Tiger Johnny: లేడీ జాన్‌ కోసం డీప్‌ ఫారెస్ట్‌లో టైగర్‌ జానీ ప్రేమయాత్ర

|

Nov 20, 2024 | 8:44 AM

పులిరాజా ప్రేమ్‌ కహానీ. ఆశ్చర్యం ఏంటీ బాసూ. లేడీ జాన్‌ కోసం డీప్‌ ఫారెస్ట్‌లో టైగర్‌ జానీ ప్రేమయాత్ర ఇప్పుడు హాట్‌ టాపిక్‌. మడిషాన్నాక కూసింత కళా పోషణ ఉండాలంటారు. మరి పులి అన్నాక కాసింతైన ప్రేమ ఉండకూడదా? తోడు కోసం..లేడీ జాన్‌ జాడ కోసం కొండకోనలను దాటుతూ గత 25 రోజులుగా టైగర్‌ జానీ లవ్‌ జర్నీ కొనసాగుతూనే ఉంది.మరి టైగర్‌ జానీకి తోడు దొరికేది ఉందా? లేదా? ఆ ముచ్చట ఎలా వున్నా జానీ రాకడతో జీవవైవిధ్యం కలసాకరమైందంటోంది అటవీ శాఖ .

Tiger Johnny: లేడీ జాన్‌ కోసం డీప్‌ ఫారెస్ట్‌లో  టైగర్‌ జానీ ప్రేమయాత్ర
Johnny Tiger (Representational Image)
Follow us on

అడవుల నెలవు.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో  జీవవైవిధ్యానికి మళ్లీ మహర్ధశ.. కవ్వాల్‌ అభయారణ్యలో  మళ్లీ కిలకిలరావాలు.. ఓ వైపు సొగసు చూడతరమా అనేలా సహజ అందాలు..జంతు సంపద.. మరోవైపు అభయారణ్యం వైపు చూస్తే గుండెల్లో దడదడ. కవ్వాల్‌ అభయారణ్యంలో పులిరాజా సంచారం. ఇది కన్‌ఫర్మ్‌. ఓ వైపు జనంలో భయం.. మరోవైపు పులిరాజ విరహ వేదన.

ఆశ్చర్యం కాదు. పచ్చని అడవంత పచ్చని నిజం ఇది. మహారాష్ట్ర నుంచి కవ్వాల్‌ కీకారణ్యానికి  వలస వచ్చిన  టైగర్‌ జానీకి సూపర్‌ డూపర్‌గా నీడ  దొరికింది. కానీ తోడు లేక ఆడపులి జాడ కోసం చెట్టు పుట్ట గుట్టల్ని గాలిస్తూ  అడవంతా అన్వేషిస్తోందట. ప్రేమంటే త్యాగం అనే అర్ధం తెలియని  ఉన్మాదులు మృగాళ్లు ఎందరో వున్నారు.. కానీ టైగర్‌ జానీ మాత్రం స్వచ్చమైన మనసుతో ప్రేమ కోసం పరితపిస్తోంది. ఆడ తోడు కోసం  అలుపెరుగని ప్రయాణం సాగిస్తోంది. ఒకటి కాదు‌ రెండు కాదు ఏకంగా 25 రోజులుగా నడక సాగిస్తూనే ఉంది. ఇప్పటికే 350 కిమీ దాటిన బెబ్బులి ప్రయాణం.. లాంగ్ మార్చ్‌ను తలపించేలా సాగుతూనే ఉంది.  మహారాష్ట్ర అడవుల నుండి కొండలు దాటి గుట్టలు దాటి జాతీయ రహదారులను‌ సైతం లెక్క చేయకుండా సాగుతూనే ఉంది బెబ్బులి ప్రయాణం.

ప్రేయసీ రావే అని పాడుకునేంత భగ్న ప్రేమతో  టైగర్‌ జానీ జోడేఘాట్‌ బాటపట్టింది. ఎందుకంటే  అక్కడ ఆడపులి జాడను పసిగట్టిందట. అందుకే ఈ పరుగు ప్రయాణం . ఎంత రారాజైన .. రాణి తోడు లేక విలవిల్లాడుతోన్న టైగర్‌ జానీ  భగ్న ప్రేమను చూసి అడవి కన్నీరవుతుందా! అన్నట్టుగా వుంది సిట్చుయేషన్‌.  టైగర్‌ జానీ అడుగు జాడలో మరిన్ని పులులు వస్తే.. అడవికి అందం.. అభయం మాత్రమే కాదు  పులుల సంతతి పెరిగి జీవవైవిధ్యం మరింతగా వర్ధిల్లుతుందంటోంది అటవీ శాఖ. నిజానికి ఒకప్పుడు కవ్వాల్‌ ..టైగర్ల అడ్డ.కానీ కలపాసురుల వల్ల  అడవి పల్చనవ్వడంతో ఇక్కడి నుంచి మహారాష్ట్రకు వలస వెళ్లాయి. ఇప్పుడుకవ్వాల్‌ పచ్చగా నిగనిగలాడుతోంది. దాంతో కవ్వాల్‌ బాటపట్టాయి పులులు.

పులుల రాకడ అంటే ప్రాణం పోకడ అని భయపడాల్సిన పనిలేదు. పులులను కాపాడితే అవి అడవుల్ని కాపాడ్డం మాత్రమే కాదు.. జీవవైవిధ్యానికి రక్షణ కవచంలా నిలుస్తాయంటున్నారు ఫారెస్ట్‌ అధికారులు, నిపుణులు. ప్రస్తుతం సిర్పూర్ , ఆసిపాబాద్ అభయారణ్యంలో పదికి పైగానే పులులు కాగజ్‌ నగర్ కారిడార్ లో స్వేచ్చగా సంచరిస్తున్నాయని..  మరో 5 కు పైగా వలస పులులు జిల్లాలోకి వచ్చి వెళుతున్నాయని అటవిశాఖ చెప్తోంది.

అదీ సంగతి. కవ్వాల్‌ అభయారణ్యం అలా జీవవైవధ్యానికి కేంద్రంగా మారుతోంది. పులులతో మంచే కానీ అనుకున్నంత డేంజర్‌ ఉండదని అటవీ శాఖ అభయం హస్తం ఇస్తోంది. ఇదంతా బాగానే ఉంది.కానీ  టైగర్‌ జానీ ఆవేదన అడవంతా కన్నీరు అన్నట్టుగా మారింది.విహారాయాత్ర అనట్టుగా కవ్వాల్‌కు వచ్చి ఇప్పుడు విరహవేదనతో  పరితపిస్తోన్న టైగర్ జానీ మాటేంటి? ప్రేమప్రయాణం  ఎప్పటిదాక? ఇంకా ఏందాక? అన్నది వెయిట్ అండ్ సీ…

జాడ తెలుసుకొని తన తోడుతో  కవ్వాల్‌లో సెటిలైతే…ఇక టైగర్‌ జానీ ప్రేమకథ ఇక సూపర్‌ డూపర్‌ హిట్టే. అలా కావాలని ఆశిద్దాం…పులులను రక్షిద్దాం.

మరిన్ని తెలంగాణా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..