
ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి వెళ్లిన శాఖాహార రోగికి పొరపాటున చికెన్ శాండ్‌విచ్ అందించిన ఘటనలో వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆసుపత్రికి రూ. 5,000 జరిమానా విధించింది. వెజిటేరియన్, నాన్-వెజ్ శాండ్‌విచ్‌ల బార్‌కోడ్ ఒకే విధంగా ఉండటం వల్ల ఈ పొరపాటు జరిగిందని ఆసుపత్రి అంగీకరించింది. దీనివల్ల తన మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని బాధితుడు ఫిర్యాదు చేయగా, సేవలలో లోపంగా పరిగణించిన కమిషన్ ఈ మేరకు తీర్పు వెలువరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఫిర్యాదుదారుడు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఢిల్లీలోని ఒక ఆసుపత్రికి వెళ్లారు. పరీక్షల అనంతరం ఆసుపత్రి క్యాంటీన్ నుండి ఆయన పన్నీర్ శాండ్‌విచ్ ఆర్డర్ చేశారు. అయితే, ఆసుపత్రి సిబ్బంది పొరపాటున ఆయనకు చికెన్ శాండ్‌విచ్ అందించారు. తిన్న తర్వాత అది చికెన్ శాండ్‌విచ్ అని గ్రహించిన బాధితుడు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
ఈ ఘటనపై బాధితుడు వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. విచారణ సందర్భంగా ఆసుపత్రి వర్గాలు తమ తప్పును అంగీకరించాయి. వెజిటేరియన్, నాన్-వెజ్ శాండ్‌విచ్‌లు రెండింటికీ ఒకే రకమైన బార్‌కోడ్ కేటాయించడం వల్ల ఆపరేషనల్ లోపం తలెత్తిందని, పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చాయి.
అయితే, రోగికి అందించాల్సిన సేవల్లో ఇది స్పష్టమైన లోపమని కమిషన్ స్పష్టం చేసింది. ఆహార ఎంపిక విషయంలో ఆసుపత్రి నిర్వహణ మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. బాధితుడి మతపరమైన మనోభావాలు దెబ్బతినడానికి కారణమైనందుకు గాను, సదరు ఆసుపత్రికి రూ. 5,000 జరిమానా విధిస్తూ కమిషన్ తీర్పు వెలువరించింది. వైద్యం కోసం వచ్చే రోగుల విషయంలో ఇలాంటి నిర్లక్ష్యం తగదని ఈ తీర్పు మరోసారి గుర్తుచేస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..