తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాల్లో ఆరు గ్యారంటీలు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉచిత బస్సు మొదలు రైతు భరోసా, ఆసరా పింఛన్ల పెంపు వరకు ఇలా ప్రజలను ఆకట్టుకునే పథకాలతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లింది. మరీ ముఖ్యంగా ఆసర పింఛన్ల పెంపునకు సంబంధించి ప్రజలు బాగా అట్రాక్ట్ అయ్యారని చెప్పొచ్చు.
ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో ఉచిత బస్సు, సిలిండర్‌పై సబ్సిడీ వంటి గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేసింది. అయితే తాజాగా మరో రెండు పథకాలను అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆసరా పింఛన్ పెంపుతో పాటు రైతు భరోసాపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోన్న నేపథ్యంలో ఇంకా పింఛన్ల పెంపు లేకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది.
తాజాగా నిర్వహించిన కులగణన సర్వేలో కూడా ఇదే విషయం స్పష్టమైనట్లు తెలుస్తోంది. ఎన్యూమరేటర్లను ప్రజలు పింఛన్ విషయమై ప్రస్తావిస్తున్నట్లు ప్రభుత్వానికి ఫీడ్ బ్యాక్ అందింది. దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అంశం కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నట్లు భావిస్తోందని సమాచారం. ఇందులో భాగంగానే రూ. 2 వేలు ఉన్న పెన్షన్‌ను రూ. 4వేలకు, దివ్యాంగులకు రూ. 4 వేలుగా ఉన్న పెన్షన్‌ను రూ. 6 వేలకే పెంచేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అందుకే ఎన్నికల్లోపే పింఛన్ పెంపుతో పాటు, రైతు భరోసా పథకాలను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వృద్ధాప్య పింఛన్‌తో పాటు బీడీ కార్మికులకు పింఛన్ పెంచడం, రైతు భరోసా అందించడంతో అటు మహిళలు, ఇటు రైతుల నుంచి తమకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని కాంగ్రెస్ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. రైతు భరోసాకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్ని ఎకరాల వరకు భరోసా ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం సభలో అభిప్రాయాన్ని సేకరించాలని భావిస్తోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం అన్ని జిల్లాల్లో పర్యటించి, రైతులు, రైతు సంఘాలు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించిన విషయం తెలిసిందే. ఈ వివరాలతో పాటు అసెంబ్లీలో రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఈ పథకానికి సంబంధించి విధివిధానాలను ప్రకటించాలని చూస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..