AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎప్పుడైనా ఆలోచించారా.. నదిలో నీళ్లున్నా బ్రిడ్జి ఎలా కడతారు..? ఇంజినీరింగ్ సీక్రెట్ ఇదే..

ఎంత పెద్ద వరద వచ్చినా నది మధ్యలో ఉండే బ్రిడ్జి పిల్లర్లు మాత్రం ఇసుమంతైనా కదలవు. పైన టన్నుల కొద్దీ లోడుతో వెళ్లే ట్రాఫిక్ ఒకవైపు, కింద రాత్రింబవళ్లు నీటి ఒత్తిడి.. అసలు ఉప్పొంగే నది మధ్యలో అంత భారీ పిల్లర్లు ఎలా కడతారో ఎప్పుడైనా ఆలోచించారా? వేల టన్నుల బరువు, ఉధృతమైన ప్రవాహాన్ని ఏళ్ల తరబడి తట్టుకునే ఆ పునాదులు నీటి అడుగున ఎలా పడతాయి? ఇంజినీర్లు ఉపయోగించే మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం..

ఎప్పుడైనా ఆలోచించారా.. నదిలో నీళ్లున్నా బ్రిడ్జి ఎలా కడతారు..? ఇంజినీరింగ్ సీక్రెట్ ఇదే..
How Are Bridge Pillars Built Deep Underwater
Krishna S
|

Updated on: Oct 15, 2026 | 2:52 PM

Share

రైల్లోనో, కారులోనో ప్రయాణిస్తూ నదిపై నిర్మించిన బ్రిడ్జిని దాటుతున్నప్పుడు కింద చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఉగ్రరూపం దాల్చిన నదీ ప్రవాహం, వేల టన్నుల బరువుతో రయ్యిన దూసుకెళ్లే రైళ్లు.. అయినా సరే ఏళ్ల తరబడి ఒక్క ఇంచు కూడా కదలకుండా ఆ పిల్లర్లు ఎలా నిలబడుతున్నాయి? నీటి ప్రవాహం ఆగదు కదా, మరి అంత లోతులో కాంక్రీట్ పునాదులు ఎలా వేస్తారు? ఈ ప్రశ్న వెనుక ప్రపంచ స్థాయి సివిల్ ఇంజినీరింగ్ అద్భుతాలు దాగున్నాయి. వంతెన నిర్మించే ముందు ఇంజినీర్లు ముందుగా నది ప్రవర్తనను రికార్డు చేస్తారు. గత 50 నుంచి 100 ఏళ్లలో ఆ నది గరిష్టంగా ఎంత ఎత్తు వరదను చూసింది? నీటి ప్రవాహ వేగం ఎంత? నది ఉపరితలం కింద ఉన్న ఇసుక, బురద పొరలు ఎన్ని మీటర్ల వరకు ఉన్నాయి? అనే విషయాలను సాయిల్ టెస్టింగ్ ద్వారా కనిపెడతారు. పునాది వేయడానికి అనువైన దృఢమైన రాతి పొర లభించే లోతును బట్టే పిల్లర్ల డిజైన్ ఖరారవుతుంది.

కాఫర్ డ్యామ్

లోతు తక్కువగా ఉండే ప్రాంతాల్లో నది నీటిని కట్టడి చేయడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. బలమైన స్టీల్ షీట్లను భారీ యంత్రాల సాయంతో నది అడుగుకు దించి, ఒక రౌండ్ కవచాన్ని నిర్మిస్తారు. లోపల ఉన్న నీటిని మోటార్ల ద్వారా బయటకు తోడేస్తారు. చుట్టూ నీరు పారుతున్నా, మధ్యలో మాత్రం కార్మికులు నేల మీద పనిచేసినట్టే ఇసుకను తవ్వి పిల్లర్ పనులు మొదలుపెట్టే వీలుంటుంది.

కైసన్స్

నీటి లోతు విపరీతంగా ఉన్న చోట కాఫర్ డ్యామ్‌లు పనిచేయవు. అలాంటి చోట్ల బావి లాంటి లేదా భారీ పెట్టెల వంటి కైసన్స్‌ను రంగంలోకి దించుతారు. ఈ భారీ నిర్మాణాలను వాటి స్వంత బరువుతోనే నది అడుగుకు మునిగిపోయేలా చేస్తారు. పైన నీరు ఉన్నప్పటికీ లోపలికి నీరు చేరకుండా హై ప్రెజర్ ఎయిర్ పంపిస్తారు. ప్రత్యేక ఎయిర్ లాక్ ద్వారా సిబ్బంది లోపలికి వెళ్లి అడుగున ఉన్న మట్టి, రాళ్లను తొలగిస్తారు.

ట్రెమీ పైప్ మ్యాజిక్: నీటి కింద కాంక్రీట్ ఎందుకు కరిగిపోదు?

నదిలో కాంక్రీట్ వేస్తే కొట్టుకుపోతుందనే సందేహం సహజం. అందుకే ట్రెమీ మెథడ్ ఉపయోగిస్తారు. నది అడుగుకు ఒక పొడవైన పైపును దించి, కాంక్రీట్ మిశ్రమాన్ని నేరుగా పునాది లోపలికి పంపిస్తారు. ఇది నీటితో కలవకుండా అడుగు నుంచి పైకి చేరుతూ ఘనీభవిస్తుంది. వైబ్రేటర్లతో గాలి బుడగలను లేకుండా చేసి గట్టి రాయిలా మారుస్తారు.

నది కోతను తట్టుకునే రక్షణ కవచం

పిల్లర్లు వేసిన తర్వాత నదీ ప్రవాహ వేగానికి వాటి అడుగున ఉన్న నేల కొట్టుకుపోకుండా పిల్లర్ల చుట్టూ భారీ సైజు బండరాళ్లతో రిప్‌ర్యాప్ అనే రక్షణ వలయాన్ని పేర్చుతారు. రాత్రింబవళ్లు పారే నీరు, ప్రకృతి వైపరీత్యాలు, భారీ లోడ్లను తట్టుకుంటూ నిలబడే ప్రతి బ్రిడ్జి వెనుక.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, నిరంతర పర్యవేక్షణ, వేలాది మంది ఇంజినీర్లు, శ్రామికుల అలుపెరగని శ్రమ ఉన్నాయి.

Follow Us