Telangana: మునుగోడుపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్.. మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు కీలక బాధ్యతలు

|

Oct 06, 2022 | 12:15 PM

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చర్చంతా మునుగోడు ఉప ఎన్నికపైనే. కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా నోటిఫికేషన్ జారీచేయడంతో అన్ని పార్టీల దృష్టి మునుగోడుపైనే పడింది. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ నియోజకవర్గంలో..

Telangana: మునుగోడుపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్.. మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు కీలక బాధ్యతలు
Munugode Bypoll
Follow us on

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చర్చంతా మునుగోడు ఉప ఎన్నికపైనే. కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా నోటిఫికేషన్ జారీచేయడంతో అన్ని పార్టీల దృష్టి మునుగోడుపైనే పడింది. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ నియోజకవర్గంలో త్రిముఖపోరు ఉండటంతో.. ఈ మూడు పార్టీలు మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార టీఆర్ ఎస్ మునుగోడులో గెలుపును ఒక సవాలుగా తీసుకుంది. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సుమారు ఒక ఏడాది రెండు నెలలు మాత్రమే గడువు ఉండటంతో ఇక్కడి గెలుపు ప్రభావం కూడా భవిష్యత్తు ఎన్నికలపై పడే అవకాశం ఉందని టీఆర్ ఎస్ అంచనా వేస్తోంది. అయితే టీఆర్ ఎస్ పేరుతో అభ్యర్థి పోటీచేస్తారా లేదా కొత్తగా ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి పార్టీ పేరుతో పోటీ చేస్తారా అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. టీఆర్ ఎస్ ను బీఆర్ ఎస్ లో విలీనం చేస్తూ ఇప్పటికే తీర్మానం చేసి ఆ తీర్మానం కాపీలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించి.. గుర్తించినట్లు ప్రకటిస్తే మాత్రం బీఆర్ ఎస్ పేరుతోనే మునుగోడులో కేసీఆర్ పార్టీ పోటీచేసే అవకాశాలు ఉన్నాయి. జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత ఎదుర్కోబోతున్న తొలి ఎన్నిక కావడంతో కేసీఆర్ వ్యక్తిగతంగా కూడా ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రస్తుతానికి అధికారికంగా టీఆర్ ఎస్ మునుగోడు అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికి.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సీఏం కేసీఆర్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థి్త్వం వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్టోబర్ 7వ తేదీ శుక్రవారం సాయంత్రానికి ఎన్నికల ఇంఛార్జిలు నియోజకవర్గానికి చేరుకోవాలని సీఏం కేసీఆర్ ఆదేశించారు.

సీఏం కేసీఆర్ ఆదేశాలతో నియోజకవర్గంలో ఇన్ ఛార్జిలుగా ఉన్న ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు తమకు కావల్సిన ఏర్పాట్లు చేయించుకోవడానికి తమ అనుచరులను గురువారం సాయంత్రమే నియోజకవర్గానికి పంపిస్తున్నారు. ఒక్కోక్క ఎంపిటీసీ స్థానానికి ఒక్కోక్క ఇన్ ఛార్జిని టీఆర్ ఎస్ నియమించింది. అలాగే వంద మంది ఓటర్లకు స్థానికంగా ఒక ఇన్ ఛార్జిని నియమించుకోవాలని యూనిట్ ఇన్ ఛార్జిలకు సీఏం కేసీఆర్ ఇప్పటికే దిశానిర్ధేశం చేశారు. ఒక్కో యూనిట్ లో రెండు నుంచి మూడు వేల ఓట్లు ఉండనున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఓటర్ల సామాజిక వర్గాలను అంచనా వేసి.. ఆ ప్రాంతంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపిలకు బాధ్యతలు అప్పగించారు. మొత్తం పార్టీకి చెందిన 86 మంది ఎమ్మెల్యేలకు మునుగోడుకు చెందిన ఎన్నికల బాధ్యతలను కేటాయించారు. 14 మంది మంత్రులకు కూడా ఎన్నికల బాధ్యతలను అప్పగిస్తూ సీఏం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు గట్టుప్పల్-1 బాధ్యతలు అప్పగించగా.. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు మర్రిగూడ బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు.

మునుగోడు ఉప ఎన్నికపై కేసీఆర్ సీరియస్ గా దృష్టిపెట్టడంతో పార్టీ నాయకులు కూడా అలర్ట్ అయ్యారు. ఎలాగైనా టీఆర్ ఎస్ పార్టీని గెలిపించే ఉద్దేశంతో పార్టీ క్యాడర్ అంతా పోలింగ్ తేదీలు సమీపించే వరకు నియోజకవర్గంలోనే ఉండి ప్రచార బాధ్యతలు తమ భుజాన వేసుకోనున్నారు. అక్టోబర్ 7వ తేదీన మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 14 వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. అక్టోబర్ 15వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 17వరకు గడువు ఉంటుంది. నవంబర్ 3వ తేదీన పోలింగ్ నిర్వహించి.. నవంబర్ 6వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..