సిలిండర్ ధర రూ.7,000.. ఇరాన్ సరిహద్దు మూసివేతతో పాక్ లో కష్టాలు!
పాకిస్థాన్‌లో 12 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.7,000. ఇరాన్ సరిహద్దును మూసివేయడంతో ఎల్పీజీ సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో రూ.8,200 వరకు పలుకుతోంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్ ప్రజలకు గ్యాస్ ధరల పెరుగుదల భారంగా మారింది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? గ్యాస్ ధరలు ఇంతలా పెరగడానికి కారణమేంటి?

పాకిస్థాన్‌లో 12 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.7,000. ఇరాన్ సరిహద్దును మూసివేయడంతో ఎల్పీజీ సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో రూ.8,200 వరకు పలుకుతోంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్ ప్రజలకు గ్యాస్ ధరల పెరుగుదల భారంగా మారింది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? గ్యాస్ ధరలు ఇంతలా పెరగడానికి కారణమేంటి?
ఇరాన్‌తో సరిహద్దు మూసివేత
పాకిస్థాన్‌కు ప్రతిరోజూ ఇరాన్ నుంచి సుమారు 7,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని దిగుమతి అవుతుంది. అయితే, గాబ్డ్-రిమ్దాన్, తఫ్తాన్ ఈ రెండు ప్రధాన సరిహద్దు మార్గాలను అక్టోబర్ 17న మూసివేశారు. దీంతో ఇరు దేశాల మధ్య సరుకుల రవాణాకు ఆటంకం ఏర్పడింది. ముఖ్యంగా ఎల్పీజీ సరఫరా నిలిచిపోవడంతో పాకిస్థాన్‌లో గ్యాస్ కొరత పెరిగింది.
సరిహద్దు మార్గాల మూసివేతకు రెండు దేశాలు వేర్వేరు కారణాలు చెబుతున్నాయి. భద్రతా సమస్యలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు బలూచిస్థాన్ ప్రావిన్స్ ప్రభుత్వం తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, సాంకేతిక సమస్యల కారణంగా సరిహద్దు మార్గాలను ఇరాన్ మూసివేసింది.
సిలిండర్ ధర రూ.4,500 నుంచి రూ.7,000!
సరఫరా తగ్గిపోవడంతో పాకిస్థాన్‌లో ఎల్పీజీ ధరలు భారీగా పెరిగాయి. గతంలో 4,500 పాకిస్థానీ రూపాయలుగా ఉండే 12 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.7,000కు చేరింది. కొద్ది రోజుల్లోనే సిలిండర్ ధర దాదాపు రెట్టింపైంది. సరఫరాలో అంతరాయాలు కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. గాబ్డ్-రిమ్దాన్ సరిహద్దు మార్గం ద్వారానే రోజుకు 4,000 మెట్రిక్ టన్నులకు పైగా ఎల్పీజీ పాకిస్థాన్‌లోకి వస్తోంది. ప్రస్తుతం ఈ దిగుమతులు నిలిచిపోయాయని గ్వాదర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు షంసుల్ హక్ వెల్లడించారు.
ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర.. ఎక్కడ ఎంతంటే?
పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే వేర్వేరు ధరలకు గ్యాస్ విక్రయిస్తున్నారు. సరఫరా కొరత కారణంగా వినియోగదారులు అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. బలూచిస్థాన్‌లో రూ.7,000, లాహోర్‌లో రూ.7,500, స్కర్దూలో రూ.8,200గా ఉంది. గతంలో 12 కిలోల ఎల్పీజీని రూ.250కు కొనుగోలు చేసేవాడినని, ఇప్పుడు రూ.500 నుంచి రూ.600 వరకు చెల్లించాల్సి వస్తోందని లాహోర్‌కు చెందిన ఫర్హాత్ అబ్బాస్ ఇబ్బందులను వివరించాడు.
సరిహద్దుల్లో చిక్కుకుపోయిన వందలాది ట్రక్కులు!
సరిహద్దు మూసివేతతో గ్యాస్ సరఫరా మాత్రమే కాకుండా, ఇతర వస్తువుల రవాణా కూడా దెబ్బతింది. వందలాది ట్రక్కులు, ఎల్పీజీ ట్యాంకర్లు సరిహద్దులకు ఇరువైపులా నిలిచిపోయాయి. ఇరాన్‌కు పంపాల్సిన బంగాళాదుంపలు, అరటిపండ్లు, బియ్యంతో 1,000కు పైగా పాకిస్థాన్ కంటైనర్లు నిలిచిపోయాయి. పాడైపోయే అవకాశం ఉన్న వస్తువులను పాకిస్థాన్ నుంచి ఎగుమతి చేసేందుకు బుధవారం గాబ్డ్-రిమ్దాన్ సరిహద్దు మార్గాన్ని తిరిగి తెరిచారు. అయితే, ఎల్పీజీ దిగుమతులు ప్రారంభం కాలేదు. సరిహద్దుల వద్ద చిక్కుకుపోయిన ట్రక్కు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస సదుపాయాలు లేని పరిస్థితుల్లో రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు. సరిహద్దు తెరుచుకుంటుందని ఎదురుచూస్తూ వారం రోజులకు పైగా అక్కడే ఉన్నట్లు ఓ డ్రైవర్ అబ్దుల్ ఘనీ బలూచ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
చలికాలం సమీపిస్తుండటంతో ఆందోళన!
పాకిస్థాన్‌లో చలికాలం సమీపిస్తుండటంతో గ్యాస్ కొరతపై ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. వంట అవసరాలతో పాటు ఇతర అవసరాల కోసం ఎల్పీజీపై ఆధారపడే కుటుంబాలకు ధరల పెరుగుదల భారంగా మారింది. గ్యాస్ ధరలు పెరగడం వల్ల ఇతర వస్తువుల ధరలు కూడా పెరిగాయనీ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సరిహద్దు సమస్యలు పరిష్కారం కాకపోతే రానున్న రోజుల్లో గ్యాస్ కొరత మరింత తీవ్రమవుతుందని పాకిస్థాన్ ఎల్పీజీ అసోసియేషన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ ఖోఖర్ హెచ్చరించారు.
పాకిస్థాన్-ఇరాన్ వాణిజ్యంపైనా ప్రభావం!
పాకిస్థాన్, ఇరాన్ మధ్య సరిహద్దు సమస్యలు ఇరు దేశాల వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ పాకిస్థాన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గణాంకాల ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య మొత్తం వాణిజ్యం సుమారు 2.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇందులో పాకిస్థాన్ నుంచి జరిగిన ఎగుమతుల విలువ సుమారు 684 మిలియన్ డాలర్లు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఈ వారంలో ఇరాన్లో పర్యటించి అక్కడి నాయకులతో సరిహద్దు సమస్యలపై చర్చించినున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించేందుకు సంప్రదింపులు జరుపుతున్నామని ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది.