Veena-Vani: సృష్టికి ప్రతిసృష్టి చేసేంతగా విజ్ఞానం.. అయినా వీణ-వాణిల పరిస్థితి ఇంతేనా..

|

Oct 19, 2024 | 9:44 AM

సృష్టికి ప్రతిసృష్టి చేసేంతగా విజ్ఞానం అభివృద్ధి చెందింది. అలవోకగా అవయవాల మార్పిడి జరిగిపోతోంది. వైద్యరంగంలో మిరాకిల్స్‌ చోటుచేసుకుంటున్నాయి. కానీ అవేవీ వీణావాణిని వేరుచేయలేకపోయాయి. దేశవిదేశీ వైద్యులెందరో ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. ఏళ్ల తరబడి అధ్యయనం చేశారు. ఓ దశలో సర్జరీకి కూడా సిద్ధమయ్యారు. కానీ వీణావాణి పుట్టినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. జీవితకాలం ఇలాగే బతకబోతున్నారు. అలా బతికేందుకే మానసికంగా ఎప్పుడో సిద్ధమైపోయారు.

Veena-Vani: సృష్టికి ప్రతిసృష్టి చేసేంతగా విజ్ఞానం.. అయినా వీణ-వాణిల పరిస్థితి ఇంతేనా..
Veena Vani
Follow us on

ఈ ఏడాది అక్లోబర్ 16న…. 22వ వసంతంలోకి అడుగుపెట్టారు అవిభక్త కవలలు వీణ-వాణి. స్వగ్రామంలో ఆత్మీయుల మధ్య వీరి బర్త్‌డే వేడుకలు జరిగాయి. ఆ ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే వీణావాణికి శాప విమోచనం జరిగితే బావుంటుందని మనసున్న ప్రతీ ఒక్కరూ కోరుకున్నారు. ఆ ఇద్దరూ అనుకోలేదుగానీ దైనందిన జీవితంలో వారి ఇబ్బందులు చూసినవారు ఆ కష్టం నుంచి బయటపడితే బావుంటుందనుకున్నారు. కానీ వారిద్దరినీ వేరుచేయడం వైద్యరంగానికే ఛాలెంజ్‌గా మారింది. చివరికి అవిభక్త కవలలను వేరుచేయడంలో నిపుణులైన లండన్‌ వైద్యబృందం ఓ దశలో సర్జరీ సాధ్యమేనంది. అప్పట్లో శస్త్రచికిత్సకు అనుమతి కోరుతూ ఎయిమ్స్‌కి తెలంగాణ ప్రభుత్వం లేఖ కూడా రాసింది. నీలోఫర్‌ వైద్యులు కూడా ఈ ప్రక్రియని త్వరగా పూర్తిచేయాలని ఎయిమ్స్‌ని కోరారు. పన్నెండేళ్ల వయసులో సర్జరీకి లైన్‌క్లియర్‌ అవుతుందనే అనుకున్నారు. తమ సంరక్షణలో అన్నేళ్లపాటు ఉన్న పిల్లలు ఈ సమస్యనుంచి బయటపడాలని నీలోఫర్‌ వైద్య సిబ్బంది కోరుకున్నారు. శాశ్వత పరిష్కారం దొరికితే బావుంటుందని కోరుకున్నారు ఆ పిల్లల మంచీచెడ్డా చూసిన సంరక్షకులు కూడా.

అవిభక్త కవలలు అనగానే ఎవరికైనా ఠక్కుమని వీణావాణినే గుర్తొస్తారు. తెలుగు రాష్ట్రాల్లో వీరి పేర్లు తెలియని వారు దాదాపుగా లేరు. అవిభక్త కవలల పట్టుదల ముందు వారి శారీరక ఆటంకం చిన్నబోయింది. అదే సమయంలో వైద్యరంగానికి కూడా అవిభక్త కవలల అంశం సవాలుగా మారింది. పేద కుటుంబం కావడంతో రెండేళ్ల పాటు గుంటూరు వైద్యుడు నాయుడమ్మ దగ్గర వీణావాణికి చికిత్స అందించారు. 2006లో హైదరాబాద్‌ నీలోఫర్‌ అసుపత్రికి తరలించారు. ఇద్దరిని వేరు చేసేందుకు ముంబై బ్రీచ్‌కాండీ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. మూడ్నెల్లపాటు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసినా ఆపరేషన్‌కి రిస్క్‌ తీసుకోలేకపోయారు అక్కడి వైద్యులు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, లండన్‌ వంటి దేశాల వైద్యులు వచ్చి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించినా శస్త్రచికిత్స మాత్రం సాధ్యంకాలేదు. ఏ సాంకేతిక సమస్యో అయితే తీర్చేయొచ్చు. డబ్బే సమస్యయితే సమకూర్చుకోవచ్చు. కానీ అది సున్నితమైన అంశం. భావోద్వేగాలతో ముడిపడ్డ అంశం.

లండన్‌ వైద్యులు సవాలుగా తీసుకుని ప్రయత్నించినా వీణావాణిలను వేరు చేయాలన్న ప్రయత్నం అడుగుముందుకు పడలేదు. నీలోఫర్‌లో వీణావాణికి వైద్య పరీక్షలు జరిపిన గ్రేట్‌ ఆర్మండ్‌ స్ట్రీట్ ఆస్పత్రి వైద్యులు.. ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యే అవకాశం ఉందనటంతో ఆశలు చిగురించాయి. కానీ వందకు వందశాతం కాదు. ట్వంటీ పర్సెంట్ రిస్క్‌ ఉంది. ఆపరేషన్‌ 80 శాతం సక్సెస్‌ అయ్యే అవకాశం ఉందని తేల్చారు లండన్‌ వైద్యులు. కీడెంచి మేలెంచాలంటారు. రిస్క్‌ ఒకరికే జరగొచ్చు. లేదా ఇద్దరికీ జరగొచ్చు. అందుకే ఇలాంటి ఆపరేషన్లు రెండు విజయవంతంగా చేశామని లండన్‌ వైద్యులు చెప్పినా.. వీణావాణిల సర్జరీకి అనుమతులు లభించలేదు. పైగా ఆపరేషన్‌ ప్రక్రియ అంత సులువేం కాదు. ఐదు దశల్లో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఆరు నుంచి 9 నెలల సమయం పడుతుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆపరేషన్‌ సక్సెస్‌. తల్లిదండ్రులకు ఓకే. కానీ లండన్‌లో చికిత్స చేయాల్సి ఉండటం, రిస్క్‌ ఉందనటంతో ఆపరేషన్‌ ఆలోచన మరుగునపడింది మళ్లీ. ఆస్త్రేలియా వైద్యులు కూడా ముందుకొచ్చినా.. ఆపరేషన్‌తో వీణవాణి ప్రాణాలకు హాని కలిగే ప్రమాదం ఉందని భావించింది ఎయిమ్స్‌.

ఎలాంటి రిస్క్‌ లేదనడానికీ, కొంత ఉందనడానికి చాలా తేడా ఉంది. అందుకే రిస్క్‌ తక్కువే అయినా అవిభక్త కవలల శస్త్రచికిత్సకు ఎవరి మనసూ ఒప్పుకోలేదు. తలలు అతుక్కుని పుట్టారన్న ఒక్క సమస్య తప్ప.. ఆరోగ్యంగా ఉన్నారు వీణావాణి. ఒకవేళ విధి వక్రీకరించి జరగరానిది ఏమన్నా జరిగితే… ఆ నవ్వులు శాశ్వతంగా ఆగిపోతాయని భయం. అందుకే వాళ్ల జీవితాలను రిస్క్‌లో పెట్టడానికి ఎవరికీ మనస్కరించలేదు. శస్త్రచికిత్స జరగాలని ఎవరెవరో కోరుకోవడం కాదు.. తాము విడిపోవాలని వీణావాణి కోరుకోవడం లేదు. ఒకరి కష్టాన్ని మరొకరు ఇష్టంగా స్వీకరిస్తున్నారు. ఒకరు ఇబ్బందిపడ్డా మరొకరు సౌకర్యంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ జన్మకిది చాలు అనుకుంటున్నారు. మా గురించి మీరెవరూ బెంగపెట్టుకోవద్దని తమ చిరునవ్వుతోనే చెబుతున్నారు.

ఇరవై ఒక్క ఏళ్లు కలిసి బతికాం. మిగిలిన జీవితాన్ని కూడా ఇలాగే ఆనందంగా బతగ్గలం అన్నట్లే ఉన్నారు వీణావాణి. శారీరక సమస్య వారి పట్టుదలకు అడ్డురాలేదు. వారి చదువులకు ఆటంకం కలిగించలేదు. చార్టెడ్‌ ఎకౌంటెంట్లుగా తాము కోరుకున్న వృత్తిలో రాణించడం కూడా వారికి సమస్య కాబోదు. విధి వక్రీకరించిందనో, ఇలా ఎందుకు జరిగిందనో బాధపడుతూ కూర్చుంటే జీవితం ముందుకు సాగదు. పసిప్రాయంలోనే ఆశావహ దృక్పథంతో ప్రయాణం ప్రారంభించిన వీణవాణి.. తాము నిర్దేశించుకున్న గమ్యానికి చేరుకోవడం పెద్ద కష్టమేం కాదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..