‘సాగరం’లా మారిన హుస్సేన్ సాగర్.. పొంచి ఉన్న టెర్రర్..!

| Edited By:

Sep 27, 2019 | 1:53 PM

భాగ్య నగరంపై వరుణుడి ప్రతాపం ఇంకా ఆగలేదు. గత కొన్ని రోజులుగా కుంభవృష్టిగా కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగరం మొత్తం జలమయమైంది. ఒక్క సెప్టెంబరు నెలలో గత 111 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. కొన్ని కాలనీల్లో నీళ్లు నిలిచిపోవడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. పలుచోట్ల ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో రాత్రంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు నగరవాసులు. కొన్ని ప్రదేశాల్లో మనుషులు కొట్టుకుపోతున్నారు. […]

సాగరంలా మారిన హుస్సేన్ సాగర్.. పొంచి ఉన్న టెర్రర్..!
Follow us on

భాగ్య నగరంపై వరుణుడి ప్రతాపం ఇంకా ఆగలేదు. గత కొన్ని రోజులుగా కుంభవృష్టిగా కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగరం మొత్తం జలమయమైంది. ఒక్క సెప్టెంబరు నెలలో గత 111 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. కొన్ని కాలనీల్లో నీళ్లు నిలిచిపోవడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. పలుచోట్ల ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో రాత్రంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు నగరవాసులు. కొన్ని ప్రదేశాల్లో మనుషులు కొట్టుకుపోతున్నారు. మరోవైపు భారీ వర్షాలతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఇక గురువారం ఉదయం నుంచి కాస్త గ్యాప్ ఇచ్చినట్లే ఇచ్చి.. మళ్లీ నగరం నిద్రపోతున్న వేళ ఒక్కసారిగా వరుణుడు విజృంభించాడు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరవాసులు మళ్లీ ఉలిక్కిపడ్డారు. ఇంకా వర్షాలు మరికొన్ని రోజులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

కాగా వరుస వర్షాలతో నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్‌కు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో హుస్సేన్ సాగర్ ప్రమాదకరస్థాయిలో నిండిపోయింది. కాలనీల నుంచి కాల్వల ద్వారా వస్తున్న నీళ్లు సాగర్‌లోకి చేరుతుండడం.. మరోవైపు వర్షాలు ఇంకా ఆగకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా, ప్రస్తుతం 512.10 మీటర్లుగా ఉంది. దీంతో గురువారం సాగర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాలకు ఎలాంటి ప్రమాదం లేదని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. మరోవైపు నగరంలో సహాయక చర్యల కోసం 84 ప్రత్యేక బృందాలను బల్దియా రంగంలోకి దింపింది. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగానికి చెందిన 13 ప్రత్యేక డిజాస్టర్ రెస్క్యూ బృందాలు క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కదిద్దుతున్నాయి.

అయితే వర్షాలు ఇలాగే కొనసాగితే మాత్రం భాగ్యనగర్ వాసులకు పెను ప్రమాదం పొంచి ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.  ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌కు ఇలా భారీ వర్షాలు రావడం కొత్తేం కాదు. 1908 సంవత్సరంలో సెప్టెంబర్ 26 నుంచి 28 వరకు 36 గంటల్లో 16 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో దాదాపు 15వేల మంది ప్రాణాలు కోల్పోగా.. 20వేల ఇళ్లు నేలమట్టం అయ్యాయి. నగరంలో ఉన్న మూడు వంతెనలు(అఫ్జల్, ముస్సాలం జంగ్, చాదర్‌ఘాట్‌) తెగిపోయాయి. ఆ తరువాత 2000 సంవత్సరంలోనూ హైదరాబాద్‌లో రికార్డు వర్షపాతం నమోదైంది. ఆగష్టు 20న 24.1 సెం.మీ అతి భారీ వర్షం కురవగా.. ఎన్నో ప్రాంతాలు జలమయమయ్యాయి. పలువురు ప్రాణాలను కోల్పోగా.. భారీ ఆస్తి నష్టం జరిగింది. అంతేకాదు ఆ సమయంలో వీధుల్లో బోట్లను వేసుకొని నగరవాసులు ప్రయాణించారు.