పక్షిలా ఎగిరే పాము.. మనుషులను కాటేస్తే ఏమవుతుందో తెలుసా..?
గాల్లో ఎగిరే పాములా? పురాణాల్లో విన్న ఈ అద్భుతం నిజంగానే మన అడవుల్లో ఉందా? రెక్కలు లేకపోయినా పక్షుల మాదిరిగా చెట్ల పైనుంచి కిందకు దూకుతూ గాల్లో ప్రయాణించే వింత జీవి వెనుక అసలు నిజాలేంటి? వన్యప్రాణి పరిశోధకులు తేల్చిన శాస్త్రీయ వాస్తవాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

సినిమాల్లో, జానపద కథల్లో ఆకాశంలో రెక్కలు లేకుండా దూసుకెళ్లే ఎగిరే పాముల గురించి వినే ఉంటాం. అయితే ఇది కేవలం కల్పితం మాత్రమే కాదని, ప్రకృతిలో నిజంగానే గాల్లో ప్రయాణించే పాములు ఉన్నాయని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు. బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా పరిధిలోని వాల్మీకి టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో కనిపించే ఆర్నేట్ ఫ్లయింగ్ స్నేక్ గురించి ఆసక్తికర వాస్తవాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఈ పాములకు రెక్కలు ఉండవు, పక్షుల మాదిరిగా స్వతంత్రంగా పైపైకి ఎగరలేవు. కానీ ఒక చెట్టు పైనుంచి మరో చెట్టుకు గాల్లో సునాయాసంగా జారుతూ ప్రయాణించగలవు. ఎత్తైన కొమ్మల నుంచి దూకే సమయంలో ఈ పాములు తమ పక్కటెముకలను వెడల్పు చేసి, శరీరాన్ని ఒక రిబ్బన్ లేదా పారాచూట్ లాగా పూర్తిగా ఫ్లాట్‌గా మార్చుకుంటాయి. శరీరాన్ని S ఆకారంలో కదుపుతూ గాలి ఒత్తిడిని నియంత్రించి, దాదాపు 100 మీటర్ల దూరం వరకు చెట్టు నుంచి చెట్టుకు జారుతూ వెళ్తాయి. నేలమీద ఉన్న ఎరను పట్టుకోవడానికి, శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తాయి.
మనుషులకు ప్రాణాంతకమా?
సినిమాల్లో చూపించే విధంగా ఇవి మనుషులపై విషం చిమ్ముతూ దాడి చేసే భయంకరమైన జీవులు కావు. ఇవి రియర్ ఫాంగ్డ్ పాములు. వీటి విషం బల్లులు, కప్పలు, చిన్న పక్షులు, కీటకాలు వంటి చిన్న జీవులను వేటాడటానికి మాత్రమే సరిపోతుంది. వీటి కాటు మనుషులకు ప్రాణాంతకం కాదు. మహా అయితే కొద్దిపాటి నొప్పి లేదా వాపు మాత్రమే వస్తుంది తప్ప ప్రాణాపాయం ఉండదు.
వృక్షవాస జీవనశైలి
చాలా రకాల పాములు నేలపై, రాళ్ల సందుల్లో లేదా బొరియలలో జీవిస్తాయి. కానీ ఈ ఆర్నేట్ ఫ్లయింగ్ స్నేక్ పూర్తిగా చెట్ల పైనే జీవించే జీవి. ఆకుపచ్చ, నలుపు, పసుపు చారలతో కూడిన వీటి ఆకర్షణీయమైన శరీరం చెట్ల ఆకుల మధ్య శత్రువుల కంటికి కనిపించకుండా కలిసిపోయేందుకు సహకరిస్తుంది. అభూతకల్పనలు, భయానక అపోహలను పక్కనబెడితే… ఈ ఎగిరే పాము పర్యావరణ సమతుల్యతను కాపాడే ఒక సాధు జీవి మాత్రమేనని, ప్రకృతి రూపొందించిన అద్భుతమైన జీవ పరిణామ క్రమానికి ఇది నిదర్శనమని వన్యప్రాణి పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
