
హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాకు మరింత ఊపొచ్చేలా భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన రద్దీకి పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం, టీజీఎస్‌ఆర్టీసీ చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్రం పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద కేటాయించిన 2,200 ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా నగర రోడ్లపైకి తీసుకురానున్నారు. కొత్త ఎలక్ట్రిక్ బస్సుల రాక నవంబర్ నుంచే ప్రారంభం కానుంది. తొలిదశలో 137 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత విడతల వారీగా మరిన్ని బస్సులను నడిపించనున్నారు. మొత్తం 2,200 బస్సుల పంపిణీ ప్రక్రియను 2028 జనవరి నాటికి పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. కేంద్రం కేటాయించిన ఈ బస్సుల్లో వివిధ రకాల వాహనాలు ఉండనున్నాయి. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏసీ, నాన్ ఏసీ, మినీ, లోఫ్లోర్ బస్సులను నగరంలోని వివిధ మార్గాల్లో నడిపించే అవకాశం ఉంది. తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులకు డిమాండ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి రావడంతో బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య బాగా పెరిగింది.
గతంలో హైదరాబాద్ నగర పరిధిలో రోజుకు సుమారు 12 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించగా.. ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు 25 లక్షలకు చేరినట్లు అంచనా. దీంతో ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో చాలా మార్గాల్లో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. కొన్ని రూట్లలో సీటు సంగతి అటుంచితే.. నిలబడేందుకు కూడా స్థలం లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నగరంలోని పలు డిపోల నుంచి ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా కూడా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయినప్పటికీ ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టుగా బస్సుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో పీఎం ఈ-డ్రైవ్ కింద రానున్న 2,200 బస్సులు కీలకంగా మారనున్నాయి. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో సర్వీసుల సంఖ్యను పెంచే అవకాశం ఉంటుంది. దీంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, మహిళా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందే అవకాశం ఉంది.
అయితే కొత్త బస్సులు అందుబాటులోకి రావడం మాత్రమే కాకుండా.. వాటిని ఏ రూట్లలో నడుపుతున్నారు, ఎంత తరచుగా సర్వీసులు అందిస్తున్నారు, రద్దీ మార్గాలకు ఎన్ని బస్సులు కేటాయిస్తున్నారు అన్న అంశాలపైనే ప్రయాణికులకు కలిగే ప్రయోజనం ఆధారపడి ఉంటుంది. మొత్తంగా చూస్తే.. దశలవారీగా 2,200 ఎలక్ట్రిక్ బస్సులు నగర రోడ్లపైకి వస్తే హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సర్వీసులను విస్తరించేందుకు ఆర్టీసీకి ఇది మరింత అవకాశం కల్పించనుంది.