ఈమె ఓ జిల్లా పాలనాధికారి. ప్రజలతో మమేకమై సామాన్య మహిళల మాదిరిగానే పండుగలో పాల్గొన్నారు. గ్రామదేవతలకు మహిళలు సమర్పించే బోనాన్ని ఎత్తుకొని కట్ట మైసమ్మకు నైవేద్యాన్ని పెట్టారు. ఆమె ఎవరో కాదు ఈ యాదాద్రి జిల్లా కలెక్టర్ పమెలా సత్పతి. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఊరురా చెరువుల పండుగలను జాతరలా నిర్వహించారు. గ్రామాల్లో డప్పులు, బోనాలు, బతుకమ్మలతో, మత్స్యకారుల వలల ప్రదర్శనలతో రైతులు, మహిళలు చెరువు కట్టల వద్దకు చేరుకున్నారు. చెరువు కట్టల దేవతల గుళ్ల వద్ద, తూముల వద్ద ముగ్గులు, తోరణాలతో అలంకరించారు. కట్ట మైసమ్మ లకు, గంగమ్మలకు, చెరువు నీళ్లకు పూజలు చేశారు. ఈ క్రమంలో యాదాద్రి జిల్లా వడాయి గూడెం చెరువు వద్ద స్థానికులతో పాటు కలెక్టర్ పమేలా సత్పతి కూడా బోనమెత్తి కట్ట మైసమ్మకు నైవేద్యం సమర్పించారు.
ఇదే రీతిలో గ్రామాల్లోని మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా అధికారిణిలు కట్ట మైసమ్మలకు బోనాల నైవేద్యం సమర్పించారు. ఉత్సవాలలో భాగంగా చెరువులు, సాగునీటి వనరుల ప్రగతిని చదివి వినిపించి, అనంతరం అంతా కలిసి చెరువు కట్టలపైనే సహఫంక్తి భోజనాలు చేయడం విశేషం. ఓ జిల్లా కలెక్టర్ బేషజాలు లేకుండా కట్టుబొట్టుతో గ్రామ దేవతలకు నైవేద్యాన్ని సమర్పించడం అందరినీ ఆకట్టుకుంది.
— రేవన్ రెడ్డి, నల్గొండ
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..