
Telangana Education Reforms Telugu: తెలంగాణ రాష్ట్ర విద్యా రంగంలో సమూల సంస్కరణలు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత కాలానికి అనుగుణంగా విద్యా విధానాన్ని ఆధునీకరించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బందులు కలగకుండా, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించేలా సంస్కరణలు అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మారుతున్న కాలానికి అవసరమైన నైపుణ్యాలు, ఆధునిక బోధనా పద్ధతులకు విద్యలో ప్రాధాన్యత కల్పించాలని సూచించారు.
రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచే 10+2 విద్యా విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు పాఠశాల విద్యను సమగ్రంగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. 12వ తరగతి స్థాయి నుంచే విద్యార్థులకు వృత్తి నైపుణ్యాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నత విద్యా దశగా పరిగణించి, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక బోధనా విధానాలను రూపొందించాలని ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా నాణ్యమైన బోధన, మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. తరగతి గదులు, ప్రయోగశాలలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. సంస్కరణల అమలులో ఏ ఒక్క విద్యార్థికీ నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.