QR Code Scam: డ్రై ఫ్రూట్స్‌ ఆర్డర్‌.. రీఫండ్‌ పేరుతో QR కోడ్‌ పంపి రూ.2.60 లక్షలు స్వాహా!

ఆన్‌లైన్‌ షాపింగ్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు కొత్తకొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా డ్రై ఫ్రూట్స్‌ హోం డెలివరీ పేరుతో ఓ విశ్రాంత ఉద్యోగిని నమ్మించి ఏకంగా రూ.2.60 లక్షలు కాజేశారు. తొలుత రూ.1,700 విలువైన డ్రై ఫ్రూట్స్‌ ఆర్డర్‌ చేసిన మహిళ.. చివరకు తన బ్యాంకు ఖాతా నుంచి భారీ మొత్తాన్ని కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

QR Code Scam: డ్రై ఫ్రూట్స్‌ ఆర్డర్‌.. రీఫండ్‌ పేరుతో QR కోడ్‌ పంపి రూ.2.60 లక్షలు స్వాహా!
Instagram Dry Fruits QR Code Scam

Updated on: Oct 06, 2026 | 11:16 AM

హైదరాబాద్‌, అక్టోబర్ 6: సనత్‌నగర్‌లోని లోధా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న విశ్రాంత ఉద్యోగి మీనా అహుజా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో డ్రై ఫ్రూట్స్‌ హోం డెలివరీ ప్రకటనను చూశారు. ప్రకటనను నమ్మి రూ.1,700 విలువైన డ్రై ఫ్రూట్స్‌ను ఆర్డర్‌ చేసి ఆన్‌లైన్‌లో చెల్లించారు. కొంతసేపటి తర్వాత అదే ఫోన్‌ నంబర్‌ నుంచి ఓ వ్యక్తి ఆమెకు ఫోన్‌ చేశాడు. డ్రై ఫ్రూట్స్‌ పార్సిల్‌ క్యాష్‌ ఆన్‌ డెలివరీ విధానంలో వస్తుందని, ముందుగా చెల్లించిన రూ.1,700 మొత్తాన్ని తిరిగి రీఫండ్‌ చేస్తామని నమ్మించాడు. అనంతరం ఓ క్యూఆర్‌ కోడ్‌ను పంపించి దాన్ని స్కాన్‌ చేయాలని సూచించాడు. మహిళ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయగానే ఆమె ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా నుంచి రూ.21,700 డెబిట్‌ అయ్యాయి.

రీఫండ్‌ పేరుతో మరోసారి మోసం

తన ఖాతా నుంచి నగదు డెబిట్‌ కావడంతో మహిళ ఆ వ్యక్తిని సంప్రదించారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పొరపాటున నగదు డెబిట్‌ అయిందని, మొత్తం తిరిగి జమ చేస్తామని నిందితుడు నమ్మించాడు. మరో క్యూఆర్‌ కోడ్‌ను పంపి స్కాన్‌ చేయించాడు. ఈసారి రూ.43,000 ఆమె ఖాతా నుంచి మాయమయ్యాయి. ఇలా రీఫండ్‌ పేరుతో పలుమార్లు క్యూఆర్‌ కోడ్‌లు పంపించి.. మహిళను నమ్మిస్తూ మొత్తం రూ.2,60,100 స్వాహా చేశారు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో చోరీలు, మోసాలకు పాల్పడుతున్న మహిళా ముఠాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కూకట్‌పల్లి పరిధిలో మహిళల నుంచి నగదు, నగలు దోచుకున్న ముగ్గురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అలాగే ధూల్‌పేట్‌, బేగంబజార్‌, సరూర్‌నగర్‌ ప్రాంతాల్లో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని వారి దృష్టి మరల్చి మోసాలకు పాల్పడుతున్న మరో ముఠాకు చెందిన ఇద్దరు మహిళలను మంగళ్‌హాట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద పసిపిల్లలను గుర్తించి ఎత్తుకెళ్లే ముఠా కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. నగరంలో ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో నేరాలను అడ్డుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో పోలీసులు నిఘా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

రద్దీ ప్రాంతాలే టార్గెట్‌

తెలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌ తదితర ప్రాంతాలకు చెందిన కొందరు మహిళలు ముఠాలుగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో ముఠాలో నలుగురి నుంచి పది మంది వరకు సభ్యులు ఉంటున్నట్లు సమాచారం. రైతుబజార్లు, వారసంతలు, మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌, సిటీ బస్సులు, మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్‌, సాధారణ రైళ్లను ఇలాంటి ముఠాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. రద్దీ సమయాల్లో ప్రయాణికుల మధ్య కలిసిపోయి.. ఒకరినొకరు నెడుతున్నట్లు నటిస్తూ మెడలోని బంగారు గొలుసులు, చేతిసంచుల్లోని నగదు, ఇతర విలువైన వస్తువులను అపహరిస్తున్నారు. ముఠాలో కొందరు నేరానికి పాల్పడుతుండగా.. మిగిలిన సభ్యులు చుట్టుపక్కల పరిస్థితులను గమనిస్తూ పోలీసుల కదలికలను పరిశీలిస్తారు. దీంతో బాధితులు గుర్తించేలోపే ముఠా సభ్యులు అక్కడి నుంచి పరారవుతున్నారు.

ఇవి కూడా చదవండి

బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, పోస్టాఫీసుల వద్ద కూడా వృద్ధులను లక్ష్యంగా చేసుకునే ముఠాలు చురుగ్గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తొలుత మహిళా సభ్యులు వృద్ధులను మాటల్లోకి దించి.. ఆ తర్వాత భయాందోళనకు గురిచేసి వారి వద్ద ఉన్న సంచులు లేదా నగదును లాక్కుని పారిపోతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అలాగే పాత బంగారం, తవ్వకాల్లో దొరికిన బంగారం, విదేశాల నుంచి అక్రమంగా వచ్చిన బంగారు బిస్కెట్లు అంటూ తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పి వ్యాపారులు, గృహిణులను మోసం చేసే ముఠాల్లో మహిళలు, పురుషులు కలిసి పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఢిల్లీ, గుజరాత్‌కు చెందిన మరో మహిళా ముఠా విదేశీ కరెన్సీ ఉందంటూ తెల్లకాగితాలను చూపించి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన కొందరు నిందితులు వివాహాలు, శుభకార్యాలకు బంధువుల మాదిరిగా హాజరై.. ఫంక్షన్‌హాళ్లలో వధూవరులకు కేటాయించిన గదుల్లోకి ప్రవేశించి నగలు అపహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు నగరానికి చెందిన కొందరు మహిళలు ముసుగులు ధరించి నగలు, చీరలు దొంగతనం చేసిన ఘటనలపై ఇప్పటికే ఐదు కేసులు నమోదయ్యాయి.

ఇలాంటి ముఠాలు రద్దీ ప్రాంతాల్లో సంచరించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు నగదు, నగలు తీసుకెళ్లే సమయంలో అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఆన్‌లైన్‌ రీఫండ్‌ పేరుతో ఎవరైనా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయమని కోరితే అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా లావాదేవీలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us