హైదరాబాద్‌లో పోలింగ్ ముగిసిపోయింది. 6 గంటల దాటింది కాబట్టి వైన్స్ ఓపెన్ చేస్తారు. మంచిగా వైన్స్‌కి వెళ్లి లిక్కర్ సేవిద్దాం అనుకుంటన్న మందుబాబులకు ఊహించని ఝలక్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. వాస్తవానికి మే 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి.. మే 13 సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు, బార్లు మూసేయాలని తొలుత ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. లిక్కర్ షాపులతో పాటుగా వివిధ జిల్లాలు, నగరాల్లో బార్లు, కల్లు కాపౌండ్ కూడా క్లోజ్ చేయాలని సూచించింది. దీంతో గత రెండ్రోజులుగా మందుబాబులు చుక్క దొరక్క అల్లాడిపోతున్నారు. సోమవారం సాయంత్రం షాపులు ఓపెన్ అవుతాయి కదా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే హైదరాబాద్ నగరంలో మందుబాబులకు పోలీస్ కమిషనర్ ఝలక్ ఇచ్చారు. జంట నగరాల్లో సోమవారం పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైన్ షాపులు, బార్లు తెరవటానికి వీల్లేదని స్పష్టం చేశారు. మే 13 రోజంతా దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎండల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియను సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు పెంచారు. 6 గంటల లోపు క్యూలో నిలబడిన అందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఈ క్రమంలోనే అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా… ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ తెలిపారు.
కాగా.. ప్రస్తుతం ఓ వైపు ఎండలు మండిపోతున్న క్రమంలో తెలంగాణలో బీర్లు విపరీతంగా తాగేస్తున్నారు. దీంతో బీర్లు అస్సలు దొరకడం లేదు. ఈ ఇష్యూపై మందుబాబులు ఆందోళన కూడా నిర్వహించారు. వేసవి తాపం తీర్చుకునేందుకు చల్లని బీర్లు కూడా దొరకడం లేదంటూ తమ బాధను వెల్లిబుచ్చుతున్నారు. అంతలోనే ఎలక్షన్స్ రావడంతో.. లిక్కర్ షాపులు పూర్తిగా క్లోజ్ అయ్యాయి. దీంతో రోజూ మద్యం తాగే అలవాటు ఉన్న మందుబాబులు అల్లాడిపోతున్నారు. ఇక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జూన్ 4న కూడా వైన్ షాపులు బంద్ కానున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…