Telangana: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య బూడిద రాజకీయం.. మంత్రి పొన్నంపై కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు

|

Jun 11, 2024 | 9:08 PM

కాంగ్రెస్ నేతలు బూడిదను కూడా వదలడం లేదంటోంది బీఆర్ఎస్. ఇందులో ఓ మంత్రి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని విమర్శించింది. అయితే బీఆర్ఎస్‌ బూడిద రాజకీయాలు చేస్తోందంటూ కౌంటర్ ఇచ్చింది అధికార పార్టీ.

Telangana: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య బూడిద రాజకీయం.. మంత్రి పొన్నంపై కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు
Kaushik Reddy Ponnam Prabhakar
Follow us on

కాంగ్రెస్ హయాంలో రామగుండం NTPCలోని ఫ్లైయాష్‌ తరలింపులో కుంభకోణం జరిగిందని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ భారీగా అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. బూడిద తరలింపులో మంత్రి అదనంగా రోజుకు రూ.50 లక్షలు అక్రమంగా సంపాదిస్తున్నారన్నారు. ఓవర్‌ లోడ్‌తో వెళ్తున్న 13 లారీలను తానే స్వయంగా పట్టుకున్నానని తెలిపారు. రవాణా శాఖ అధికారులు రెండు లారీలను మాత్రమే సీజ్‌ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.

ఇంత జరుగుతున్నా NTPC అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడే అధికారుల పేర్లను రెడ్ బుక్‌లో రాస్తున్నామని.. తాము అధికారంలోకి వచ్చిన తరువాత అందరి బండారం బయటపెడుతామన్నారు. ఇప్పటికైనా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కౌశిక్ రెడ్డి డిమాండ్‌ చేశారు.

అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. బీఆర్ఎస్ బూడిద రాజకీయాలు చేస్తోందని ఆరోపించింది. NTPC ఫ్లైయాష్‌ను ఎప్పటి నుంచో ఉచితంగా ఇస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మానేరులో ఇసుక దోపిడీకి పాల్పడిందని.. దీనిపై గ్రీన్ ట్రైబ్యూనల్‌కు ఫిర్యాదు చేస్తే వారికి 50 కోట్ల రూపాయల ఫైన్ విధించారని గుర్తు చేశారు. లారీల ఓవర్‌ లోడ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు.

వీడియో చూడండి..

మొత్తానికి ఎన్నికలు పూర్తయిన తరువాత కూడా తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య ఏదో ఒక అంశంలో పొలిటికల్ వార్ కొనసాగుతోంది. తాజాగా ఫ్లై యాష్‌పై మొదలైన ఈ మాటల యుద్ధం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..