Kodad: సీన్ రివర్స్.. అత్తాగారింటి ఎదుట అల్లుడి నిరసన.. ఎన్నడైనా చూశారా..?

|

Apr 02, 2023 | 8:23 PM

ఇప్పటివరకు ఇలాంటి సీన్ చూసి ఉండరు. అత్తగారి ఇంట ఎదుట నిరసనకు దిగాడు అల్లుడు. అసలు అతడి సమస్య ఏంటి..? గొడవ ఎక్కడ వచ్చింది..? విషయం ఎంతవరకు వెళ్లింది.. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Kodad: సీన్ రివర్స్.. అత్తాగారింటి ఎదుట అల్లుడి నిరసన.. ఎన్నడైనా చూశారా..?
Husband Protest
Follow us on

అత్తారింటి వేధింపులతో కోడళ్ళు కానీ, ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేయడం ఇప్పటివరకు చూశాం. ఇక్కడ మాత్రం అల్లుడు అత్తారింటిముందు ధర్నా చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. తన కన్న పేగును తనకు దూరం చేయ్యొద్దంటూ వేడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే..  కోదాడకు చెందిన రమణి పృథ్వితో హైదరాబాద్ చెందిన ప్రవీణ్ కుమార్‌కు 2018 ఆగస్టులో వివాహమైంది. వీరి కాపురం అక్టోబర్ 2021 వరకు సజావుగానే సాగింది. వీరికి మూడేళ్ల కౌటిల్య కార్తికేయన్ అనే బాబు ఉన్నాడు. కానీ ఏమైందో తెలియదు కానీ భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. ఏడాదిన్నర క్రితం బాబుతో కోదాడలోని తన పుట్టింటికి రమణి పృథ్వి వచ్చేసింది.

బాబుని కోదాడలో తల్లితండ్రుల వద్ద విడిచి రమణి పృథ్వి కెనడాకు వెళ్ళింది. దీంతో ప్రవీణ్ కుమార్ కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. 9 నెలల క్రితం బాలుడిని తండ్రి ప్రవీణ్ కుమార్ ప్రతివారం కలిసేలా చూడాలని రమణి పృథ్వి తల్లిదండ్రులను ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. తన కొడుకును చూసేందుకు ప్రవీణ్ కుమార్ ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ అత్తమామలు అడ్డుకోవడంతో ఫలితం లేకపోయింది. దీంతో తన కొడుకును తనకు చూపించాలంటూ తల్లిదండ్రులతో కలిసి ఈ రోజు కోదాడలోని అత్తగారింటి ఎదుట ధర్నా చేశారు. మూడేళ్ల తన కొడుకుకు కోసం తీసుకున్న ఆట వస్తువులు ఇష్టమైన బొమ్మలతో నిరసన వ్యక్తం చేశాడు. ఏడాదిన్నరగా తన కొడుకుకు దూరంగా ఉండాల్సి వచ్చిందని ప్రవీణ్ వాపోతున్నాడు.

కోర్టు ఆర్డర్‌ను రమణి పృథ్వి తల్లిదండ్రులు అమలు చేయకుండా తన కొడుకుని తనకు దూరం చేస్తున్నారని ప్రవీణ్ ఆరోపిస్తున్నాడు. కొడుకును చూపించకుండా అత్తమామలు అడ్డుకుంటున్నారని ఆరోపించాడు. పిల్లల మధ్య అభిప్రాయ భేదాలతో గొడవలు ప్రారంభమయ్యాయని ప్రవీణ్ తండ్రి చెబుతున్నారు. వీరి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను పరిష్కరించే ప్రయత్నం తన కోడలు తల్లిదండ్రులు ఏమాత్రం చేయలేదని ప్రవీణ్ తండ్రి చెబుతున్నారు. కోర్టు ఆదేశం ప్రకారం తమ మనమడిని తమకు చూపించకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.