Swami Vivekananda: హైదరాబాద్‌లో పర్యటించిన వివేకానందుడు.. తొలిప్రసంగం ఇక్కడే చేశారు..

|

Feb 13, 2021 | 9:31 PM

Swami Vivekananda: స్వామి వివేకానందుడు అనగానే.. ప్రముఖంగా గుర్తుకు వచ్చేది చికాగో ప్రసంగం. కానీ, ఆ చికాగో ప్రసంగానికి ముందు..

Swami Vivekananda: హైదరాబాద్‌లో పర్యటించిన వివేకానందుడు.. తొలిప్రసంగం ఇక్కడే చేశారు..
Follow us on

Swami Vivekananda: స్వామి వివేకానందుడు అనగానే.. ప్రముఖంగా గుర్తుకు వచ్చేది చికాగో ప్రసంగం. కానీ, ఆ చికాగో ప్రసంగానికి ముందు ఆయన మన భాగ్యనగరంలో ప్రసంగించారనే విషయం ఎంతమందికి తెలుసు? అవును నిజంగా నిజం.. స్వామి వివేకానంద అమెరికాలోని చికాగో నగరానికి వెళ్లక ముందు 1893 ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 13న సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో ‘మై మిషన్ టు ది వెస్ట్’ పేరుతో జరిగిన సభలో స్వామి వివేకానంద ప్రసంగించారు. అయితే, వివేకానందుని పర్యటనను పురస్కరించుకుని సికింద్రాబాద్‌లోని మహబూబ్ కాలేజీలో ‘రామకృష్ణ మఠం’ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా మహబూబ్ కాలేజీలోని స్వామి వివేకానంద హాల్‌లో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలన్స్’ డైరెక్టర్ స్వామి బోధమయానంద మాట్లాడుతూ.. స్వామి వివేకానంద బోధనలు నేటికీ అనుసరణీయమన్నారు. చికాగో నగరానికి వివేకానందుడు వెళ్లకముందే.. హైదరాబాద్‌లో 1893లో ఇదే రోజున ఆయనిచ్చిన ఆంగ్ల ప్రసంగం స్వయంగా స్వామిజీలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింప చేసిందన్నారు. వెయ్యి మంది సభికుల ముందు ఆయనిచ్చిన ప్రసంగం ఎందరిలోనో స్ఫూర్తినింపిందన్నారు. ఆరోజు ‘మిషన్ టు ది వెస్ట్’ పేరిట ఆయనిచ్చిన ప్రసంగంలో భారత ఔన్నత్యాన్ని చాటడానికి అమెరికా వెళుతున్నానని స్వామిజీ తెలిపారని బోధమయానంద గుర్తుచేశారు.

స్వామి వివేకానంద వారం రోజుల పర్యటనను ప్రస్తుతానికి రామకృష్ణ మఠం నిర్వహిస్తున్నా.. వాస్తవానికి ప్రభుత్వాలే నిర్వహించాలని బోధమయానంద అన్నారు. చికాగోలో విశ్వవేదికపై సర్వమత ప్రతినిధుల సమావేశంలో స్వామిజీ భారతీయ ఆధ్యాత్మిక ఆత్మను ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. స్వాతంత్రం వచ్చాక ఇతర దేవీదేవతలను వదలి యాభై సంవత్సరాల పాటు భారతమాతను పూజించడం ద్వారా భారత్ విశ్వగురు స్థానానికి, పరమ వైభవ స్థితికి తప్పక చేరుకుంటుందని ఆయన దృఢంగా విశ్వసించేవారని బోధమయానంద పేర్కొన్నారు. ఈ సభలో మరికొందరు కూడా ప్రసంగించారు. స్వామి వివేకానంద.. భారత యువతను తట్టిలేపడంతో పాటు వారిలో స్ఫూర్తినింపిన వైనాన్ని వక్తలు తమ ప్రసంగాల్లో ప్రస్తావించారు. ‘భాగ్యనగరంలో వివేకానంద’ పేరుతో రూపొందించిన వీడియోను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో వీఐహెచ్ఈ డైరెక్టర్ స్వామి బోధమయానంద, రామకృష్ణ ప్రభ ఎడిటర్ స్వామి పరిజ్ఞేయానంద, స్వామి భీతిహరానంద, బ్రహ్మచారులు జైకృష్ణ, సవ్యసాచి, మహబూబ్ కాలేజ్ యాజమాన్యం, ప్రిన్సిపాల్ వేంకటేశ్వరరావు, ఇతర ప్రముఖులు, రామకృష్ణమఠం భక్తులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also read:

Kalyanram is Agent Vinod: 1940 బ్యాక్‌డ్రాప్‌లో ఈ స్పై థ్రిల్లర్‌ మూవీ ఏజెంట్ వినోద్ గా రానున్న నందమూరి హీరో

Game Of Thrones : ఆ సింగర్ నన్ను కట్టేసి, కొరడాతో కొడుతూ లైంగికంగా వేధించాడు.. చీకటి రోజులు గుర్తు తెచ్చుకున్న నటి