చావుకే సవాల్ విసిరే వింత జీవి.. ముసలితనం రాగానే మళ్లీ చిన్నపిల్లగా.. సైంటిస్టులకే మైండ్ బ్లాంక్..
ఈ ప్రపంచంలో మరణం లేని జీవి ఏదైనా ఉందా? అంటే అసాధ్యం అనే సమాధానమే వస్తుంది. కానీ సైన్స్ ప్రపంచం దీనిని సాధ్యమని నిరూపిస్తోంది. సముద్రపు లోతుల్లో నివసించే ఒక చిన్న జెల్లీఫిష్ వృద్ధాప్యాన్ని అస్సలు అంగీకరించదు. వ్యాధి లేదా ముసలితనం రాగానే అది తన కణాలను రీప్రోగ్రామ్ చేసుకుని తిరిగి శిశువు స్థితికి చేరుకుంటుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పుట్టిన ప్రతి జీవి ఏదో ఒకరోజు మరణించక తప్పదు.. ఇది ప్రకృతి రాసిన తిరుగులేని నియమం. సైన్స్ సైతం మరణాన్ని జీవితపు అంతిమ సత్యంగా అంగీకరిస్తుంది. కానీ అనంతమైన సముద్ర గర్భంలో ప్రకృతి నియమాలను, విజ్ఞాన శాస్త్ర సత్యాలను సవాలు చేస్తూ ఒక వింత జీవి నివసిస్తోంది. దానికి వృద్ధాప్యం రాదు.. అది ముసలితనంతో చనిపోదు. తనకు చావు దగ్గర పడుతోందని అనిపించగానే, తన జీవిత కాలాన్ని వెనక్కి తిప్పి మళ్లీ చిన్న పిల్లగా మారిపోతుంది. ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్న ఈ అద్భుతమైన జీవిని శాస్త్రవేత్తలు టర్రిటాప్సిస్ డోర్ని అని పిలుస్తారు. దీని సాధారణ నామమే అమర జెల్లీఫిష్. మధ్యధరా సముద్రంలోని ఉప్పునీటిలో కనిపించే ఈ జెల్లీఫిష్ పరిమాణంలో చాలా చిన్నది. ఇది కేవలం 4.5 మిల్లీమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. గొడుగు ఆకారంలో ఉండే ఈ చిన్న జీవి వెనుక దాగున్న శారీరక రహస్యాలు నేటికీ పరిశోధకులకు ఒక పెద్ద మిస్టరీనే.
ముసలివాడు మళ్లీ చిన్నపిల్లగా మారితే?
సాధారణంగా ఏ జీవికైనా వయసు పైబడినప్పుడు కణాలు క్షీణించి చనిపోతాయి. కానీ ఈ జెల్లీఫిష్‌కు శారీరక ఒత్తిడి ఎక్కువైనా, ఏదైనా వ్యాధి వచ్చినా లేదా వృద్ధాప్యం ముంచుకొచ్చినా.. అది చనిపోవడానికి సిద్ధపడదు. దానికి బదులుగా తన శరీరంలో “ట్రాన్స్‌డిఫరెన్సియేషన్” అనే అరుదైన ప్రక్రియను మొదలుపెడుతుంది. దీనివల్ల దాని ముసలి కణాలు తమ స్వభావాన్ని మార్చుకుని, మళ్లీ ప్రాథమిక దశ అయిన పాలిప్ స్థితికి చేరుకుంటాయి. అంటే ఒక 80 ఏళ్ల ముసలివాడు రాత్రికి రాత్రే మళ్లీ ఒన్ ఇయర్ బేబీగా మారిపోతే ఎలా ఉంటుందో.. ఇది కూడా అలాగే మారుతుంది.
సెల్యులార్ రీప్రోగ్రామింగ్ మాయాజాలం
ఈ జెల్లీఫిష్ తన జీవిత చక్రాన్ని ఎన్నిసార్లయినా వెనక్కి తిప్పగలదు. ముసలిదవడం, మళ్లీ చిన్నగా మారడం, మళ్లీ పెరగడం.. ఇలా ఈ చక్రం నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఈ అద్భుతమైన సామర్థ్యం వల్లే సైన్స్ ప్రపంచం దీనిని అమరత్వానికి కేరాఫ్ అడ్రస్ అని పిలుస్తోంది.
మానవ అమరత్వానికి ఇది దారి చూపుతుందా?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ల్యాబ్‌లలో ఈ జెల్లీఫిష్ జన్యువులపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ మహమ్మారిపై పోరాడేందుకు, మానవ శరీరంలో దెబ్బతిన్న కణాలను తిరిగి ఉత్పత్తి చేయడానికి ఈ జెల్లీఫిష్ DNA ఎలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. మానవ ఆయుర్దాయాన్ని పెంచే రహస్యం దీని జన్యువుల్లోనే దాగి ఉందని భావిస్తున్నారు.
వృద్ధాప్యం లేకపోయినా చావు ఎందుకు వస్తుంది?
మరి వృద్ధాప్యమే రానప్పుడు ఈ జెల్లీఫిష్‌లు సముద్రం నిండా కోట్ల సంఖ్యలో పెరిగిపోవాలి కదా? కానీ అలా జరగదు. ఎందుకంటే, వీటికి సహజ వృద్ధాప్యం వల్ల చావు రాకపోయినప్పటికీ.. బాహ్య ప్రమాదాల నుండి ఇవి తప్పించుకోలేవు. సముద్రంలోని పెద్ద పెద్ద చేపలు, ఇతర జలచరాలు వీటిని ఆహారంగా తినేస్తాయి. అలాగే మారుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు, విపరీతమైన కాలుష్యం కారణంగా కూడా ఇవి ప్రాణాలు కోల్పోతుంటాయి.
ప్రకృతి సృష్టించిన అద్భుతం
బాహ్య ప్రమాదాల వల్ల చనిపోయినప్పటికీ.. వృద్ధాప్యాన్ని, కణాల క్షీణతను జయించడంలో ఈ అమర జెల్లీఫిష్ సాధించిన విజయం ప్రకృతి సృష్టించిన ఒక మహా అద్భుతం. మానవ శరీరం, జెల్లీఫిష్ శరీరం వేరు వేరైనప్పటికీ, కాల గమనాన్ని వెనక్కి తిప్పడం అసాధ్యం కాదని ఈ చిన్న జీవి నిరూపించింది.
