక్క రోజే వాషింగ్ మెషీన్లలో పడతాయి. కానీ కొన్ని ధనిక దేశాల్లో మాత్రం ఆదివారం వాషింగ్ మెషీన్ ఆన్ చేస్తే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. అక్కడ బట్టలు ఉతకడమే కాదు.. కనీసం ఇల్లు సర్దుతూ పెద్దగా శబ్దం చేసినా లక్షల్లో జరిమానా వేస్తారు. ఆ దేశాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఆదివారం వచ్చిందంటే చాలు.. ఉద్యోగస్తులైనా, సామాన్యులైనా ఇల్లు సర్దుకోవడం, గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం లాంటి పనుల్లో బిజీ అయిపోతారు. వారం రోజుల మురికి బట్టలన్నీ ఆ ఒక్కరోజే వాషింగ్ మెషీన్లలో పడుతుంటాయి. కానీ ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఆదివారం పూట బట్టలు ఉతికితే భారీ జరిమానా, కొన్నిసార్లు జైలు శిక్ష కూడా పడొచ్చని మీకు తెలుసా? వినడానికి విచిత్రంగా ఉన్నా.. యూరప్‌లోని కొన్ని ధనిక దేశాల్లో ఈ చట్టాలు పక్కాగా అమలువుతున్నాయి. అవును.. ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశంగా పేరొందిన స్విట్జర్లాండ్‌లో ఆదివారం బట్టలు ఉతకడం, వాటిని ఆరవేయడం చట్టవిరుద్ధం. స్విట్జర్లాండ్ నిబంధనల ప్రకారం ఆదివారాన్ని అధికారిక రెస్ట్ డేగా పరిగణిస్తారు. ఆ రోజున ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది కలిగించేలా శబ్దం చేసే ఎలాంటి పనులూ చేయకూడదు. అక్కడ ఎక్కువ శాతం అపార్ట్‌మెంట్లలో ఉమ్మడి లాండ్రీ రూమ్‌లు ఉంటాయి. హౌసింగ్ రూల్స్ ప్రకారం.. ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో ఈ లాండ్రీ రూమ్స్ వాడటం నిషేధం. కేవలం బట్టలు ఉతకడమే కాదు.. ల్యాన్ మూవింగ్, గోడలకు డ్రిల్లింగ్ చేయడం లాంటి శబ్దాలు వచ్చే ఏ పనీ చేయకూడదు.
జరిమానా.. కట్టకపోతే జైలు శిక్ష..
ఒకవేళ ఎవరైనా ఆదివారం ఈ నియమాన్ని ఉల్లంఘించి వాషింగ్ మెషీన్ వేస్తే, మొదట ఇరుగుపొరుగు వారు హెచ్చరిస్తారు లేదా పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఒకే వ్యక్తి పదేపదే ఈ తప్పు చేస్తే అక్కడి పురపాలక చట్టం ప్రకారం భారీ జరిమానా విధిస్తారు. ఒకవేళ ఆ జరిమానా కూడా కట్టకపోతే దానిని తీవ్రమైన నేరంగా పరిగణించి జైలుకు కూడా పంపుతారు. అంతటితో ఆగకుండా.. ఆదివారాల్లో బాల్కనీల్లో లేదా ఇంటి బయట బట్టలు ఆరవేయడాన్ని కూడా అక్కడ వ్యతిరేకిస్తారు. అలా బట్టలు ఆరవేస్తే ఆ ప్రాంతం అందం దెబ్బతింటుందని స్విస్ ప్రజలు భావిస్తారు.
జర్మనీలో కూడా అదే రూల్.. లక్షల్లో జరిమానా..
స్విట్జర్లాండ్ లాగే జర్మనీలో కూడా ఆదివారాన్ని అత్యంత ప్రశాంతమైన రోజూగా చూస్తారు. జర్మన్ చట్టాల ప్రకారం ఆదివారాల్లో పెద్దగా సంగీతం వినడం, టీవీ సౌండ్ పెంచడం, ఇంట్లో ఫర్నిచర్ మార్చడం లాంటివి నిషేధం. ప్రజలకు తమ కుటుంబాలతో ప్రశాంతంగా గడిపే హక్కును చట్టం కల్పించింది. జర్మనీలో ఆదివారం రోజు వాషింగ్ మెషీన్ వేసి పొరుగువారికి శబ్ద కాలుష్యం కలిగిస్తే.. రూల్స్ ఉల్లంఘించినందుకు 50 యూరోల నుండి 2500 యూరోల వరకు జరిమానా విధిస్తారు. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ.4,500 నుండి రూ. 2.2 లక్షల వరకు అన్నమాట.
