TG Rain Alert: కమ్ముకొస్తున్న చిమ్మచీకట్లు.. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్!

|

Jul 19, 2024 | 7:05 AM

తెలంగాణలోని అన్ని జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడేఅవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. దక్షిణ - ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య ట్రోపోస్పీయర్ వరకు ఆవర్తనం విస్తరించింది. జైసాల్మయిర్, కోట, గుణ, కళింగపట్నం గుండా వెళుతూ మధ్య బంగాలఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఋతుపవన ద్రోణి..

TG Rain Alert: కమ్ముకొస్తున్న చిమ్మచీకట్లు.. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్!
TG Rain Alert
Follow us on

హైదరాబాద్, జులై 19: తెలంగాణలోని అన్ని జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడేఅవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. దక్షిణ – ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య ట్రోపోస్పీయర్ వరకు ఆవర్తనం విస్తరించింది. జైసాల్మయిర్, కోట, గుణ, కళింగపట్నం గుండా వెళుతూ మధ్య బంగాలఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఋతుపవన ద్రోణి కొనసాగుతుంది. గాలి విచ్చిన్నతి 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సగటు సముద్ర మట్టానికి 3.1 కి. మీ. నుండి 5.8 కి. మీ ఎత్తు మధ్యలో కొనసాగుతుంది. దీంతో రాగాల రెండు మూడు రోజులలో రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, అక్కడ అక్కడ భారీ వర్షాలు కొన్ని కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులుతో గంటకు 30 నుండి 40 కి. మీ మేర, అప్పుడప్పుడు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉమ్మడి.. ఆదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, నల్లగొండ, కరీంనగర్,రంగారెడ్డి, సంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాకు వర్ష సూచన జారీ అయ్యింది. ఇక రాగాల 24 గంటలలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారుల కీలక సూచనలు.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట పెద్దవాగుకు పెద్ద ఎత్తున వరద రావడం వల్ల గేట్లు ఎత్తడంతో దిగువ భాగంలోని గ్రామాల రైతులు వరద నీటిలో చిక్కుకున్న సంఘటనకై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీ, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సహాయ పునరావాస చర్యలను సమీక్షించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో సీఎస్ మాట్లాడుతూ.. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాణనష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పెద్ద వాగుకు చెందిన మూడు గేట్లు ఎత్తడంతో సమీపంలోని నాలుగు గ్రామాలలోకి వరద నీరు ఒక్క సారిగా చేరడంతో వ్యవసాయ భూముల్లో నీటిలో చిక్కుకున్న 28 మందిని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ బృందాలు రెండు హెలికాప్టర్ల సహాయంతో రక్షించి సురక్షింత ప్రాంతాలకు తరలించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

మరో 20 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర రెస్క్యూ బృందాలు సహాయ పునరావాస కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నాయని అన్నారు. గుమ్మడివెళ్లి, కోయగూడెం, కొత్తూరు, గాజులపల్లి గ్రామాల ప్రజలను పునరావాస శిబిరాల్లోకి తరలించే ప్రక్రియ కొనసాగుతుందని కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు అత్యంత ప్రధానమని, సహాయ పునరావాస కార్యక్రమాలకు సంబంధించి హైదరాబాద్ నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్న అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎస్ స్పష్టం చేశారు. పరిసర గ్రామాల్లోని చెరువులు, కుంటలు తెగకుండా ముందస్తు చర్యలను చేపట్టాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. భారీ వర్షాలు, వరదల వల్ల సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించినట్లు డీజీపీ జితెందర్ తెలిపారు. భారీ వర్షాల వల్ల ఒక్కసారిగా 40 వేల క్యూసెక్కుల వరద రావడంతో గేట్లు ఎత్తాల్సివచ్చిందని, ప్రస్తుతం వరద తగ్గిందని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా వివరించారు

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.