AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టచ్ చేస్తే చావే.. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పక్షి.. పాముల కంటే డేంజర్..

ప్రకృతి సృష్టిలో పక్షులంటేనే అందం, ఆహ్లాదం. కానీ ఆ అందం వెనుక ప్రాణాంతకమైన విషం దాగి ఉందని శాస్త్రవేత్తలే షాక్ తిన్నారు. పసిఫిక్ మహాసముద్రంలోని దట్టమైన అడవుల్లో నివసించే ఈ పక్షిని తాకితే చాలు.. క్షణాల్లో శరీరం మొద్దుబారిపోతుంది. నరాల వ్యవస్థ స్తంభించిపోతుంది. అసలు ఒక పక్షి అంత విషపూరితంగా ఎలా మారింది? దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

టచ్ చేస్తే చావే.. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పక్షి.. పాముల కంటే డేంజర్..
Poisonous Bird In The World
Krishna S
|

Updated on: May 29, 2026 | 4:56 PM

Share

సాధారణంగా విషపూరిత జీవులు అనగానే మనకు పాములు, తేళ్లు, సాలీడులు లేదా కొన్ని రకాల సముద్ర జీవులు మాత్రమే గుర్తొస్తాయి. అందమైన పక్షులు మనకు ఆహ్లాదాన్ని ఇస్తాయి కానీ ప్రాణాలను తీస్తాయని ఎవరూ ఊహించరు. కానీ కేవలం తాకడం ద్వారానే మనుషులను సైతం ప్రమాదంలో పడేయగల ఒక విచిత్రమైన పక్షి ప్రకృతిలో ఉంది. అదే హుడెడ్ పిటోహుయ్ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పక్షిగా దీనికి గుర్తింపు ఉంది. ఈ పక్షిలోని విషపూరిత గుణాన్ని శాస్త్రవేత్తలు చాలా ఆలస్యంగా, అదీ అనుకోకుండా కనుగొన్నారు. 1980వ దశకంలో ప్రముఖ శాస్త్రవేత్త జాక్ డాంబచెర్ పసిఫిక్ మహాసముద్రంలోని న్యూ గినియా దీవుల్లో పరిశోధనలు చేస్తుండగా ఈ పక్షి మొదటిసారి ఆయన కంటపడింది. పరిశోధన కోసం దాన్ని పట్టుకున్న కొద్ది నిమిషాలకే ఆయన చేతులు, కళ్లు, నోటి భాగంలో తీవ్రమైన మంట, దురద, తిమ్మిరి మొదలయ్యాయి. మొదట్లో దానికి కారణం తెలియకపోయినా.. 1992లో డాంబచెర్ బృందం జరిపిన లోతైన అధ్యయనంలో ఒక దిగ్భ్రాంతికరమైన నిజం వెల్లడైంది. ఈ పక్షి చర్మం, ఈకలలో బాట్రాకోటాక్సిన్ అనే అత్యంత శక్తివంతమైన న్యూరోటాక్సిన్ (నరాలపై ప్రభావం చూపే విషం) ఉన్నట్లు వారు గుర్తించారు. కొలంబియా అడవుల్లో దొరికే అత్యంత విషపూరితమైన పాయిజన్ డార్ట్ కప్పలలో ఉండే విషమే ఈ పక్షిలోనూ ఉండటం విశేషం.

ఈ విషం ఎలా వస్తుంది..?

ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, ఈ విషాన్ని పక్షి స్వయంగా తన శరీరంలో ఉత్పత్తి చేసుకోదు. హుడెడ్ పిటోహుయ్ తినే ఆహారం ద్వారానే ఇది దాని శరీరంలోకి చేరుతుంది. న్యూ గినియా అడవుల్లో దొరికే మెలిరిడ్ బీటిల్స్ అనే విషపూరిత కీటకాలను ఈ పక్షులు ఎక్కువగా తింటాయి. ఆ కీటకాల్లోని విషం పక్షి జీర్ణవ్యవస్థ ద్వారా ప్రవహించి, దాని చర్మం, ఈకలలో పేరుకుపోతుంది. దీనివల్ల పక్షికి ఎలాంటి హాని జరగకపోగా అది ఇతర వేటాడే జంతువుల నుండి తన్ను తాను రక్షించుకోవడానికి ఈ విషాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటుంది.

రంగుల వెనుక దాగిన హెచ్చరిక

హుడెడ్ పిటోహుయ్ పక్షి చూడటానికి నలుపు, ముదురు నారింజ రంగుల కలయికతో చాలా అందంగా ఉంటుంది. శాస్త్రీయ పరిభాషలో ఈ స్పష్టమైన రంగుల అమరికను అపోసెమాటిజం అంటారు. అంటే ప్రకృతిలో ఒక జీవి తనను వేటాడే ఇతర జంతువులకు ‘‘నేను చాలా ప్రమాదకరమైనదాన్ని, నన్ను ముట్టుకోవద్దు’’ అని ఇచ్చే ముందస్తు హెచ్చరిక సంకేతం అన్నమాట.

మానవ శరీరంపై దీని ప్రభావం

ఈ పక్షిలోని బాట్రాకోటాక్సిన్ అనే విషం మనుషుల నరాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇది కండరాల చలనాన్ని నిలిపివేసి, పక్షవాతానికి దారితీస్తుంది. ఎక్కువ మొత్తంలో ఈ విషం శరీరంలోకి చేరితే గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

స్థానికులు పిలిచే చెత్త పక్షి

ఈ పక్షిలోని ప్రమాదాన్ని వందల ఏళ్ల క్రితమే గుర్తించిన న్యూ గినియాలోని స్థానిక తెగల ప్రజలు దీనికి ఎప్పుడూ దూరంగా ఉంటారు. దీనిని వారు స్థానిక భాషలో వోబెగ్ లేదా చెత్త పక్షి అని పిలుస్తారు. దీని చర్మాన్ని తాకినా ప్రమాదమే కావడంతో పాటు, దీని మాంసం ఉడికించినప్పుడు ఘాటైన అసహ్యకరమైన వాసన వస్తుంది. అందుకే దీన్ని ఎవరూ వేటాడరు, తినరు. ప్రకృతిలో ఆత్మరక్షణ కోసం విషాన్ని ఆయుధంగా మార్చుకున్న పక్షులు చాలా అరుదు. అందుకే హుడెడ్ పిటోహుయ్ నేటికీ శాస్త్రవేత్తలకు, వన్యప్రాణి ప్రేమికులకు ప్రకృతి ప్రసాదించిన ఒక విస్మయకరమైన రహస్యంగానే మిగిలిపోయింది.

Follow Us