
హైదరాబాద్: వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను రైతులకు చేరువ చేయడంతో పాటు, తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందే ప్రత్యామ్నాయ సాగు విధానాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా కొడంగల్‌లో నవంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు మెగా రైతు మేళాను నిర్వహించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 7న ఈ మేళాను ప్రారంభించనున్నారు.
రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసేలా మేళాలో 150 ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖలతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బ్యాంకింగ్ సంస్థలు, విత్తన పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు సహా మొత్తం 26 ప్రభుత్వ శాఖలు, అనుబంధ సంస్థలు ఇందులో భాగస్వాములు కానున్నాయి.
నాణ్యమైన విత్తనాలు, వ్యవసాయ ఇన్పుట్స్, ఆధునిక యంత్రాలు, డ్రోన్లు, వ్యవసాయ పరికరాలు, నూతన సాగు సాంకేతికత, ప్రభుత్వ పథకాలను స్టాళ్ల ద్వారా రైతులకు వివరించనున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, అవార్డులు పొందిన ప్రగతిశీల రైతులతో ప్రత్యేక సాంకేతిక సమావేశాలు, ముఖాముఖి చర్చలు నిర్వహించనున్నారు.
మేళా తొలిరోజు వికారాబాద్, నారాయణపేట జిల్లాలతో పాటు కొడంగల్ నియోజకవర్గ పరిధి నుంచి సుమారు 7,500 మంది రైతులు పాల్గొననున్నారు. ప్రస్తుతం నెలకొన్న ఎల్‌నినో పరిస్థితులు, వాతావరణ మార్పుల ప్రభావం, రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ పంటల సాగు విధానాలపై నిపుణులు అవగాహన కల్పించనున్నారు.
ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా రైతులకు వ్యవసాయ యూనిట్లు, పరికరాలను పంపిణీ చేయనున్నారు. కస్టమ్ హైరింగ్ సెంటర్లు, పప్పుధాన్యాల మిల్లులు, నూనె గానుగ యూనిట్లు, భూసార పరీక్ష కార్డులు, బయో రిసోర్స్ ఇన్పుట్ సెంటర్లు, ఉద్యానవన శాఖకు సంబంధించిన డ్రిప్ సిస్టమ్‌లను అందించనున్నారు.
రైతు మేళా రెండో రోజు మహిళా రైతుల భాగస్వామ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మహిళల పాత్రను మరింత బలోపేతం చేయడంతో పాటు ఆధునిక సాంకేతికత వినియోగం, ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు.
మూడు రోజుల రైతు మేళాలో చివరి రోజు భారీగా రైతులు తరలిరానున్నారు. పొరుగు జిల్లాలతో కలిపి మొత్తం 10 జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది రైతులు హాజరయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చివరి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంతో మెగా రైతు మేళా ముగియనుంది.
రైతులకు ఆధునిక వ్యవసాయ విధానాలను పరిచయం చేయడం, శాస్త్రీయ సాగుపై అవగాహన పెంచడం, వ్యవసాయంలో వస్తున్న మార్పులను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం ఈ మెగా రైతు మేళా ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది.