ఆకతాయిలపై చట్టపరమైన చర్యలు తీసుకునే విషయంలో రాజకీయ ఒత్తిళ్లు తప్పడం లేదు. అర్థరాత్రి పెట్రోల్ బంకులో హంగామా సృష్టించిన వారిని కట్టడి చేసిన పోలీసులపై ఎదురు దాడికి యత్నించిన వారిని కాపాడేందుకు కూడా ముఖ్య నాయకులు వెనకాడడం లేదని చర్చ జరుగుతుంది. ఓ వైపున చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్లుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినా క్షేత్ర స్థాయిలో నాయకులు మాత్రం తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో పోలీసులపై ఆకతాయిలు విరుచుక పడుతున్న తీరు వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో గొడవ చోటు చేసుకుందన్న సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అకతాయిలు ఇష్టారీతిన వ్యవహరిస్తుండగా వారిని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే వారిస్తున్న పోలీసులను పట్టించుకోకుండా ఎదురు దాడి చేసేందుకు ప్రయత్నించారు. చివరకు పెట్రోల్ బంకులో గొడవకు కారకులైన జగిత్యాల సమీపంలోని దరూర్ చెందిన శేఖర్, పట్టణానికి చెందిన గంగారాంలను అదుపులోకి తీసుకున్నారు.
జగిత్యాల పట్టణంలో పోలీసులపై ఎదురు దాడికి పాల్పడిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిన వెంటనే ఓ ముఖ్య నేత రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. తమ పార్టీ కార్యకర్తలను పోలీసుల చెర నుండి విడిపించుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల విధులకు ఆటంకం కల్గించిన వారికి నోటీసులు ఇప్పించడంలో సఫలం అయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్య నేత ఎంట్రీ వల్లే వారు సేఫ్ అయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెట్రోల్ బంకులో జరిగిన గొడవలో పోలీసుల విధులకు ఆటంకం కల్గించిన సెక్షన్లలో పోలీసులు కేసు నమోదు చేశారు. శేఖర్ ,గంగారాం లపై 221,132, 351 BNS యాక్ట్ సెక్షన్లలో టౌన్ ఎస్సై గీత కేసు నమోదు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి