నల్లగొండ ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం హుజూర్ నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్ధి వేమిరెడ్డి నరసింహరెడ్డి తో పాటు జగదీశ్వర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి పార్లమెంట్ పరిధిలో సరిగా ఏజెంట్లు కూడా లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయన్నారు. చివరి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ చరిత్రలో నిలిచిపోతారని ఆయన జోస్యం చెప్పారు. 63 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏమి చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి నిరోధకులని ఆరోపించిన జగదీశ్వర్‌రెడ్డి.. పవర్ ప్లాంట్ ను అడ్డుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ నాయకులు కాదా అని ప్రశ్నించారు.