‘మాతృదేవో భవ’.. ‘పితృదేవో భవ’.. ‘ఆచార్య దేవోభవ’అన్నారు మన పెద్దలు. విద్యార్థులను సన్మార్గంలో నడిపి బతుకు పాఠాలను నేర్పే గురువుకు మన సమాజంలో తల్లిదండ్రులతో సమానంగా అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన ఆ ఉపాధ్యాయుడే దారితప్పితే ఏమంటారు..?
సూర్యాపేట జిల్లా మోతె మండలం రామాపురం తండాలోని ప్రాథమిక పాఠశాలలో గత మూడేళ్లుగా ఎస్జిటి టీచర్‌గా ఉపేందర్ పనిచేస్తున్నాడు. ఈ టీచర్ కు మద్యం లేనిదే పూట గడవదు. ప్రతిరోజు పాఠశాలకు మద్యం సేవించి వస్తున్నాడు. మద్యం ఒకటే కాదు స్కూల్లోనే పిల్లల ముందే సిగరేట్ వెలిగించి విద్యార్థులు చూస్తుండగానే కాలుస్తున్నాడు. తాగిన మైకంలో పాఠశాల గదుల్లోనే నిత్యం పుష్టిగా పడుకోవడం చేస్తున్నాడు. తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఎంత చెప్పినా నిత్యం ఇదే తంతు కొనసాగిస్తున్నాడు.
దీంతో విద్యార్థులకు పుస్తకంలోని పాఠాల కన్నా ఈ తాగుబోతు మాస్టారు తాగుడు పాఠాలే ఎక్కువైపోయాయి. ఈ ఉపాధ్యాయుడితో విద్యార్థులకు ప్రతిరోజు దినదిన గండంలా గడుస్తోంది. దీంతో విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన టీచరే ఇలా అయితే ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ‘ఎప్పుడు మారతారు మా సారు’ అంటూ వారిలో వారే మదనపడుతున్నారు. ఈ క్రమంలో ఉపేందర్ ను సస్పెండ్ చేయాలని గ్రామస్థులు, విద్యార్థులు ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తోటి ఉపాధ్యాయురాలికి గ్రామస్థులు, విద్యార్థులు వినతి పత్రాన్ని సమర్పించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..