AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిలో ఆలుగడ్డ రూ.లక్ష.. ఏడాదిలో కేవలం 10రోజులే.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?

మన ఇళ్లల్లో నిత్యం వాడే కూరగాయల్లో బంగాళాదుంప కచ్చితంగా ఉంటుంది. మార్కెట్‌కు వెళ్తే కిలో రూ.40కే దొరికే ఈ సాధారణ కూరగాయ ధర.. ఎక్కడైనా బంగారంతో పోటీ పడుతుందని ఊహించగలమా? కానీ ప్రపంచంలో ఒక రకమైన బంగాళాదుంప ఉంది.. దాని రేటు వింటే ఎవరైనా షాక్ అవుతారు. అసలు ఈ బంగాళదుంప స్పెషల్ ఏంటీ..? అనేది తెలుసుకుందాం..

కిలో ఆలుగడ్డ రూ.లక్ష.. ఏడాదిలో కేవలం 10రోజులే.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?
World Costliest Potato Le Bonnotte
Krishna S
|

Updated on: May 31, 2026 | 12:32 PM

Share

సాధారణంగా మార్కెట్లో కిలో బంగాళాదుంపలు రూ.30 నుండి రూ.50 లోపే దొరుకుతాయి. సామాన్యుడి కిచెన్‌లో నిత్యం కనిపించే కూరగాయ ఇది. కానీ ప్రపంచంలో ఒక రకమైన బంగాళాదుంప ధర వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే దాని ధర ఏకంగా బంగారంతో పోటీ పడుతోంది. కేవలం ఒక కిలో కొనాలంటే ఏకంగా రూ.50,000 నుండి రూ.1,00,000 వరకు ఖర్చు చేయాలి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పక్కా నిజం. అంతర్జాతీయ మార్కెట్లో లగ్జరీ బ్రాండ్‌గా మారిన ఆ బంగాళాదుంప పేరు లే బోనోట్. ఇంతకీ ఈ బంగాళాదుంప ఎక్కడ పండుతుంది? దీనికి ఎందుకింత డిమాండ్? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఫ్రాన్స్ ద్వీపంలో మాత్రమే లభ్యం

ఈ అరుదైన బంగాళాదుంప ప్రపంచంలో మరెక్కడా దొరకదు. ఫ్రాన్స్ పశ్చిమ తీరంలో ఉన్న ఐల్ డి నోయిర్‌మౌటియర్ అనే ఒక చిన్న ద్వీపంలో మాత్రమే ఇది పండుతుంది. ఇక్కడి ప్రత్యేకమైన వాతావరణం, సముద్రపు ఉప్పు గాలి ఈ పంటకు ప్రకృతి ప్రసాదించిన వరం.

సంవత్సరంలో కేవలం 10 రోజులు మాత్రమే

ఈ బంగాళాదుంపల లభ్యత చాలా చాలా పరిమితం. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి కేవలం 100 టన్నుల లే బోనోట్ దుంపలు మాత్రమే ఉత్పత్తి అవుతాయి. ప్రతి సంవత్సరం మే నెలలో కేవలం 10 రోజులు మాత్రమే ఇవి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఈ కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ గ్లోబల్ షెఫ్‌లు, లగ్జరీ హోటళ్ల యజమానులు వీటిని దక్కించుకోవడానికి పోటెత్తుతారు.

సముద్రపు నాచుతో సాగు.. విలక్షణమైన రుచి

దీని సాగు విధానం చాలా భిన్నంగా, ప్రకృతిసిద్ధంగా ఉంటుంది. ఈ దుంపలను సముద్రపు ఇసుక నేలల్లో పండిస్తారు. వీటికి ఎరువులుగా ఎలాంటి రసాయనాలను వాడరు. కేవలం సముద్రపు నాచు, ఆల్గేలను మాత్రమే సహజ ఎరువులుగా ఉపయోగిస్తారు. దీనివల్ల ఈ బంగాళాదుంపలకు కొద్దిగా ఉప్పు, నిమ్మకాయ, ఆక్రోట్ మిశ్రమంతో కూడిన విలక్షణమైన, అద్భుతమైన రుచి వస్తుంది.

చేతులతో మాత్రమే కోత.. మెషీన్స్ నో ఎంట్రీ

ఈ దుంపలు ఎంత ఖరీదైనవో.. అంత సున్నితమైనవి. పంట చేతికొచ్చినప్పుడు యంత్రాలను ఉపయోగిస్తే ఇవి దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే వీటిని తవ్వడానికి ఎలాంటి ఆధునిక యంత్రాలను వాడరు. రైతులు తమ చేతులతో మాత్రమే ఒక్కొక్క దుంపను చాలా జాగ్రత్తగా నేల నుండి సేకరిస్తారు. ఈ శ్రమ, మానవ వనరుల వాడకం కూడా దీని ధర అంత ఎక్కువగా ఉండటానికి ఒక ప్రధాన కారణం.

లగ్జరీ హోటళ్లలో స్పెషల్ డిష్..

ఈ బంగాళాదుంపల తొక్క చాలా పలచగా, సున్నితంగా ఉంటుంది. అందుకే దీని వండేటప్పుడు తొక్కను అస్సలు వలవరు. ఫ్రాన్స్‌తో పాటు ప్రపంచంలోని అనేక ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లలో దీనితో చేసే వంటకాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. కేవలం సంపన్నులు, సెలబ్రిటీలు, రాయల్ ఫ్యామిలీస్ మాత్రమే ఈ లగ్జరీ కూరగాయ రుచిని ఆస్వాదించగలరు.

Follow Us