
బోనాల పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. లాల్ దర్వాజా బోనాలు, దర్బార్ మైసమ్మ బోనాలు, కార్వాన్ బోనాల సందర్భంగా పాతబస్తీతో పాటు అంబర్‌పేట్ ప్రాంతంలోనూ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పోలీసులు సూచించారు. పాతబస్తీలోని సింహవాహిని శ్రీ మహంకాళి లాల్ దర్వాజా బోనాల సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ఊరేగింపు ముగిసే వరకు, సోమవారం ఉదయం 9 గంటల నుంచి ఊరేగింపు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.
ఇంజిన్ బౌలి, ఫలక్‌నుమా నుంచి ఆలియాబాద్ వైపు వచ్చే వాహనాలను కొత్త షంషేర్‌గంజ్ ‘టీ’ జంక్షన్ వద్ద గోశాల, తాడ్‌బన్ లేదా గోశాల–మిస్రీగంజ్, ఖిల్వత్ వైపు మళ్లిస్తారు. మహబూబ్‌నగర్ ఎక్స్‌రోడ్ నుంచి ఆలియాబాద్ వైపు వెళ్లే వాహనాలను ఇంజిన్ బౌలి వద్ద జహానుమా, గోశాల, తాడ్‌బన్ లేదా ఖిల్వత్ వైపు మళ్లించనున్నారు.
నాగుల్‌చింత, సుధా టాకీస్ నుంచి లాల్ దర్వాజా ఆలయం వైపు వచ్చే వాహనాలను నెహ్రూ మోడ్ వద్ద సుధా టాకీస్, గౌలీపురా మీదుగా అనుమతిస్తారు. గౌలీపురా నుంచి లాల్ దర్వాజా మోడ్ వైపు వచ్చే వాహనాలను సుధా టాకీస్ వద్ద హరిబౌలి మీదుగా మీర్‌చౌక్ వైపు మళ్లిస్తారు. చార్మినార్ నుంచి నాగుల్‌చింత వైపు వెళ్లే వాహనాలను హరిబౌలి, వోల్గా హోటల్, మిస్రీగంజ్ మార్గంలో అనుమతించనున్నారు.
రాజన్న బౌలి నుంచి లాల్ దర్వాజా ఆలయం వైపు వచ్చే వాహనాలను వెంకటేశ్వరస్వామి ఆలయం లేన్ వద్ద రామస్వామి గంజ్ వైపు మళ్లిస్తారు. కందికల్ గేట్ నుంచి వచ్చే వాహనాలను ఓపీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ ‘వై’ జంక్షన్ వద్ద గౌలీపురా వైపు పంపుతారు. బాలాగంజ్ నుంచి వచ్చే వాహనాలను లక్ష్మీదేవి పాన్ షాప్ వద్ద నెహ్రూ స్టాచ్యూ, నాగుల్‌చింత జంక్షన్ వైపు మళ్లిస్తారు.
ఉప్పుగూడ, ఛత్రినాక నుంచి గౌలీపురా మీదుగా వచ్చే వాహనాలను బాలరాజ్ జ్యువెలర్స్ గౌలీపురా ఎక్స్‌రోడ్స్ వద్ద మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ వైపు మళ్లించనున్నారు. పాత చంద్రాయణగుట్ట నుంచి ఛత్రినాక వైపు వచ్చే భారీ వాహనాలను సంతోష్‌నగర్, చంద్రాయణగుట్ట వైపు అనుమతిస్తారు.
➡️లాల్ దర్వాజా బోనాలు, దర్బార్ మైసమ్మ బోనాలు కార్వాన్ బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు
✳️హైదరాబాద్ నగరంలో ఆగస్టు 09, 2026 మరియు ఆగస్టు 10, 2026 తేదీలలో జరగనున్న బోనాల పండుగ ఉత్సవాలను పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నట్లు… pic.twitter.com/Pip5j9KDzq
— Hyderabad City Police (@hydcitypolice) August 8, 2026
తెలంగాణ, ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులను చార్మినార్, ఫలక్‌నుమా, నయాపూల్ వైపు అనుమతించరు. వాటిని పాత సీబీఎస్, అఫ్జల్‌గంజ్, దారుల్‌షిఫా ఎక్స్‌రోడ్స్, ఛత్రినాక, ఇంజిన్ బౌలి వద్ద నిలిపి ప్రత్యామ్నాయ మార్గాల్లో నడపనున్నారు.
మరోవైపు అంబర్‌పేట్ మహంకాళి ఆలయం వద్ద కూడా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఆంక్షలు ఉంటాయి. ఉప్పల్ నుంచి చాదర్‌ఘాట్, ఎంజీబీఎస్ వైపు వెళ్లే జిల్లా, సిటీ బస్సులు సహా అన్ని వాహనాలను అంబర్‌పేట్ ఫ్లైఓవర్ మీదుగా అనుమతిస్తారు. చాదర్‌ఘాట్, ఎంజీబీఎస్ నుంచి వచ్చే బస్సులు, భారీ వాహనాలకు కూడా ఇదే మార్గాన్ని వినియోగించనున్నారు.
రామంతాపూర్ నుంచి ఆలయానికి వచ్చే భక్తులు అంబర్‌పేట్ ఫ్లైఓవర్ వద్ద ఎడమ బైలేన్‌లో గాంధీ విగ్రహం వైపు వెళ్లి, అక్కడి నుంచి ఎడమ మలుపు తీసుకుని అంబర్‌పేట్ జీహెచ్‌ఎంసీ మైదానంలో వాహనాలు పార్క్ చేయాలి. రామంతాపూర్ నుంచి ఆలీ కేఫ్, రోడ్ నంబర్ 6 వైపు వెళ్లే వాహనాలను గాంధీ విగ్రహం ఎడమ బైలేన్ వద్ద మళ్లించి సల్దానా గేట్ మీదుగా పంపుతారు. తిలక్‌నగర్, ఎన్‌సీసీ నుంచి రామంతాపూర్, ఉప్పల్ వైపు వెళ్లే ఆర్టీసీ, సిటీ బస్సులు, భారీ వాహనాలను రోడ్ నంబర్ 6 జంక్షన్ వద్ద గోల్నాక వైపు మళ్లించి అంబర్‌పేట్ ఫ్లైఓవర్ మీదుగా అనుమతించనున్నారు.