బీజేపీలో భారీ మార్పుల వెనక పెద్ద వ్యూహం కనిపిస్తోంది. తెలంగాణలో ముఖ్యంగా బండి సంజయ్ పట్ల కొత్త నేతల్లో కొంత వ్యతిరేకత ఉంది. ఇవే విషయమై ఫిర్యాదులు కూడా చేశారు. దీనిపై విస్త్రృతంగా చర్చించిన తర్వాత అందరికీ అమోదయోగ్యంగా ఉండే కిషన్ రెడ్డి వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్న కిషన్ రెడ్డి.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు. దీంతో ఆయనకు పగ్గాలు అప్పగించి ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడాలని పార్టీ భావిస్తోంది. ఎన్నికలకు కూడా కేడర్ ను సిద్దం చేసే బాధ్యతను కిషన్ రెడ్డికి అప్పగిస్తున్నారు..
అటు ఏపీలో కూడా బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంటోంది. సోము వీర్రాజును మార్చాలని చాలాకాలంగా ఫిర్యాదులున్నాయి. గతంలో కన్నా లక్ష్మీనారాయణను మార్చి సోమును అధ్యక్షుడిగా నియమించారు. అయితే సోము వైసీపీకి దగ్గరగా ఉంటూ ప్రభుత్వ వ్యతిరేకతను బలంగా జనాల్లోకి తీసుకెళ్లడం లేదన్న బావన కేడర్‌లో ఉంది. అదే సమయంలో కన్నా వంటి సీనియర్లు పార్టీ వీడటానికి కారణం కూడా సోము తీరే అంటూ విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిని మార్చాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది.
సత్యకుమార్ ఎంపిక వెనక టీడీపీకి అనుకూలంగా ఉండే ఓ వర్గం చక్రం తిప్పినట్టు చెబుతున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా బలంగా తన వాయిస్ వినిపిస్తారు సత్యకుమార్. గతంలో ఆయనపై వైసీపీ కేడర్ దాడులు కూడా చేసింది. సోము వీర్రాజు అమరావతి సహా పలు విషయాల్లో సాఫ్ట్‌గా ఉన్నా సత్యకుమార్ ఇందుకు భిన్నంగా అమరావతి ఉద్యమంలో బలంగా వాయిస్ వినిపించారు. టీడీపీకి అనుకూలంగా ఉండే సుజనాచౌదరి, సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డి వంటి వాళ్ల ఛాయిస్ కూడా సత్యకుమార్ అంటున్నారు.