
కార్తీక దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుని ఓ వృద్ధురాలు మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చాపర్ల భానుమతి అనే వృద్ధురాలు ఎస్‌ఆర్ నగర్‌లోని జగన్నాథ రెసిడెన్సీలో ఉంటున్న తన కూతురు కిన్నెర వద్ద నివాసం ఉంటున్నారు. ఈ నెల 23న రెండో కార్తీక సోమవారం సందర్భంగా ఇంట్లో దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె చీరకు నిప్పంటుకుంది.
ఆ మంటలు కొన్ని క్షణాల్లోనే ఒళ్లంతా వ్యాపించాయి. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు మంటలు ఆర్పేలోపే ఆమె శరీరం దాదాపు 50 శాతంపైగా కాలిపోయింది. వెంటనే ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ రెండు రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం బుధవారం ప్రాణాలు కోల్పోయారు.
పండగ పూట తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధితురాలి కూతురి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.