హాయ్.. నా పేరు మోనిక అంటూ పులిహోర కలిపింది.. ఆమెను నమ్మిన డాక్టర్.. చివరకు..
హైదరాబాద్ ఎర్రగడ్డకు చెందిన 44 ఏళ్ల దంత వైద్యుడు భారీ సైబర్ మోసానికి గురయ్యారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళ మాయమాటలు నమ్మి నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు పెట్టిన ఆయన ఏకంగా రూ.14.61 కోట్లు కోల్పోయారు. లాభాలు చూపిస్తూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు చివర్లో డబ్బు విత్‌డ్రాకు పన్ను పేరుతో మరో రూ.7.5 కోట్లు డిమాండ్ చేశారు.

ఆయనో వైద్యుడు.. అన్ని తెలుసు.. బాగా సంపాదించాడు.. ఓ ఫైన్ మార్నింగ్ ఓ లేడీ నుంచి ఫేస్‌బుక్‌లో మెస్సెజ్ వచ్చింది.. హాయ్.. నా పేరు మోనికా మాధవ్.. మీతో మాట్లాడాలి.. అంటూ మాటలు కలిపింది.. ఇంకేముంది.. మిడిల్ ఏజ్‌లో మిడిల్ ఏజ్‌లో ఉన్న డాక్టర్ కూడా పులిహోర కలిపాడు.. దీంతో ఇద్దరి మధ్య పర్సనల్ నుంచి ట్రేడింగ్ వరకు యవ్వారం కొనసాగింది.. చివరకు, సోషల్ మీడియాలో అపరిచితుల మాయమాటలు నమ్మి ఆ దంత వైద్యుడు ఏకంగా రూ.14.61 కోట్లు పోగొట్టుకున్నాడు.. ఈ సంచలన సైబర్ నేరం హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డలో వెలుగు చూసింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ మహిళ విసిరిన వలపు వలలో పడి, ఆమె సూచించిన నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు పెట్టి సదరు డాక్టర్ ఘోరంగా మోసపోయాడు. అయితే, సైబర్ నేరగాళ్ళు ఒక్క వ్యక్తి వద్ద కొల్లగొట్టిన అత్యంత పెద్ద మొత్తాలలో ఇది ఒకటి కావడం గమనార్హం..
వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డకు చెందిన 44 ఏళ్ల దంత వైద్యుడికి ఆగస్టు 27న ఫేస్‌బుక్‌లో ఓ మహిళ నుంచి మెసేజ్ వచ్చింది. తన పేరు ‘మోనికా మాధవ్’ అని, చెన్నైలో ఉంటానని పరిచయం చేసుకున్న ఆ మహిళ.. వ్యక్తిగత విషయాలు మాట్లాడే నెపంతో సంభాషణను టెలిగ్రామ్‌కు మార్చింది. పెళ్లైందని.. కానీ.. తన భర్తతో విభేదాలు వచ్చాయని చెప్పింది.. త్వరలో విడాకులు అవుతున్నాయని నమ్మించిన ఆ మహిళ, తాను ట్రేడింగ్ ద్వారా రోజుకు రూ.4 లక్షల నుండి రూ.5 లక్షలు సంపాదిస్తున్నానని నమ్మబలికింది. తనతో కలిసి ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు వస్తాయని ఆశ చూపించింది.
విడతల వారీగా కోట్ల రూపాయల దోపిడీ:
సెప్టెంబరు 3న సదరు వైద్యుడు ఆమె చెప్పిన సైట్‌లో మొదటిసారిగా రూ.30 లక్షలు డిపాజిట్ చేశారు. దానికి రూ.8.6 లక్షలు లాభం వచ్చినట్లు నకిలీ డాష్‌బోర్డ్‌లో చూపించారు. పైగా అందులోంచి రూ.85,000 విత్‌డ్రా చేసుకోవడానికి కూడా అనుమతించడంతో డాక్టర్ ఆ ప్లాట్‌ఫామ్‌ను పూర్తిగా నమ్మేశారు. ఆ తర్వాత.. కోట్లు వస్తాయంటూ మరింత ముగ్గులోకి దింపింది.. ఇద్దరం కలిసి రూ.10 కోట్లు పెట్టుబడి పెడదామని మోనిక ప్రతిపాదించడంతో డాక్టర్ ఒప్పుకున్నారు. తన వద్ద ఉన్న పొదుపు మొత్తాలతో పాటు, భారీగా అప్పులు చేసి విడతల వారీగా మొత్తం రూ.14.51 కోట్లు ఆ నకిలీ యాప్‌లో జమ చేశారు. అయితే.. దానికి కూడా లాభం వచ్చినట్లు చెప్పుకొచ్చింది.. వైద్యుడి ఖాతాలో ఏకంగా రూ.34 కోట్ల లాభం ఉన్నట్లు సైట్లో కనిపించింది.
విత్‌డ్రా సమయానికి..
లాభాల రూపంలో వచ్చిన డబ్బును తన బ్యాంకు ఖాతాలోకి విత్‌డ్రా చేసుకోవడానికి డాక్టర్ ప్రయత్నించగా, ఆ ఆప్షన్ పనిచేయలేదు. దీంతో డాక్టర్ కంగారు పడ్డాడు.. ఈ విషయంపై ప్రశ్నించేందుకు ప్రయత్నించగా, మోనికా తన కాంటాక్ట్ నంబర్లను బ్లాక్ చేసి మాయమైంది. ఆ ప్లాట్‌ఫామ్ కస్టమర్ కేర్‌ను సంప్రదించగా… వచ్చిన లాభాలను తీసుకోవాలంటే ముందుగా రూ.7.5 కోట్లు ట్యాక్స్ రూపంలో చెల్లించాలని చెప్పారు. దీంతో తాను తీవ్రంగా మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ ఘటన సంచలనంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
