హైడ్రాకు ఇక తిరుగులేదు. హైడ్రా కూల్చివేతలను ఇక ఎవరూ ఆపలేరు. హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం. హైడ్రాకు చట్టబద్ధతపై ఇటీవల కేబినెట్‌లో ఆమోదం తెలిపిన తెలంగాణ ప్రభుత్వం.. ఆర్డినెన్స్‌పై సంతకం కోసం రాజ్‌భవన్‌కి ఫైల్ పంపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
ఆర్డినెన్స్ పరిశీలించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. గవర్నర్ ఆమోదించడంతో హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదలైంది. అయితే హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా 374(బి) సెక్షన్ చేరుస్తున్నట్లుగా ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడేందుకు జీహెచ్ఎంసీ అధికారాలు హైడ్రాకు అప్పగించారు. జలాశయాలు, రోడ్లు, పార్కులు, ఇతర ఆస్తులను కాపాడే బాధ్యత అధికారి లేదా ఏజెన్సీకి అప్పగించే అధికారం ప్రభుత్వానికి కల్పిస్తూ ఆర్డినెన్సు జారీ చేశారు.
ఇదిలావుంటే, హైడ్రా కూల్చివేతలను వ్యతిరేకిస్తూ.. ఆ సంస్థ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ న్యాయస్థానాల్లో అనేక పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఈ కారణంగా చట్టబద్దత కలిపించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేకంగా అసెంబ్లీని నిర్వహించి చట్టాన్ని ఆమోదించాలని అనుకున్నా.. అంత అవసరం లేదని ముందుగా ఆర్డినెన్స్ జారీ చేస్తే సరిపోతుందని నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకు ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్‌కు పంపారు. పరిశీలించిన గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో హైడ్రాకు పుల్ పర్మిషన్ వచ్చేసింది.
మరోవైపు శుక్రవారమే హైడ్రాకు తెలంగాణ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పాలి. హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఇప్పటికిప్పుడు హైడ్రా కూల్చివేతలు ఆపలేమని స్పష్టం చేసింది. హైడ్రా, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. తదుపరి విచారణ అక్టోబర్ 14 కి వాయిదా వేసింది. ఇప్పుడు చట్టబద్దత కల్పించినందున ఈ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..