AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాకులకు ఆహారం పెట్టిన చిన్నారి.. తిరిగి అవి ఏమిచ్చాయో తెలిస్తే అవాక్కే..

మనం పక్షులకు గింజలు వేస్తాం.. అవి తిని ఎగిరిపోతాయి. కానీ, అమెరికాలోని సియాటిల్‌లో మాత్రం ఒక వింత జరిగింది. ఎనిమిదేళ్ల గాబీ మాన్ అనే చిన్నారి ప్రేమగా వేసిన వేరుశెనగ గింజలకు ప్రతిగా.. ఆ అడవి కాకులు ఆమెకు వెలకట్టలేని బహుమతులు పంపడం మొదలుపెట్టాయి. పూసలు, మెరిసే లోహపు ముక్కలు, చివరకు పోగొట్టుకున్న వస్తువులను కూడా వెతికి తెచ్చి ఇచ్చే ఈ కాకుల స్నేహం వెనుక ఉన్న రహస్యం ఏంటి? అనేది తెలుసుకుందాం..

కాకులకు ఆహారం పెట్టిన చిన్నారి.. తిరిగి అవి ఏమిచ్చాయో తెలిస్తే అవాక్కే..
The Girl Who Gets Gifts From Crows
Krishna S
|

Updated on: May 10, 2026 | 10:57 AM

Share

పక్షులకు ఆహారం వేయడం మనకు అలవాటే. కానీ మనం పెట్టే ఆహారానికి ప్రతిగా ఆ పక్షులు మనకు బహుమతులు ఇస్తాయంటే నమ్ముతారా? వినడానికి ఏదో ఫాంటసీ సినిమా కథలా ఉన్నా.. అమెరికాలోని సియాటిల్‌లో ఇది అక్షరాలా నిజమైంది. గాబీ మాన్ అనే చిన్నారికి, అక్కడి స్థానిక కాకులకు మధ్య ఉన్న అసాధారణ స్నేహం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కథ 2011లో మొదలైంది. అప్పుడు గాబీకి కేవలం ఎనిమిదేళ్లు. స్కూల్ బస్ కోసం వెళ్తున్నప్పుడు ఆమె చేతిలో ఉన్న ఆహారపు ముక్కలు అనుకోకుండా కింద పడేవి. వాటిని గమనించిన కాకులు మెల్లగా ఆమెకు దగ్గరయ్యాయి. ఆ తర్వాత గాబీ ఉద్దేశపూర్వకంగానే వాటికి వేరుశెనగలు వేయడం ప్రారంభించింది. గాబీ ప్రేమను గుర్తించిన ఆ కాకులు, కొన్నాళ్లకే ఆమె ఇంటికి గుంపులుగా రావడం మొదలుపెట్టాయి.

కాకుల నుంచి వెలకట్టలేని కానుకలు

గాబీ వాటికి ఆహారం పెట్టడం ఒక ఎత్తైతే, ఆ కాకులు ఆమెకు తిరిగి ఇచ్చిన బహుమతులు మరొక ఎత్తు. ప్రతిరోజూ ఆమె పక్షులకు మేత వేసే చోట వింత వింత వస్తువులు కనిపించేవి. రంగురంగుల గాజు పూసలు, మెరిసే లోహపు ముక్కలు, గుండీలు, పేపర్ క్లిప్‌లు, స్క్రూలు మాత్రమే కాకుండా.. అప్పుడప్పుడు గుండె ఆకారపు లాకెట్లు, చిన్న ఆభరణాల ముక్కలను కూడా అవి తెచ్చి ఇచ్చేవి. కాకులు ఇచ్చిన ఈ నిధులన్నింటినీ గాబీ జాగ్రత్తగా సేకరించి, తేదీలు రాసి ప్రత్యేకమైన డబ్బాల్లో భద్రపరుచుకుంది. వీటిలో ఒక చిన్న వెండి పూసను ఆ కుటుంబం అత్యంత అరుదైన బహుమతిగా భావిస్తుంది.

కాకులకు అంత తెలివితేటలా..?

ఈ వింత ప్రవర్తనపై వాషింగ్టన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జాన్ మార్జ్‌లఫ్ పరిశోధనలు చేశారు. ఆయన విశ్లేషణ ప్రకారం.. కాకులు మానవ ముఖాలను గుర్తించగలవు. తమకు మేలు చేసే వారిని, కీడు చేసే వారిని ఏళ్ల తరబడి గుర్తుపెట్టుకోగలవు. తమకు ఆహారం అందించే వ్యక్తులతో కాకులు బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంటాయి. ఈ క్రమంలోనే తాము సేకరించిన విలువైన వస్తువులను మార్పిడి చేసుకుంటాయి. పక్షులు వీటిని మానవ కోణంలో బహుమతులుగా భావించకపోయినా, తాము ఇష్టపడే వ్యక్తుల వద్ద తమకు నచ్చిన వస్తువులను వదిలి వెళ్లడం వాటి తెలివితేటలకు నిదర్శనం.

పోగొట్టుకున్న వస్తువును వెతికి తెచ్చిన కాకులు

ఈ స్నేహంలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఒకసారి గాబీ తన కెమెరా లెన్స్ క్యాప్‌ను ఎక్కడో పోగొట్టుకుంది. ఆశ్చర్యకరంగా ఒక కాకు ఆ క్యాప్‌ను వెతికి పట్టుకుని వచ్చి, ఆమె ఇంటి వద్ద వదిలివెళ్ళింది. కాకులకు ఎంతటి పరిశీలనా శక్తి, జ్ఞాపకశక్తి ఉంటుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం. గాబీ, కాకుల ఈ స్నేహం వైరల్ అవ్వడమే కాదు, జంతువుల సామాజిక ప్రవర్తనపై మనుషుల ఆలోచనా ధోరణిని మార్చేసింది. ప్రకృతిని ప్రేమిస్తే, మూగజీవుల నుంచి కూడా అంతే ప్రేమ తిరిగి వస్తుందని గాబీ కథ మనకు నిరూపిస్తోంది.

Follow Us