తెలంగాణలో సెప్టెంబరు, అక్టోబరు నెలలను ప్రజలకు పండుగ నెలలుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెలల్లో రెండు పెద్ద పండుగలు వస్తాయి. ఈ రెండు పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు.. అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలతో నిండిపోయుంటుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ కాగా.. మరొకటి దసరా పండుగ (విజయ దశమి). అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ. తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.
ఈ ఏడాది సెప్టెంబరు 28న బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఆరురోజుల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. వాటిలో ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మలు ముగిశాయి. ఇక బతుకమ్మ పండుగలో 7వ రోజును ‘వేపకాయల బతుకమ్మ‘గా జరుపుకుంటారు. ఈ రోజు బతుకమ్మను తంగేడు, గునుగు, చామంతి, గులాబి పూలతో ఏడంతరాలు పేర్చి ఆడుకొని చెరువులో వేస్తారు. వాయనంగా సకినాల పిండిని వేపకాయల్లా చేసి పెడతారు. లేదా పప్పు, బెల్లం నైవేద్యంగా పెడతారు. అక్టోబరు 6న సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగియనున్నాయి.