మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి ఘన విజయం సాధించారు. 26320 ఓట్లతో సమీప అభ్యర్థి బిజెపికి చెందిన అందెల శ్రీరాములు యాదవ్ పై గెలుపొందారు. రంగారెడ్డి జిల్లాలో కీలకమైన స్థానమే కాదు.. హైదరాబాద్ శివారులో హాట్ సీటు. అందుకే, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని (Maheswaram Election Result) అన్ని పార్టీలు సీరియస్‌గా తీసుకున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సబితా ఇంద్రారెడ్డి.. ఆ తర్వాత కారెక్కి మంత్రి పదవి దక్కించుకున్నారు. మహేశ్వరం నుంచి మూడో సారి హ్యాట్రిక్ కొట్టాలని ఫిక్సయి.. విజయం సాధించారు. మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి.. బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ బరిలో నిలిచి… ఓటమి పాలయ్యారు.
మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో… GHMC స్థానాలైన సరూర్‌నగర్, ఆర్‌కే పురం డివిజన్లు, మీర్‌పేట, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లు.. జల్‌పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీలు.. మహేశ్వరం, కందుకూరు గ్రామీణ మండలాలు ఉన్నాయి. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాలు కలగలిపిన నియోజకవర్గం ఇది.
మహేశ్వరం నుంచి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 9,227 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సబితా ఇంద్రారెడ్డికి 95481 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డికి 86254 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బీజేపీ తరపున పోటీచేసిన శ్రీరాములు యాదవ్ కు కూడా 38 వేలకు పైగా ఓట్లు రావడం విశేషం. ఆ ఎన్నికల తర్వాత సబితా రెడ్డి బీఆర్ఎస్‌లో చేరి కేసీఆర్ కేబినెట్‌లో మంత్రి అయ్యారు.
అంతకు ముందు 2014లో తీగల కృష్ణా రెడ్డి(టీడీపీ) తన సమీప ప్రత్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి (కాంగ్రెస్)పై 30,784 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తీగలకు 93,305 ఓట్లు రాగా.. రంగా రెడ్డికి 62,521 ఓట్లు, కొత్త మనోహర్ రెడ్డి (టీఆర్ఎస్)కి 42,517 ఓట్లు వచ్చాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్