హైదరాబాద్‌లో పాకిస్తాన్‌ కాస్మెటిక్స్‌ కలకలం.. రూ.7 లక్షల విలువైన ఉత్పత్తులు సీజ్‌!

హైదరాబాద్‌లో పాకిస్తాన్‌లో తయారైన అనధికారిక కాస్మెటిక్ ఉత్పత్తులపై టాస్క్‌ఫోర్స్‌, CDSCO అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. నాంపల్లి, హబీబ్‌నగర్‌, సంతోష్‌నగర్‌ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో సుమారు రూ.7 లక్షల విలువైన స్కిన్‌-వైటెనింగ్‌ క్రీములు, సబ్బులను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఉత్పత్తుల్లో అధిక మోతాదులో హెవీ మెటల్స్‌ ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు..

హైదరాబాద్‌లో పాకిస్తాన్‌ కాస్మెటిక్స్‌ కలకలం.. రూ.7 లక్షల విలువైన ఉత్పత్తులు సీజ్‌!
Illegal Pakistan Made Cosmetics

Edited By:

Updated on: Oct 02, 2026 | 2:49 PM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 2: పాకిస్తాన్‌లో తయారైన అనధికారిక కాస్మెటిక్ ఉత్పత్తుల విక్రయాలు, పంపిణీపై హైదరాబాద్‌ సిటీ టాస్క్‌ఫోర్స్‌, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. నాంపల్లి, హబీబ్‌నగర్‌, సంతోష్‌నగర్‌ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో సుమారు రూ.7 లక్షల విలువైన అక్రమ కాస్మెటిక్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అధికారుల వివరాల ప్రకారం..

విశ్వసనీయ సమాచారం మేరకు సెప్టెంబర్‌ 30, 2026న టాస్క్‌ఫోర్స్‌ బృందాలు CDSCO డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు డాక్టర్‌ శ్రీధర్‌ మిట్టపల్లి, అంజన్‌ గౌడ్‌ పెందెంతో కలిసి తనిఖీలు చేపట్టాయి. నాంపల్లిలోని బ్యూటీ లేడీస్ ఎంపోరియం, బ్యూటీ క్వీన్ షాప్‌, ఎస్.జె. మెడికల్ షాప్‌, సంతోష్‌నగర్‌లోని మదీనా కాస్మెటిక్స్‌తో పాటు సంబంధిత గోడౌన్‌లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనధికారికంగా నిల్వ ఉంచిన కాస్మెటిక్‌ ఉత్పత్తులను సీజ్‌ చేసినట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న వాటిలో ప్రధానంగా చర్మ కాంతి కోసం వినియోగించే స్కిన్‌-వైటెనింగ్ క్రీములు, సబ్బులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇవి పాకిస్తాన్‌లో తయారైన ఉత్పత్తులుగా గుర్తించినట్లు తెలిపారు. ఇలాంటి కాస్మెటిక్‌ ఉత్పత్తులను భారతదేశంలో దిగుమతి చేసి విక్రయించాలంటే సంబంధిత నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ అవసరం. CDSCO సెప్టెంబర్‌ 8న జారీ చేసిన ప్రజా ఆరోగ్య హెచ్చరికలో కొన్ని పాకిస్తాన్‌లో తయారైన కాస్మెటిక్స్‌కు భారతదేశంలో దిగుమతి కోసం రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ జారీ కాలేదని పేర్కొంది.

CDSCO ప్రజా నోటీసు ప్రకారం Goree Beauty Cream, Chandni Whitening Cream వంటి అనధికారిక ఉత్పత్తుల్లో నిర్దేశిత పరిమితులకు మించి హెవీ మెటల్స్‌ ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించారు. వీటి వినియోగం ఆరోగ్యానికి ప్రమాదం కలిగించడంతో పాటు విషపూరిత ప్రభావాలకు దారితీయవచ్చని CDSCO హెచ్చరించింది. అనధికారిక కాస్మెటిక్‌ ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని, ఇప్పటికే కొనుగోలు చేసి ఉంటే వాటిని వినియోగించవద్దని CDSCO ప్రజలకు సూచించింది. కాస్మెటిక్‌ ఉత్పత్తులను కొనుగోలు చేసే సమయంలో వాటి తయారీదారు, దిగుమతిదారు, లేబులింగ్‌, రిజిస్ట్రేషన్‌ వివరాలను పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చర్మాన్ని తెల్లగా మార్చుతాయంటూ ప్రచారం చేసే అనధికారిక క్రీములను వైద్య లేదా నియంత్రణ సంస్థల వివరాలు పరిశీలించకుండా ఉపయోగించకపోవడం మంచిది.

Loading...
Unable to load recommendations.
Follow Us