మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం గుడిబండ గ్రామంలో కత్తి దాడి కలకలం రేపింది. మదనపురం మండలం కొన్నూరు గ్రామానికి చెందిన కురుమన్న అత్తగారింటికి వచ్చి ఏకంగా భార్య లక్ష్మి, అత్త నిర్మలమ్మ పై దాడి చేశాడు. ఘటనలో అత్త నిర్మలమ్మకు తీవ్ర గాయాలు కావడంతో మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అలాగే భార్య లక్ష్మి చేతులకు బలమైన గాయాలైయ్యాయి. అత్త నిర్మలమ్మ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. అత్త, భార్యపై కత్తితో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ఇంటి నిండా రక్తపు మరకలు ఏర్పడ్డాయి.
గుడిబండ గ్రామానికి చెందిన ముచ్చింతల నిర్మలమ్మ పెద్ద కూతురు లక్ష్మిని, మదనపురం మండలం కొన్నూరు గ్రామానికి చెందిన కురుమన్నకు ఇచ్చి 17 సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు ఒక కూతురు సంతానం. అయితే భార్యపై అనుమానంతో కురుమన్న లక్ష్మీతో తరచూ గొడవపడేవాడు. భర్త వేధింపులు తాళలేక గత కొన్ని రోజుల నుంచి దూరంగా ఉంటోంది. హైదరాబాద్లో కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే భార్యను కాపురానికి తీసుకెళ్ళేందు పెద్దమనుషుల మధ్య పంచాయితీ పెట్టించాలని కోరాడు. ఈ తరుణంలో ఆదివారం రోజు గుడిబండ గ్రామంలో అత్తగారింటికి వచ్చాడు. రావడం రావడంతోనే భార్య లక్ష్మీపై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించగా, అత్త నిర్మలమ్మ అడ్డుపడింది. దీంతో ఆమెపై అదే కత్తితో దాడి చేశాడు. ఘటనలో భార్య, అత్త ఇద్దరికీ గాయాలైయ్యాయి. అనంతరం కురుమన్న అక్కడి నుంచి పారిపోయాడు. అరుపులు, కేకలు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న నిర్మలమ్మను, తీవ్ర గాయాలతో ఉన్న లక్ష్మీని పోలీసు వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.