TIMS: సనత్‌నగర్ టిమ్స్‌లో ‘నర్సింగ్ అలారం’.. నర్సులు వచ్చే వరకు మోగుతూనే ఉంటుంది.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే తొలిసారి!

TIMS Hospital: సాధారణంగా సిబ్బంది రక్త నమూనాలు, ఇతర శాంపిల్స్‌ను చేతితో ల్యాబ్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. న్యూమాటిక్ ట్యూబ్‌ వ్యవస్థతో ఈ ప్రక్రియకు పట్టే సమయం తగ్గనుంది. ముఖ్యంగా గుండెపోటు, తీవ్రమైన గాయాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో పరీక్షల ఫలితాలు త్వరగా అందితే వైద్యులు..

TIMS: సనత్‌నగర్ టిమ్స్‌లో నర్సింగ్ అలారం.. నర్సులు వచ్చే వరకు మోగుతూనే ఉంటుంది.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే తొలిసారి!
Tims Hospital

Edited By:

Updated on: Aug 24, 2026 | 7:48 AM

హైదరాబాద్‌: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణిస్తే.. ముఖ్యంగా రాత్రివేళల్లో పక్కన అటెండెంట్ లేకపోతే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తక్షణ సాయం అందించేందుకు సనత్‌నగర్‌లోని డాక్టర్‌ ఎంసీఆర్‌ టిమ్స్‌లో నూతన నర్సింగ్ అలారం వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.

బెడ్‌ పక్కనే అలారం బటన్

ప్రతి రోగి బెడ్‌ వద్ద ప్రత్యేకంగా అలారం బటన్‌ను ఏర్పాటు చేశారు. రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి లేదా ఇతర అత్యవసర పరిస్థితి ఎదురైతే బటన్‌ను నొక్కితే చాలు.. సంబంధిత నర్సింగ్ స్టేషన్‌లో వెంటనే అలారం మోగుతుంది. అలారం ఏ వార్డు, ఏ బెడ్‌ నుంచి వచ్చిందో అక్కడే గుర్తించే విధంగా వ్యవస్థను రూపొందించారు. నర్సు రోగి వద్దకు చేరుకుని బెడ్‌ పక్కనున్న బటన్‌ను ఆఫ్‌ చేసే వరకు అలారం కొనసాగుతుంది. దీంతో రోగికి సిబ్బంది స్పందించే సమయం కూడా స్పష్టంగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. రాత్రివేళల్లో ఒంటరిగా ఉండే రోగులు, వృద్ధులు, శస్త్రచికిత్స అనంతరం చికిత్స పొందుతున్న వారికి ఈ విధానం మరింత ఉపయోగకరంగా ఉండనుంది.

ప్రభుత్వాస్పత్రిలో తొలిసారి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ తరహా నర్సింగ్ అలారం వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం రాష్ట్రంలో ఇదే తొలిసారిగా వైద్య వర్గాలు చెబుతున్నాయి. అత్యవసర సమయాల్లో రోగి నుంచి నర్సింగ్ సిబ్బందికి సమాచారాన్ని వేగంగా చేరవేయడం ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం.

న్యూమాటిక్ ట్యూబ్‌ సిస్టమ్‌తో మరింత వేగం

టిమ్స్‌లో అత్యవసర వైద్య సేవలను వేగవంతం చేసేందుకు న్యూమాటిక్ ట్యూబ్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలోని వార్డులు, ఎమర్జెన్సీ, ల్యాబొరేటరీ, ఫార్మసీ, బ్లడ్ బ్యాంక్ వంటి విభాగాలను ప్రత్యేక ట్యూబ్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానించారు. రక్త నమూనాలు, ఇతర వైద్య నమూనాలు, మందులు, మెడికల్ రిపోర్టులు, అత్యవసర సామగ్రిని ప్రత్యేక క్యాప్సూల్స్‌లో ఉంచి గాలి పీడనంతో ఒక విభాగం నుంచి మరో విభాగానికి పంపేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.

పరీక్షల ఫలితాలు వేగంగా

సాధారణంగా సిబ్బంది రక్త నమూనాలు, ఇతర శాంపిల్స్‌ను చేతితో ల్యాబ్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. న్యూమాటిక్ ట్యూబ్‌ వ్యవస్థతో ఈ ప్రక్రియకు పట్టే సమయం తగ్గనుంది. ముఖ్యంగా గుండెపోటు, తీవ్రమైన గాయాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో పరీక్షల ఫలితాలు త్వరగా అందితే వైద్యులు చికిత్సపై వేగంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. నర్సింగ్ అలారం, న్యూమాటిక్ ట్యూబ్‌ వ్యవస్థలు అందుబాటులోకి రావడంతో అత్యవసర పరిస్థితుల్లో స్పందన వేగం పెరగడంతో పాటు ఆస్పత్రిలోని వివిధ విభాగాల మధ్య సమన్వయం మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Gold Price Today: భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతో తెలుసా..?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us