AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉష్ణోగ్రతలు పెరిగితే ఏసీ పేలిపోతుందా? అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?

అధిక ఉష్ణోగ్రతలు, గ్యాస్ లీక్‌లు, మురికి కాయిల్స్, వోల్టేజ్ హెచ్చుతగ్గుల కారణంగా ఏసీలు పేలిపోతున్నాయి. కంప్రెషర్‌ను నీడలో ఉంచడం, సరైన వెంటిలేషన్, క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించడం, కాపర్ కండెన్సర్లను ఎంచుకోవడం వంటి జాగ్రత్తలతో ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ..

ఉష్ణోగ్రతలు పెరిగితే ఏసీ పేలిపోతుందా? అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?
AC explosion causes
Ram Naramaneni
|

Updated on: May 24, 2026 | 5:17 PM

Share

తీవ్రమైన వేసవి ఉష్ణోగ్రతల కారణంగా భారతదేశంలో ఏసీ పేలుడు ఘటనలు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఏసీ కంప్రెషర్లు పేలిన ఘటనలు వార్తల్లో నిలిచాయి. ఈ నేపథ్యంలో ఏసీలు ఎందుకు పేలుతున్నాయి, ప్రమాదాలను నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రజలకు కీలక ప్రశ్నగా మారింది. ఏసీలు పేలిపోవడానికి ఉష్ణోగ్రత పెరుగుదలకు ప్రత్యక్ష సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల ప్రకారం.. గదిని చల్లబరచాలంటే, కంప్రెషర్ చుట్టూ ఉండే ఉష్ణోగ్రత, కండెన్సర్ ఉష్ణోగ్రత కంటే దాదాపు 10 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉండాలట. భారత్‌లో సాధారణంగా ఉపయోగించే ఏసీల కండెన్సర్ ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. బయటి ఉష్ణోగ్రత కండెన్సర్ ఉష్ణోగ్రతను మించిపోతే, ఏసీ పనిచేయడం ఆగిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో కండెన్సర్‌పై అధిక ఒత్తిడి పెరిగి, అది పేలిపోయే అవకాశాలు ఉంటాయి. అధిక ఉష్ణోగ్రతలే కాకుండా, ఏసీ ప్రమాదాలకు మరికొన్ని కారణాలు ఉన్నాయి.

కండెన్సర్ నుంచి గ్యాస్ లీక్ అవ్వడం కూడా ప్రమాదాలకు దారితీస్తుంది. గ్యాస్ తగ్గినప్పుడు, కండెన్సర్‌పై ఒత్తిడి పెరిగి, అది మరింత వేడెక్కి పేలిపోవచ్చు. ఏసీ కండెన్సర్ కాయిల్స్ గాలిలోని వేడిని తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కాయిల్స్‌కు దుమ్ము ఎక్కువగా పట్టినప్పుడు, గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇది కండెన్సర్ మరింత వేడెక్కడానికి దారితీసి ప్రమాదానికి కారణమవుతుంది. అంతేకాకుండా, తరచూ వోల్టేజ్ హెచ్చుతగ్గులు సంభవిస్తే కంప్రెషర్ పనితీరుపై ప్రభావం పడి, అది అగ్నిప్రమాదానికి కారణం కావచ్చు.

ఏసీ పేలుళ్లను నివారించడానికి కొన్ని కీలక జాగ్రత్తలు పాటించాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏసీ కంప్రెషర్ యూనిట్ నీడలో ఉండేలా చూసుకోవాలి. కంప్రెషర్, కండెన్సర్ యూనిట్ చుట్టూ సరైన వెంటిలేషన్ ఉండాలి. గాలి బాగా వీచేలా ఉంటే యూనిట్ అధికంగా వేడెక్కకుండా ఉంటుంది. క్రమం తప్పకుండా ఏసీని సర్వీస్ చేయించాలి. ఎయిర్ ఫిల్టర్, కూలింగ్ కాయిల్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల కంప్రెషర్‌పై అధిక ఒత్తిడి పడకుండా ఉంటుంది. కూలింగ్ ఫ్యాన్‌ను కూడా క్రమం తప్పకుండా పరిశీలించి, ఏదైనా సమస్య ఉంటే వెంటనే రిపేర్ చేయించాలి. నిపుణులు రాగితో తయారైన కండెన్సర్లు ఉన్న ఏసీలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. అల్యూమినియం కండెన్సర్ల కంటే కాపర్ కండెన్సర్లు గాలిలోని నీరు లేదా తేమతో ప్రతిచర్య జరపవు, త్వరగా వేడెక్కవు, అలాగే వేగంగా చల్లబడతాయి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా వేసవిలో ఏసీ పేలుడు ప్రమాదాల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.

తెలంగాణలో మారుతున్న వాతావరణం.. మూడు రోజుల పాటు వర్షాలు, ఈదురుగాలులు.. 

Follow Us