Hyderabad: బ్లింకిట్, జెప్టో, బిగ్‌బాస్కెట్‌లో షాపింగ్ చేస్తున్నారా..? టీజీ సేఫ్ రైడ్స్‌లో షాకింగ్ నిజాలు!
హైదరాబాద్‌లోని క్విక్ కామర్స్ డార్క్ స్టోర్లపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోలకు చెందిన సుమారు 20 స్టోర్‌లలో పరిశుభ్రత లోపాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, సరికాని నిల్వ పద్ధతులు గుర్తించారు. అధికారులు నోటీసులు జారీ చేసి, నమూనాలను సేకరించారు. ఆహార భద్రతపై నిరంతర నిఘా కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని క్విక్ కామర్స్ డార్క్ స్టోర్లపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝుళిపించారు. టీజీ సేఫ్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలతో ఆహార భద్రత, పోలీసు సిబ్బందితో కూడిన 10 ప్రత్యేక బృందాలు నగరంలోని క్యూర్ పరిధిలో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు సంబంధించిన సుమారు 20 డార్క్ స్టోర్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల సందర్భంగా పలు స్టోర్లలో పరిశుభ్రతా ప్రమాణాలు సరిగా పాటించడం లేదని గుర్తించారు. దుమ్ము, ధూళితో కూడిన వాతావరణంలో ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం, సరైన ఉష్ణోగ్రతలను పాటించకపోవడం వంటి లోపాలు బయటపడ్డాయి. ముఖ్యంగా గడువు ముగిసిన కొన్ని ఆహార పదార్థాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ స్టోర్లలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పాడైపోయే ఆహార పదార్థాల నిల్వ, నిర్వహణలోనూ నిర్లక్ష్యం కనిపించినట్లు వెల్లడించారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన స్టోర్ల నిర్వాహకులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అనుమానం ఉన్న ఆహార పదార్థాల నుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలలకు పంపించారు. పరీక్షల నివేదికల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. వేగవంతమైన డెలివరీతో పాటు ఆహార భద్రతకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసిన అధికారులు, డార్క్ స్టోర్లపై భవిష్యత్తులోనూ ప్రత్యేక నిఘా కొనసాగుతుందని వెల్లడించారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
