Hyderabad Heavy Rains: భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ CURE పరిధిలో హై అలర్ట్ ప్రకటించారు. పోలీస్, మున్సిపల్, వాటర్ బోర్డ్ సహా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. నీరు నిలిచే ప్రాంతాల్లో ముందస్తుగా బృందాలను మోహరించి, నగరవాసులకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని హై అలర్ట్ ఉండాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డ్, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, CURE స్పెషల్ సీఎస్ సహా సీనియర్ అధికారులందరితో యుద్ధ ప్రాతిపదికన సమీక్షించి చర్యలు చేపట్టాలన్నారు. నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా సత్వర చర్యలు చేపట్టాలని, రెయిన్ ఫోర్ కాస్టింగ్ ఆధారంగా రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగా టీమ్స్ మోహరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
కాగా 13 జూన్ నాటికి నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి హర్నై, షోలాపూర్, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కళింగపట్నం, పారాదీప్, బరిపడ, పురూలియా, ధన్‌బాద్, ముజఫర్‌పూర్ మీదుగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2-3 రోజుల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలోని మిగిలిన ప్రాంతాలు, ఒడిశాలోని మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడానికి (ముందుకు సాగడానికి) పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు అంచనా. దక్షిణ తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
