కొయ్యబొమ్మల ఖిల్లా నిర్మల్ జిల్లాలో అతివలదే అగ్రస్థానం కొనసాగుతోంది. జిల్లాలో ఏ శాఖలో చూసినా మహిళా ఉన్నతాదికారులే దర్శనం ఇస్తున్నారు. జిల్లా పాలనలో అగ్రభాగాన నిలిచే కలెక్టర్ , లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్ చేసే ఎస్పీ, విద్యలో జిల్లాను పరుగులు పెట్టించే డీఈవో, గ్రామాలను జిల్లాకు పట్టుకొమ్మలుగా మార్చే డీఆర్డీవో పీడీ..
ప్రగథి రథచక్రాలైన ఆర్టీసీని పరుగులు పెట్టించే డీఎం ఇలా ఒక్కరేమిటి జిల్లాలో ఉన్నతాదికారులంతా మహిళలే కావడం విశేషం.
నిర్మల్ జిల్లా కలెక్టర్ గా అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీగా జానకి షర్మిల, డీఆర్‌డీఓ పీడీగా విజయలక్ష్మి, ఆర్డీవోగా రత్న కళ్యాణి, జిల్లా విద్యాశాఖ అధికారిగా నాగజ్యోతి, ఆర్టీసీ డిపో మేనేజర్‌గా ప్రతిమారెడ్డిలు జిల్లాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ఐదు నెలల క్రితం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి జిల్లాలోని ఉన్నతాధికారుల నుండి గ్రామీణ స్థాయి కింది స్థాయి సిబ్బంది వరకు అందరిని సమన్వయం చేస్తూ.. జిల్లా అభివృద్దిపై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువయ్యేలా చూస్తున్నారు. జిల్లా పోలీస్ బాస్‌గా బాధ్యతలు తీసుకున్న ఎస్పీ జానకి షర్మిల నిజాయితీ, నిబద్దతతో పనిచేస్తున్నారు.