
ప్రకృతి కోపానికి సాంకేతికత ఎంత చిన్నదో నిరూపించే దృశ్యం ఇటలీలో వెలుగు చూసింది. ఇటలీలోని ప్రసిద్ధ ఫోర్లీ ఎయిర్‌పోర్ట్ లో సంభవించిన బీభత్సమైన ఈదురుగాలులతో కూడిన తుఫాను విమానాశ్రయాన్ని వణికించింది. గాలుల ధాటికి అక్కడ నిలిపి ఉంచిన విమానాలు రన్‌వేపై గాల్లోకి లేచి బోల్తా పడిన దృశ్యాలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
వాతావరణంలో చోటుచేసుకున్న ఆకస్మిక మార్పుల వల్ల ఫోర్లీ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన తుఫాను విరుచుకుపడింది. గాలుల వేగం గంటకు దాదాపు 120 కిలోమీటర్లకు చేరింది. ఈ ఊహించని తుఫాను ధాటికి ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ ఏరియాలో నిలిపి ఉంచిన అనేక చిన్న తరహా విమానాలు కాగితపు పడవల లాగా గాల్లో తేలి, రన్‌వేపై తలకిందులుగా పడిపోయాయి. ఆ విమానాలు తడి రన్‌వేపై నెమ్మదిగా జారుతూ, గిరగిరా తిరుగుతూ కనిపిస్తున్నాయి. బలమైన గాలుల తాకిడికి, ఈ విమానాలు బరువైన వస్తువులలా కాకుండా తేలికపాటి బొమ్మల్లా కనిపిస్తున్నాయి.
ఈ విధ్వంసానికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈదురుగాలుల తీవ్రతకు భారీ పరిమాణంలో ఉన్న విమానాలు సైతం కంట్రోల్ తప్పి గాల్లోకి లేవడం, వాటి రెక్కలు విరిగిపోవడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. రన్‌వేపై ఉంచిన భద్రతా పరికరాలు, సిగ్నలింగ్ బోర్డులు కొట్టుకుపోయాయి. ప్రకృతి వికటరూపాన్ని చూసి విమానాశ్రయ సిబ్బంది మరియు ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఈ ఘటనలో ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలోని అనేక విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రన్‌వేపై మౌలిక వసతులకు భారీగా నష్టం వాటిల్లింది. అదృష్టవశాత్తూ విమానాలు పార్క్ చేసి ఉన్న సమయంలో ప్రయాణికులు ఎవరూ అందులో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఎయిర్‌పోర్ట్ యాజమాన్యం వెల్లడించింది.
तेज तूफान की चपेट में इटली का एयरपोर्ट… खिलौनों की तरह हवा में उड़े विमान ✈️🌪️ pic.twitter.com/AAQ3RVkR2G
— Neeraj Raathi (@neeraj_raathi) August 23, 2026
ప్రమాదం అనంతరం అధికారులు రన్‌వేను తాత్కాలికంగా మూసివేసి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఈ ఆకస్మిక తుఫాను ధాటికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.